– కేంద్ర ప్రభుత్వ రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలకు
– నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు
నవతెలంగాణ – అశ్వారావుపేట
కేంద్ర ప్రభుత్వ రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) అశ్వారావుపేట మండల సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో సంయుక్త కిసాన్ మోర్చా మండల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) జిల్లా అధ్యక్షుడు గోకినపల్లి ప్రభాకర్ అధ్యక్షత వహించారు.
సమావేశంలో అఖిలభారత రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కిరపాటి పుల్లయ్య, సీపీఐ జిల్లా సమితి సభ్యులు జి. రామకృష్ణ, అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కంగాల కల్లయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ రైతాంగం, కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని విమర్శించారు. విదేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 39 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకురావడం ద్వారా కార్మికుల హక్కులను కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టారని ఆరోపించారు.
అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గిస్తూ, చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రైతులు పండించే పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు C2+50 శాతం సూత్రం ప్రకారం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు, సీపీఎం జిల్లా నాయకులు బి. చిరంజీవి, పిట్టల అర్జున్, సీపీఐ నాయకులు ఉగ్గల అర్జున్, పీవైఎల్ డివిజన్ కార్యదర్శి బాడిస లక్ష్మణరావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కంగాల వెంకటేష్, కారం రాజులు, వాసం పోతురాజు తదితరులు పాల్గొన్నారు.


