స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లు చేయండి

– అధికారులకు సీఎస్‌ ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆగస్టు 15వ తేదీ జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారుల్ని ఆదేశించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని శుక్రవారంనాడిక్కడి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో చెప్పారు. డీజీపీ జితేందర్‌, జీఏడీ కార్యదర్శి రఘునందన్‌ రావు, పోలీసు, విద్యుత్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ముందుగా ముఖ్యమంత్రి పరేడ్‌ గ్రౌండ్‌లోని సైనిక అమర వీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించి, తర్వాత గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఎగుర వేస్తారని వివరించారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా అసెంబ్లీ, కౌన్సిల్‌, హైకోర్టు, రాజ్‌భవన్‌, సెక్రటేరియట్‌ భవనాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. జాతీయ పతాకం ఎగురవేసే ప్రధాన వేదిక వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్‌అండ్‌బి శాఖకు చెప్పారు. పారిశుద్ధ్య పనులు, అంబులెన్స్‌లు, నర్సింగ్‌ అసిస్టెంట్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. పార్కింగ్‌ ఏర్పాట్లు, ట్రాఫిక్‌ రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేయాలని పోలీసు శాఖకు సూచించారు. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలని ఫైర్‌ శాఖను, అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. వెయ్యి మంది కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నామని కల్చరల్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు సీఎస్‌కు తెలిపారు. సాంప్రదాయ వస్త్రధారణతో కళాకారుల ప్రదర్శనలు వేదికకు వన్నె తెచ్చేలా ఉంటాయని అధికారులు వివరించారు. వచ్చేనెల 13న ఫుల్‌ డ్రెస్‌ రిహార్సల్స్‌ జరుగుతాయనీ, 10వ తేదీ నుంచి రిహార్సల్స్‌ ఉంటాయని అధికారులు వివరించారు.

Spread the love