నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోనూ చమురు, గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా పేర్కొంది. అలాగే డిజిటల్ లావాదేవీల్లో భాగంగా ఆన్ లైన్ లో గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ 99 శాతానికి చేరుకున్నాయని స్పష్టం చేసింది. ఓటీపీ ఆధారిత డెలివరీలు 94.5 శాతానికి చేరినట్లు పేర్కొంది. అంతేకాక పీఎన్‌జీ కనెక్షన్ల సంఖ్య దేశవ్యాప్తంగా సుమారు 8 లక్షలకు చేరినట్లు వివరించింది. ప్రస్తుతం దేశంలోని ఏ పంపిణీ కేంద్రంలోనూ సరఫరా నిలిచిపోలేదని అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది.
మరోవైపు మే 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ రూల్స్ లో మార్పులు రాబోతున్నట్లు స్పష్టం అవుతోంది. కొత్త రూల్స్ బుకింగ్స్ ప్రభావం చూపుతాయని తెలుస్తోంది. మే 1, 2026 నుంచి గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు రానున్నట్లు సమాచారం. అలాగే సిలిండర్ బుకింగ్స్ లోనూ మార్పులు రానున్నాయి. గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ లో 25 రోజుల గ్యాప్ కచ్చితంగా ఉండేలా చూస్తున్నట్లు సమాచారం. అలాగే ఓటీపీ బేస్డ్ డెలివరీ వ్యవస్థను ఇకపై పర్మనెంట్ చేయనున్నారు. ఈ రూల్ ప్రకారం నమోదు చేసుకున్న మొబైల్ నెంబర్ కు ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ చెబితేనే సిలిండర్ డెలివరీ అవుతుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇండియన్ చమురు కంపెనీలు అమెరికా నుంచి ఎల్పీజీని దిగుమతి చేసుకుంటున్నాయి. జూన్- జులై నాటికి డెలివరీ పూర్తి కానుంది. ప్రస్తుతం భారత్ కు 80 వేల టన్నుల ఎల్పీజీ రోజూ అవసరం పడుతోంది. అయితే డొమెస్టిక్ ప్రొడక్షన్ మాత్రం రోజుకు 46వేల టన్నులు మాత్రమే ఉంది.



