ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా మహా శివరాత్రి జాతర నిర్వహించాలి

– రాష్ట్ర బీసీ & రవాణా శాఖ మంత్రి పొన్నం,ప్రభుత్వ విప్ ఆది
– ప్రత్యేక పాసుల విధానం రద్దు… ప్రత్యేక దర్శనానికి రూ.300 టికెట్ల జారీ..
– మహాశివరాత్రి జాతర ఘనంగా జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి..
– శ్రీశైలం తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలి..
– దాతల సహాయంతో  500 అతిధి గృహంలు నిర్మించేలా కార్యాచరణ..
– భక్తులకు నిత్య అన్నదానం సత్రం ఏర్పాటుకు కృషి..
– మహాశివరాత్రి జాతర ఏర్పాట్ల పై ప్రభుత్వ విప్ జిల్లా కలెక్టర్, ఎస్పీ తో కలిసి  రివ్యూ నిర్వహించిన  మంత్రి పొన్నం..
నవతెలంగాణ – వేములవాడ
మహాశివరాత్రి జాతర ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అగరంగ వైభవంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర బీసీ&రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయం ఓపెన్ స్లాబ్ లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లాస్థాయి అధికారులతో  కలిసి మంత్రి పాల్గొన్నారు.  మార్చి 7 నుంచి మార్చి 9 వరకు 3 రోజుల పాటు మహా శివరాత్రి జాతర వేడుకలను అత్యంత వైభవోపేతంగా వేములవాడలో నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను మంత్రి శాఖల వారీగా రివ్యూ నిర్వహించారు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా  జాతర  నిర్వహించాల్సి ఉంటుందని, నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి పూర్తయ్యే విధంగా  చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.  ఈ సందర్భంగా  రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ క్షేత్రంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే జాతర ఆధ్యాత్మికంగా, దైవికంగా నిబంధనలు పాటిస్తూ, ఎక్కడ ఎలాంటి లోపాలు జరగకుండా నిర్వహించాలని అన్నారు.  వేములవాడ ఆలయంలో జరిగే పూజలలో ఎలాంటి లోపాలు ఉండకుండా చూడాలని, శాస్త్రపరంగా స్వామి వారి పూజలు ఘనంగా జరగాలని, భక్తులకు త్వరగా దర్శనం లభించే విధంగా చర్యలు తీసుకోవాలని, జాతర నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని  మంత్రి అధికారులకు సూచించారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా మార్చి 7 నుంచి మార్చి 9 వరకు వేములవాడకు  ఎక్కువ బస్సు సర్వీసులు నడపాలని, మహాలక్ష్మి పథకం నేపథ్యంలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉందందున అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తుల రద్దీ ఆధారంగా డిపో మేనేజర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అవసరమైన రోడ్లలో అదనపు సర్వీసులు నడపాలని వెల్లడించారు. వేములవాడలో ఆలయానికి సమీపంలో  అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలు, పొలాలను రైతుల సంపూర్ణ సహకారంతో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని, వేములవాడ పట్టణానికి వచ్చే అన్ని ప్రధాన రోడ్లలో ఉన్న గుంతలను వెంటనే పూడ్చివేయాలని రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించాలని, రోడ్ల పక్కన ఉన్న బావుల కు ఫెన్సింగ్ లు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.  జాతర సందర్భంగా వచ్చే భక్తులకు త్రాగునీటి ఇబ్బందులు కలక్కుండా ఎక్కడికక్కడ త్రాగునీటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఆలయ పరిసరంలో అపరిశుభ్రత కాకుండా మూడు షిఫ్ట్ లో పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.
జాతర సందర్భంగా వైద్య క్యాంపులు ఏర్పాటు చేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యమైన ప్రదేశాలలో అన్ని పందిళ్ళ వద్ద మంటలు ఆర్పే ఫైర్ యంత్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి పేర్కొన్నారు. మహాశివరాత్రి జాగారం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని దానికోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని మహాభారతం, శివపురాణం మొదలగు భక్తి పర్యంతమైన కార్యక్రమాలు జరిగేలా చూడాలని, జాతరను పర్యవేక్షించేందుకు  అన్ని శాఖల అధికారుల, నోడల్ ఆఫీసర్ల సమన్వయంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, భక్తుల కోసం ఎక్కడికక్కడ హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని  కోరారు . మహాశివరాత్రి జాతర సందర్భంగా గతంలో అందించే ప్రత్యేక పాసులను పూర్తిస్థాయిలో రద్దు చేస్తున్నామని, వాటి స్థానంలో ప్రత్యేక దర్శనానికి రూ.300 టికెట్ ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. జాతర అనంతరం వేములవాడ  శైవ క్షేత్రాన్ని శ్రీశైలం తరహాలో అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక బద్ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని  తెలిపారు.  వేములవాడలో సైతం బ్రేక్ దర్శనం, అభిషేకం కుంకుమ పూజలు నిర్వహించేందుకు ప్రత్యేక ఆలయం, ఆలయంలో అందించే ప్రతి సేవకు సంబంధించిన వివరాలు ఆన్ లైన్ లో పొందుపర్చడం వంటివి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. దాతల సహాయంతో అందుబాటులో ఉన్న స్థలంలో భక్తుల కోసం 500 గదులతో అతిథి గృహలను నిర్మించేందుకు  ప్రణాళిక రూపొందించాలని,  దాతల కు కల్పించే సదుపాయాల అంశంలో  వేములవాడ ఆలయ కమిటీ   శ్రీశైలం ,తిరుపతి లో అవలంబించే విధానాలను ఇక్కడ అవలంబించాలని  పేర్కొన్నారు. ప్రస్తుతం వేములవాడలో ఉన్న అన్నదాన సత్రం, అక్కడ ఉన్న సిబ్బంది తదితర వివరాలతో నివేదిక తయారు చేయాలని, భవిష్యత్తులో భక్తుల సహాయంతో వేములవాడ లో సైతం నిత్య అన్నదాన సత్రం ఏర్పాటు చేసి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శించుకునే భక్తులకు ప్రతిరోజు అన్నదానం చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలని అన్నారు.
 ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..మహాశివరాత్రి జాతరను కట్టుదిట్టంగా పని చేసే విజయవంతంగా నిర్వహించాలని, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడే విధంగా వేములవాడ పట్టణాన్ని సన్నద్ధం చేయాలని అన్నారు. వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని, ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రత దుర్వాసన ఉండకుండా చర్యలు తీసుకోవాలని, జాతర సమయంలో కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ..  మంత్రి, ప్రభుత్వ విప్ అందించిన సూచనలు పాటిస్తూ అధికారులు వివిధ శాఖల మధ్య ఉన్న చిన్న చిన్న సమన్వయ లోపాలను పరిష్కరించుకొని పకడ్బందీగా జాతర నిర్వహించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఆలయంలో భక్తులకు త్వరగా దర్శనం లభించే విధంగా క్యూలైన్ నిర్వహించాలని, భక్తులతో సిబ్బంది ఎక్కడ దురుసుగా ప్రవర్తించవద్దని, చాలా సహనంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
వేములవాడ ఆలయం ప్రధాన అర్చకులు అప్పల భీమ శంకర శర్మ మాట్లాడుతూ.. మహాశివరాత్రి జాతర సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను వివరించారు.  మార్చ్ 7 రాత్రి ఏడు గంటల 30 నిమిషాలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుందని, మార్చి 8 తెల్లవారుజామున 12 గంటల నుంచి 2.30 గంటల వరకు ఊరు జనులకు సర్వదర్శనం, తెల్లవారుజామున 2.30 గంటల నుంచి ఉదయం 3.30 గంటల వరకు ప్రజాప్రతినిధులు స్థానిక అధికారులకు దర్శనం, ఉదయం 3.30 నుంచి 3.40 గంటల వరకు మంగళ వాయిద్యంలో ప్రదర్శన, ఉదయం 3.40 నుంచి 4.30 గంటల వరకు సుప్రభాతం సేవ, ఆలయ శుద్ధి, ఉదయం 4.30 నుంచి 6 గంటల వరకు ప్రాతకాల పూజ,/అనువంశిక అర్చకుల దర్శనం ఉంటుందని తెలిపారు. మహాశివరాత్రి మార్చి 8 ఉదయం 8:30కు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల పట్టు వస్త్రాల సమర్పణ, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు శివదీక్ష స్వాముల దర్శనం, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మహా లింగార్చన (స్వామివారి కల్యాణ మండపంలో) అనువంశిక బ్రాహ్మణోత్తముల దర్శనం , రాత్రి 11.35 నిమిషాలకు లింగోద్భావ కాలం నందు శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వాక ఏకాదశ రుద్రాభిషేకము నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సమావేశం అనంతరం దేవాలయ ప్రాంగణం పరిసరాలు పరిశీలించి దైవదర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అఖీల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, డి.ఎస్పి. నాగేంద్ర చారి, ఈ ఓ  కృష్ణా ప్రసాద్ , ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, స్థానికులు, పాత్రికేయులు  తదితరులు పాల్గొన్నారు.
Spread the love