Sunday, July 5, 2026
E-PAPER
Homeసోపతిముద్రల మధ్య మనిషి!

ముద్రల మధ్య మనిషి!

- Advertisement -

మనిషి పుట్టినప్పుడు అతని చేతిలో ఎలాంటి గుర్తింపు పత్రం ఉండదు. అతని నుదుటిపై కులం రాసి ఉండదు. అతని గుండెలపై మతం ముద్రించి ఉండదు. అతని ఊపిరికి సరిహద్దులు ఉండవు. అతని నవ్వుకు వర్గాలు ఉండవు. అతని కన్నీటికి జాతులు ఉండవు. అతడు కేవలం ఒక మనిషి. కానీ పెరుగుతున్న కొద్దీ సమాజం అతనికి పేర్లు పెట్టదు… ముద్రలు వేస్తుంది.

ప్రపంచంలో అత్యంత విషాదకరమైన విషయం మనిషి చనిపోవడం కాదు, బ్రతికే ఉండి కూడా గుర్తించబడకపోవడం. అతని హృదయాన్ని కాకుండా అతని కులాన్ని, మతాన్ని, వర్గాన్ని చూసే సమాజం ఏర్పడింది. ‘అతడు మంచి మనిషా?’ అనే ప్రశ్న కనుమరుగై, ‘అతడు ఏ కులం?’ అనే ప్రశ్న తీర్పుగా మారిపోయింది. ఒక శిశువు పుడుతుంది. అది నవ్వుతుంది. ఏడుస్తుంది. తల్లి ఒడిలో పెరుగుతుంది. అప్పుడు దానికి కులం ఉండదు, మతం ఉండదు. కానీ సమాజం దానిపై గుర్తింపుల ముద్రలు వేయడం ప్రారంభిస్తుంది. ఇది ఈ కులం, ఇది ఆ మతం, ఇది ఈ వర్గం, ఇది ఆ జాతి, ఇది ధనిక, ఇది పేద అని విభజిస్తూ చివరికి మనిషిని ముక్కలుగా చేసి, అతడిలోని మనిషినే కోల్పోతుంది. రైలులో ఒక కిన్నెర ఎదురైతే చాలామంది చూపు తిప్పుకుంటారు. కానీ ఆమె కూడా ఒక తల్లి ఒడిలో పెరిగిన మనిషేనని మరిచిపోతారు. ఆమెకూ కలలు ఉంటాయి, ప్రేమ ఉంటుంది, గౌరవంగా జీవించాలనే కోరిక ఉంటుంది. ఆమెకూ కన్నీళ్లు ఉంటాయి, గాయాలు ఉంటాయి. కానీ సమాజం ఆమె హృదయాన్ని చూడదు. ఆమె గుర్తింపునే చూస్తుంది. ఇది ఆమె విషాదం కాదు, మన సమాజ నైతిక వైఫల్యం. ఒక మహిళ తన జీవిత భాగస్వామిని కోల్పోతుంది.

అది జీవితంలోనే అతి పెద్ద దుఃఖం. కానీ ఆ దుఃఖం సరిపోదన్నట్లు సమాజం మరో శిక్ష విధిస్తుంది. ఆమె నవ్వితే తప్పు. బయటకు వెళితే తప్పు. కొత్త జీవితాన్ని కోరుకుంటే తప్పు. ఆమె ఉనికే తప్పు. భర్తను మాత్రమే కాదు, గౌరవాన్ని కూడా కోల్పోయేలా చేస్తుంది. ఇది మరణం కంటే భయంకరమైన సామాజిక హింస. ఒక కూలీ చెమటతో రోజును ప్రారంభిస్తాడు. అతని చేతుల్లో పగుళ్లు ఉంటాయి. కానీ సమాజం అతడిని సాధారణంగా చూస్తుంది. అదే ధనవంతుడు దానం చేస్తే మహానుభావుడవుతాడు. ఇది ఆర్థిక అసమానత మాత్రమే కాదు, గౌరవం పంపిణీలోని అసమానత. చెమటకు విలువ ఇవ్వని సమాజం, చివరికి మనిషికీ విలువ ఇవ్వదు. ప్రేమించిన ఇద్దరు యువతీయువకులు కలిసి జీవించాలని నిర్ణయించుకుంటే వారిని నేరస్తుల్లా చూస్తారు. కులం దాటితే తప్పు. మతం దాటితే తప్పు. సాంప్రదాయం దాటితే తప్పు. కానీ ద్వేషం మాత్రం తప్పు కాదు. హింస మాత్రం తప్పు కాదు. మనుషులను కలిపే ప్రేమకు భయపడే సమాజం, మనుషులను విడగొట్టే గోడలను ఆరాధిస్తోంది. ఇదే మన సామాజిక వైరుధ్యం. ఇప్పటి సమాజం నిజాన్ని కాదు, ప్రతిష్ఠను పూజిస్తోంది. ఇంటి గోడల మధ్య ఎంత బాధ ఉన్నా పరవాలేదు. బయట నవ్వుతూ కనిపిస్తే చాలు. కూతురు ఏడుస్తున్నా పర్వాలేదు, కుటుంబ గౌరవం నిలబడాలి. కొడుకు విరిగిపోతున్నా పర్వాలేదు, ప్రజలు ఏమనుకుంటారో అదే ముఖ్యం. అలా మనం మనుషులను కోల్పోయి, ముసుగులను కాపాడుకుంటున్నాం. పంపడానికి పూలమాలలు వేస్తూ, మానవత్వాన్ని మూలన కూర్చోబెడుతున్నాం.

ప్రతి మనిషి ఒక ప్రపంచం. అతని లోపల ఒక చరిత్ర ఉంటుంది. ఒక చిన్ననాటి జ్ఞాపకం ఉంటుంది. ఒక తల్లి ప్రేమ ఉంటుంది. ఒక నెరవేరని కల ఉంటుంది. ఒక రహస్య బాధ ఉంటుంది. ఒక గెలవాలనే తపన ఉంటుంది. ఒక విరిగిన కల ఉంటుంది. ఒక దాచుకున్న కన్నీరు ఉంటుంది. కానీ మనం ఇవేమీ చూడం. ఒకే ఒక్క ముద్రను చూసి అతన్ని పూర్తిగా అర్థం చేసుకున్నామని అనుకుంటాం. అదే మన అజ్ఞానం. భవంతులు, ఫ్లైఓవర్లు, సాంకేతికత నాగరికత కాదు. ఒక పేదవాడు తలెత్తుకొని నడవగలిగే సమాజం నాగరికత. ఒక కార్మికుడి చెమటకు గౌరవం ఇచ్చే సమాజం నాగరికత. ఒక రైతు కష్టాన్ని గుర్తించే సమాజం నాగరికత. చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలు వచ్చాయి, పోయాయి. ఎన్నో మతాలు వ్యాపించాయి. ఎన్నో రాజ్యాలు పుట్టాయి. కానీ కాలం నిలబెట్టింది ఒకే సత్యాన్ని.. మనిషిని. అతని శ్రమను. అతని ప్రేమను. అతని సృజనను.

నాగరికతను నిర్మించింది రాజుల కత్తులు కాదు, కార్మికుల చెమట. చరిత్రను రాసింది పాలకుల ఆజ్ఞలు కాదు, ప్రజల పోరాటాలు. సమాజాన్ని నిలబెట్టింది అధికారం కాదు, మనిషి మనిషిపై ఉంచుకున్న నమ్మకం. అయితే విచిత్రంగా ప్రపంచాన్ని నిర్మించిన మనిషినే ప్రపంచం ఇంకా గుర్తించలేకపోతోంది. అతడిని కులాలుగా, మతాలుగా, వర్గాలుగా విభజిస్తోంది. కానీ మనిషి అసలు విలువ అతని గుర్తింపులో లేదు, అతని మానవత్వంలో ఉంది. అతని శ్రమలో ఉంది. అతని కలలలో ఉంది. అతని బాధను అర్థం చేసుకునే మన సామర్థ్యంలో ఉంది. శ్రమకు గౌరవం దక్కే చోటే సమానత్వం మొలకెత్తుతుంది. సమానత్వం పుష్పించే చోటే మానవత్వం పరిమళిస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు సమాజం కేవలం మనుషుల గుంపు కాదు. మనసులు కలిసిన మానవ కుటుంబం అవుతుంది.

మామిండ్ల రమేష్‌ రాజా, 7893230218

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -