ఉమ్మడి మిడ్జిల్ మండల్ అభివృద్ధి కోసమే సీఎం రాక
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
నవతెలంగాణ-మిడ్జిల్
ఈనెల 4న ఉమ్మడి మిడ్జిల్ ఊరుకొండ మండలాల ప్రజలకు మిడ్జిల్లో నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను జయప్రదం చేయడానికి ప్రజలందరూ భారీ ఎత్తున తరలిరావాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో సీఎం సభ ఏర్పాట్లను, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , గోపాల్ రెడ్డి విగ్రహాల ఏర్పాట్లను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. మిడ్జిల్ ప్రజల రుణం తీర్చుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
మిడ్జిల్–ఉర్కొండకు మండలాలకు భారీ నిధులు నిధులు కేటాయించి, అభివృద్ధికి కీలక ప్రకటనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయనున్నారని చెప్పారు. సుమారు 20 సంవత్సరాల క్రితం ఇదే జూలై నెలలో నేటి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సామాన్య వ్యక్తిగా మిడ్జిల్ మండలం నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఆ రోజు నుంచి నేటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన తన రాజకీయ ప్రయాణంలో మిడ్జిల్ మండల ప్రజల ఆదరణ, ఆశీర్వాదాలు కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో స్వయంగా పేర్కొన్నారని తెలిపారు.
మిడ్జిల్ మండల ప్రజలపై ఉన్న కృతజ్ఞతాభావంతో, వారి రుణం తీర్చుకునే సంకల్పంతోనే జూలై 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిడ్జిల్ మండల కేంద్రానికి విచ్చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం 20 సంవత్సరాల రాజకీయం పూర్తవుతున్న సందర్భంగా జూలై 4న నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి, మిడ్జిల్ సర్పంచ్ ఎడ్ల శంకర్ ముదిరాజ్ , వెంకటయ్య సాయిలు విజయ్ కుమార్ శంకర్ నాయక్ సంపత్ కుమార్, ఉస్మాన్, పర్వతాలు, దానియేలు తదితరులు పాల్గొన్నారు.



