సవరణలు చేయండి ఎన్నికల కమిషనర్ల బిల్లుపై

Make corrections On the Election Commissioners Bill– ఎంపీలకు విద్యావేత్తల బహిరంగ లేఖ
న్యూఢిల్లీ : ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలలో చర్చకు వచ్చే అవకాశమున్న ఎన్నికల కమిషనర్ల బిల్లులో సవరణలు చేయాలని పలువురు విద్యావేత్తలు, ప్రభుత్వ మాజీ ఉన్నతోద్యోగులు, హక్కుల కార్యకర్తలు ఎంపీలను కోరారు. ఈ మేరకు వారు ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ సవరణల ద్వారా ఎన్నికల కమిషన్‌ రాజకీయాలకు అతీతంగా, స్వతంత్ర సంస్థగా వ్యవహరించేలా చూడాలని వారు డిమాండ్‌ చేశారు. మోడీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర కమిషనర్ల బిల్లును తిరిగి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రతిపాదిత బిల్లు దేశ ప్రజాస్వామ్యాన్ని నీరుకారుస్తుందని, ఏక పార్టీ పాలనకు దారితీస్తుందని ఆ లేఖలో వివరించారు.
ఎన్నికల కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండే వచ్చే ఫిబ్రవరిలో పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో తమ అభ్యర్థనను అత్యవసరమైనదిగా పరిగణించాలని వారు కోరారు. ఈ బిల్లు ప్రస్తుత రూపంలోనే ఆమోదం పొందితే పాండే వారసుడి ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లోపిస్తుందని, రాబోయే ఎన్నికల దృష్ట్యా ఎన్డీఏ ప్రభుత్వం తనకు ఇష్టమైన వ్యక్తిని ఆ పదవిలో కూర్చోబెట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌ను, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను, ఇతర కమిషనర్లను నియమించే ఎంపిక కమిటీకి ప్రధాని ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ప్రతిపక్ష నేత, ప్రధాని నియమించే క్యాబినెట్‌ మంత్రి సభ్యుడిగా ఉంటారు. గతంలో ఈ కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ఉండేవారు. ఆయనను కమిటీ నుండి తప్పిస్తూ కేంద్రం బిల్లు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో బిల్లుకు ఆమోదం లభిస్తే కమిషన్‌ స్వతంత్రతపై అనుమానాలు రేకెత్తుతాయని ఆ లేఖలో తెలియజేశారు.
‘గత అనుభవాల దృష్ట్యా పెద్దగా చర్చ జరపకుండానే ఈ బిల్లును ఆమోదించే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలను సంప్రదించకుండానే ప్రభుత్వం ఈ బిల్లును హడావిడిగా ప్రవేశపెట్టింది. ప్రజల్లో కూడా దీనిపై విస్తృత చర్చ జరగలేదు. సుప్రీంకోర్టు మార్చి 2న ఇచ్చిన ఆదేశాల మేరకు కమిషన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియను పారదర్శకతతో చేపట్టాల్సి ఉంటుంది. న్యాయస్థానం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా బిల్లును రూపొందించాల్సి ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు సూచనలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. ఎన్నికల కమిషన్‌ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ ఎన్నికలను స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా నిర్వహించాల్సి ఉంది. అయితే తాజా బిల్లులోని పలు నిబంధనలు ఈ విషయాన్ని విస్మరించాయి. ఈ నేపథ్యంలో కమిషన్‌ సమగ్రతను కాపాడాలంటే కొన్ని చట్టపరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని చేర్చాలి. ఈసీ సభ్యుడికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదా కల్పించాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించేందుకు అనుసరించే పద్ధతులనే ఎన్నికల కమిషనర్ల కూడా వర్తింపజేయాలి. ఎంపిక కమిటీ ప్రొసీడింగ్స్‌ను పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచాలి’ అని ఆ లేఖలో సూచించారు.
బహిరంగ లేఖపై అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (హైదరాబాద్‌) మాజీ ప్రిన్సిపాల్‌ ఈఏఎస్‌ శర్మ, ఐఐఎం అహ్మదాబాద్‌ మాజీ ప్రొఫెసర్‌ జగదీప్‌ ఎస్‌ ఛోకర్‌, మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంఘటన్‌ నేత అరుణా రారు, జేఎన్‌యూ ప్రొఫెసర్‌ ఎమరిటస్‌ ప్రభాత్‌ పట్నాయక్‌, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ఎస్‌పీ శుక్లా తదితరులు సంతకాలు చేశారు.

Spread the love