Tuesday, March 24, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమార్చి 24 చలో ఢిల్లీ-జన్‌ ఆక్రోశ్‌ మహాగర్జన

మార్చి 24 చలో ఢిల్లీ-జన్‌ ఆక్రోశ్‌ మహాగర్జన

- Advertisement -

భారత ఎన్నికల సంఘం (ఇ.సి.ఐ) కేరళ, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించింది. మామూలుగానైతే ఇది సకృత్తుగా జరిగే తతంగమే. అయితే ప్రస్తుత అసాధారణ నేపథ్యం దీన్ని మున్నెన్నడూ ఎరగని ఉదంతంగా మార్చింది. పార్లమెంటు ఉభయ సభలూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సి.ఇ.సి) జ్ఞానేష్‌ కుమార్‌పై అభిశంసన తీర్మానం చర్చ చేపట్టబోతుండగా ఇది జరిగింది. బహుశా పదవిలో వున్న సిఇసిపై పార్లమెంటులో అభిశంసన తీర్మానం మొదటిసారి చర్చకు వచ్చింది. సమాన అవకాశల కల్పన అనేది కీలకమైన కొలబద్దగా న్యాయమైన స్వేచ్ఛాయుత ఎన్నికల బాధ్యత నిర్వహించవలసిన స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ విశ్వసనీయత భగమైన పరిస్థితిని ఈ పరిణామం ప్రతిబింబిస్తుంది. ఎన్నికల ఫలితాలెలా వుండబోతాయనే దానిపై దీనివల్ల నీలినీడలు పరుచుకున్న పరిస్థితి.

బీహార్‌లో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర పరిశీలన (సర్‌) ప్రక్రియతో మొదలుపెట్టి ఉద్రిక్తత పెరిగిపోతూ వస్తున్నది. అయితే ఇప్పుడు మరింత విస్తృతంగా పన్నెండు రాష్ట్రాలకు సంబంధించిన సుదీర్ఘ కసరత్తుగా ఇది రానుండడంతో ఈ విశ్వాసలేమి మరింత తీవ్రమైన ఆందోళనకర రూపం తీసుకున్నది. ఓటర్ల తుది జాబితాల ఖరారులో ఇసిఐ పౌరసత్వ నిర్ధారణ సమస్యను జప్పించడంతో ఈ ప్రక్రియ ఇష్టానుసారం జరిపించే పరిస్థితికే గాక పక్షపాత ధోరణికి కూడా దారితీసింది. అంతటి ప్రధానమైన తతంగం పూర్తిచేయడం కోసం బిగించిన కాలవ్యవధి ఎలా వుందో పశ్చిమ బెంగాల్‌లో చూస్తున్నదాన్ని బట్టి తెలుస్తుంది. అక్కడ శాసనసభ ఎన్నికలకు ఓటర్ల తుది జాబితా ప్రకటించిన తర్వాత కూడా అరవై లక్షల మంది ఓట్ల భవిష్యత్తు త్రిశంకు స్వర్గంలో వుండిపోయింది.

వాటిని తేల్చవలసిన అనిశ్చిత జాబితాగా పెట్టారు. ఇదివరకు ఎన్నడూ లేని తార్కికమైన తేడాలు అనే సరికొత్త కొలబద్ద ఒకటి తీసుకు వచ్చిన దాని పర్యవసానమిది. అయితే ఈ సంభావ్యత వల్ల కలిగే ప్రభావాలతో సామూహిక ఓట్ల తొలగింపునకు కొన్ని ప్రత్యేక తరహా ఆర్థిక అస్తిత్వ కోణాలు జోడించబడుతున్నాయి. ముఖ్యంగా మైనార్టీ తరగతుల వారి ఓట్లు తీసివేయబడుతున్నాయి. కొన్ని రకాలుగా ఈ పరిణామం ఖచ్చితంగా బీజేపీకి మేలు చేసేదిగానే గాక దాని ఆదేశాల మేరకు జరుగుతున్నదిగా కూడా కనిపిస్తుంది. అందువల్ల ఇసిఐ తన తటస్థ మధ్యవర్తిగా తన పాత్రను వదిలేయడమేగాక కేంద్ర ప్రభుత్వం దాని హోంమంత్రి అమిత్‌షాల హిందూత్వ పంథాను ప్రతిధ్వనిస్తున్నదనే అభిప్రాయం విస్తారంగా ఏర్పడింది.

నయా ఫాసిస్టు నమూనా
ఈవిధంగా ఒక స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థను దెబ్బ తీయడమనేది-ప్రస్తుతం భారత దేశాన్ని పాలిస్తున్న కార్పొరేట్‌ మతతత్వ కూటమి నయా ఫాసిస్టు లక్షణాల కీలకాంశం వంటిది. సమీప గతం చూస్తే లోక్‌సభ స్పీకర్‌పైన కూడా ఇదే విధమైన అభిశంసన తీర్మానంపై చర్చ జరిగింది. ఫలితం ఏమైనా కావచ్చుగాని అది కూడా చట్టసభ సంరక్షకుడి స్వతంత్రత లాలూచీ అనుమానాస్పదమైందని చాటిచెప్పింది. ఎన్నికల నిరంకుశత్వం అనే ప్రమాదాన్ని ఇది నొక్కిచెప్పింది.

పార్లమెంటు కార్యకలాపాలు ఆదరా బాదరాగా ముగించేసి అనేక ప్రజావ్యతిరేక శ్రామిక రైతు వ్యతిరేక శాసనాలను ఆమోదించడం, దారిలో పెట్టడం జరిగిపోతున్నది. ‘పీపుల్స్‌ డెమోక్రసీ’లో అనేక వ్యాసాలలో వివరంగా పేర్కొన్నట్టు అలాంటి పరిణామం ఆశ్చర్యకరమైందేమీ కాదు. దాన్ని లేదనుకోవడం కూడా కుదరదు. సంవత్సరాల తరబడి యూనియన్ల ద్వారా పోరాడి సాధించుకున్న లేబర్‌ కోడ్లు లాగివేయబడ్డాయి. కార్మికులు సాధించుకున్న బేరసారాల హక్కు, రోజులో పనిగంటలు వంటివన్నీ కార్పొరేట్లకు మేలు చేసేవిధంగా హరించబడ్డాయి.

ప్రజావ్యతిరేక శాసనాలు
ఇదే కోవలో ఇప్పుడు ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎ రూపంలో గ్రామీణ కార్మికులకు చట్టబద్ధమైన పని కల్పించేందుకు సాధించుకున్న కోర్కె కూడా వమ్ము చేయబడింది. ఆ స్థానంలో వి.బి గ్రామ్‌జి చట్టం వచ్చికూర్చుంది. గ్రామీణ పేదలకు పని అవసరాలను బట్టి ఉపాధి పొందే అవకాశం తొలగించబడింది. ఇప్పుడు వచ్చిన కొత్త కేంద్ర చట్టంలో నలభై శాతం నిధులు రాష్ట్రాలు భరించాలని నిబంధన పెట్టడం ద్వారా ఆర్థిక వెసులుబాటు లేకుండా పోతున్నది. ఎందుకంటే రాష్ట్రాలను నిధుల కొరత వెంటాడుతున్నది. దీనికి తోడు విద్యుత్‌ పంపిణీ ప్రైవేటీకరణ, ఇటు వినియోగదారులు అటు వ్యవసాయ రంగాలకు సంబంధించి స్తోమత లేని వర్గాల వారికి సబ్సిడీలు పూర్తిగా ఎత్తివేత జరుగుతున్నది.

ఈ వర్గాల నుంచి తప్పనిసరిగా సమకూరే అదనపు ఆదాయాలను మరింత పెంచడానికి ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించ బడుతున్నాయి. వినియోగదారులపై భారాలు ఆ విధంగా మరింతగా రుద్దబడుతున్నాయి. ఈ విధంగా పార్లమెంటులో సవివరమైన చర్చ లేకుండా గుప్పించబడుతున్న పచ్చి ప్రజా వ్యతిరేక శాసనాల జాబితా చాలా పెద్దదే అవుతుంది. దేశం తీవ్ర ఆర్థిక మందగమనంలో కూరుకుపోయిన వేళ, నిరుద్యోగం, అరకొర ఉద్యోగాలతో అసమానతలు తాండవిస్తున్న వేళ ఇది జరుగుతున్నది. అత్యంత విశాల ప్రాతిపదికన శ్రమజీవులను ఒక్కతాటిపైకి తెచ్చి ఒక్కుమ్మడిగా తమగొంతు వినిపించే పరిస్థితి తీసుకురావాలని వీటన్నిటినీ బట్టి చూస్తే స్పష్టంగా తెలుస్తుంది.

ఈ పూర్వ రంగంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఉత్తరాది రాష్ట్రాలలో ‘జన్‌ ఆక్రోశ్‌’ జాతా నిర్వహించాలని నిర్ణయించింది. సమస్యలతో సత మతమవుతూ ఆగ్రహంగా వున్న శ్రామిక ప్రజానీకం మహా ప్రదర్శనతో అది తారాస్థాయికి చేరుతుంది. ఏమైనా ఈ అంతర్గత విధాన సమస్యలతో పాటు భారత అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు ఏకపక్షంగా దేశంపై రుద్దబడింది. మోడీ సర్కార్‌ పచ్చిగా లొంగిపోయిన ఫలితమే ఇది. ఈ వాణిజ్య ఒప్పందం పరిధిని బట్టి చూస్తే ప్రజల జీవనోపాధిని దారుణంగా దెబ్బ కొట్టబోతున్నది. మరీ ముఖ్యంగా మొదటిసారిగా వ్యవసాయ రంగంలోకి దారులు తెరచే ప్రక్రియ జరుగుతోంది.

లొంగుబాటు దుష్ఫలితాలు
తర్వాతి దశలో ఇండియా అమెరికా ఒత్తిడికి దారుణంగా లొంగిపోవడంతో రష్యా నుంచి రాయితీపై వచ్చే చమురు, సహజవాయువు కొనుగోలు నిలిపేయడానికి అంగీకరించడం, బాగా హెచ్చు ధరకు అమెరికా చమురు కొనుగోలుకు ఒప్పుకోవడం ఈ హానికర పరిణామాలకు తోడైంది. అయితే వాటి ప్రభావం ఎలా వుంటుందనే చర్చ మొదలవకుండానే భారత దేశం అనుసరించే అమెరికా-ఇజ్రాయిల్‌ అనుకూల విదేశాంగ విధానం మరోకోణం మన ముందు నిలిచింది. నరేంద్ర మోడీ రెండు రోజుల ఇజ్రాయిల్‌ పర్యటనతో స్వతంత్ర విదేశాంగ విధానం, వ్యూహాత్మక స్వతంత్రం మచ్చుకైనా లేకుండా వదులుకున్నట్టయింది. పాలస్తీనా ప్రజలకు మద్దతు మాయమైంది.

మన సుదీర్ఘకాల స్నేహ దేశం, వ్యూహాత్మక భాగస్వామి ఇరాన్‌పై ఇజ్రాయిల్‌, అమెరికా దాడి చేశాయి. ఏ ఉద్దేశంతోనైతే అన్యాయమైన, అక్రమమైన ఈ దురాక్రమణ దాడికి పాల్పడ్డారో దాన్ని నెరవేర్చుకునే అవకాశం ఎంత మాత్రం లేదని గత పక్షం రోజులలో బాగా తేలిపోయింది. ఇరాన్‌ ప్రతిఘటనతో మద్దతుకు హామీ లభిస్తే అమెరికా, ఇజ్రాయిల్‌ దుష్టకూటమి ఏకాకి అయిపోవడం ఖాయమని తేటతెల్లమవుతున్నది. అమెరికా ఇజ్రాయిల్‌కు మద్దతునిచ్చేందుకు భారత దేశం చూపిన సుముఖత వల్ల మనకు ఇంధనం సరఫరా, ప్రత్యేకంగా ఎల్‌.పి.జి, ఎల్‌.ఎన్‌.జి నిరాటంకంగా రావడానికి ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి.

ఇది ప్రజల జీవితాలపైన, జీవనోపాధిపైన మరింత భారం మోపింది. ఈ సమస్యలే ‘జన్‌ ఆక్రోశ్‌’ ప్రదర్శన ముందుకు తెచ్చే ప్రక్రియకు మరింత కీలకంగా మారుస్తున్నాయి. మోడీ ప్రభుత్వం చేపట్టిన విధానాల ఫలితంగా క్షేత్ర స్థాయిలో దెబ్బతిన్న ప్రజానీకాన్ని మరింత బలంగా విస్తారంగా సమీకరించడంలో సారాంశం అదే. రానున్న శాసనసభ ఎన్నికల్లో వామపక్షాలను బలోపేతం చేసుకోవడమనే అంశం ‘జన్‌ ఆక్రోశ్‌’ ప్రదర్శన ఎంత తీవ్ర ధ్వనితో ఉమ్మడి స్వరం వినిపిస్తుందనే దాంతో ముడిపడి వుంది. అందువల్ల మార్చి 24 సమీకరణ మహాగర్జన కావాలి. మరింత విశాల ఐక్యత, శక్తివంతమైన పోరాటాల వైపు సాగిపోవాలి.

(మార్చి17 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -