Tuesday, September 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేయండి

ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేయండి

- Advertisement -

అసెంబ్లీ కమిటీలతో కౌన్సిల్‌ చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌‌రెడ్డి
మెరుగైన సౌకర్యాలను కల్పించాలి : అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌‌కుమార్‌
ఎనిమిది అసెంబ్లీ కమిటీలతో చైర్మెన్‌, స్పీకర్‌ భేటీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

చట్టసభల్లో అన్నీ అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉండకపోవచ్చని, అలాంటి వాటిని లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు చేయడంలో కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ప్రజల సంక్షేమం, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలు, ప్రజాధనం సద్వినియోగం వంటి అంశాలపై కమిటీలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అంచనాల కమిటీ ప్రభుత్వ శాఖలకు కేటాయిస్తున్న నిధులు సక్రమంగా, లక్ష్యాలకు అనుగుణంగా వినియోగమవుతున్నాయా అనే అంశాన్ని పరిశీలిస్తూ ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేయాలని అన్నారు. వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ పర్యావరణ పరిరక్షణతో పాటు అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందన్నారు. భావితరాలకు ఆరోగ్యకరమైన పర్యావర ణాన్ని అందించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. అదేవిధంగా సౌకర్యాల కమిటీ ప్రజాప్రతి నిధులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలించి మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని అన్నారు. గ్రంథాలయ కమిటీ శాసనసభ, శాసన మండలి సభ్యులకు అవసరమైన సమాచారాన్ని, చట్టాలు, నివేదికలు, పరిశోధన పత్రాలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని శాసనసభ గ్రంథాలయాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. శాసన పరిషత్ సమావేశ మందిరంలో శాసనమండలి (లెజిస్లేచర్) కమిటీల ప్రారంభ సమావేశాలు సోమవారం జరిగాయి .శాసనసభ్యులు, మండలి సబ్యులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌‌కుమార్‌ అన్నారు. సౌకర్యాల కమిటీ ప్రధానంగా సభ్యుల నివాస వసతులు, పరిశుభ్రత, నిర్వాహణ, ఆహార, క్యాటరింగ్, వైద్య సౌకర్యాలు, భద్రత వంట అంశాలపై దృష్టి సారిస్తుందన్నారు. ముఖ్యంగా మాజీ సభ్యుల సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వారు అందించిన విలువైన సేవల కృషిని గౌరవిస్తూ వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేలా మనం కృషి చేయాలని అన్నారు. ముఖ్యంగా వైద్యం, పెన్షన్ కు సంబంధించిన సౌకర్యాలు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. కమిటీ సభ్యులు అందరికీ అనుకూలమైన, ఆధునికమైన అర్ధవంతమైన సిఫారసులను రూపొందించడంలో తమవంతు కృషి చేసి విలువైన సూచనలు, సలహాలను అందించాలని కోరారు. అంచనాల కమిటీ ప్రజాధనం దుబారా కాకుండా ప్రతి శాఖ నుంచి సమాచారాన్ని తెప్పించుకుని క్షుణ్ణంగా పరిశీలించి, చర్చించి తగు సూచనలు చేయాలని చెప్పారు. కమిటీలు ప్రభుత్వ పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశాలకు అంచనాల కమిటీ చైర్మెన్‌ కనకయ్య సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, పి రాకేశ్ రెడ్డి, యాదవ రెడ్డి, వన్యప్రాణులు , పర్యావరణ కమిటీ చైర్మెన్‌ హోదాలో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి, అనీల్ జాదవ్, సౌకర్యాల కమిటీ చైర్మెన్‌ హోదాలో పాల్గొన్న శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సభ్యులు మేడిపల్లి సత్యం, యల్ రమణ, ప్రకాష్ గౌడ్, నెల్లికంటి సత్యం, బండారి లక్ష్మారెడ్డి ఉన్నారు. అలాగే గ్రంథాలయ కమిటీ చైర్‌‌పర్సన్‌ రాగమయి గారు, సభ్యులు పల్వాయి హరీష్ బాబు, జుల్ఫీకర్ అలీ, దేశపతి శ్రీనివాస్, సిహెచ్ అంజిరెడ్డి, బొగ్గారపు దయానంద్ తో శాసన పరిషత్ కార్యదర్శి డా. వి నరసింహా చార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ చైర్మెన్లు, సభ్యులకు పుష్ప గుచ్ఛాలతో స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -