ప్రొద్దుటూరు లింగరాజు పల్లి గ్రామాల మధ్యన ప్రజలకు రైతాంగానికి ఇబ్బందులకు గురి చేస్తున్న మట్టి రోడ్డును వెంటనే బీటి రోడ్డుగా మార్చాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి లు డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 1 నుండి 30వ తేదీ వరకు చేపట్టిన పల్లె పల్లెకు సీపీఐ(ఎం) పోరుబాట కార్యక్రమంలో భాగంగా పొద్దుటూరు గ్రామంలో సోమవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. గ్రామంలోని రైతాంగం తమ పొలాల వద్దకు వెళ్లే పొద్దుటూరు-లింగరాజు పల్లి గ్రామాల మధ్యన 3 కిలోమీటర్ల మేర ఉన్న మట్టి రోడ్డు గుంతల మయమై తీవ్రంగా ఇబ్బందులు గురిచేస్తుందన్నారు. నిత్యం ఈ రోడ్డువెంట వందలాది మంది ప్రజలు, రైతులు ప్రయాణం చేస్తుంటారని వెంటనే మట్టిరోడును బీటీ రోడ్డుగా మార్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రొద్దుటూరు నుండి వర్కట్ పల్లికి వెళ్లే మూసి వంతెనపై గల తాత్కాలిక బ్రిడ్జిపై నూతన బ్రిడ్జి నిర్మాణం చేసి ప్రొద్దుటూరు నుండి వర్కట్ పల్లి వరకు బిటి రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రామంలో అనేకమంది పేదలకు నేటికీ రేషన్ కార్డులు లేవని గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వక పోవడంతో తమ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే పరిస్థితి లేదని వెంటనే రేషన్ కార్డులు లేని కుటుంబాల అందరికీ నూతన రేషన్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు నుండి భీమ లింగం వరకు భీమ లింగం కాల్వ కట్టపై గల మట్టి రోడ్డు అధ్వానంగా మారిందని పొద్దుటూరు నుండి భీమలింగం వరకు రోడ్డు మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని కోరారు. ప్రొద్దుటూరు గ్రామంలో గల ఏనె గుట్టను ప్రభుత్వం తొలగించి రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఈర్లపళ్లి ముత్యాలు,మండల కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ ఏలే కృష్ణ, సిపిఎం శాఖ కార్యదర్శి పలుసం లింగం, సీపీఐ(ఎం) శాఖ సహాయ కార్యదర్శి పెద్ద బోయిన నరసింహ, నాయకులు గడ్డం సుదర్శన్,బత్తుల పురుషోత్తం,నర్సింహ,ముత్యాలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.