పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ: ఎండి అబ్బాస్

నవతెలంగాణ – కంటేశ్వర్
బీజేపీ నియంతృత్వ, మతోన్మాద పోకడలను, మోడీ అహంకారాన్ని  పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని, రాజ్యాంగానికి, ప్రజాస్వామిక విలువలకు పట్టం కట్టారని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎండి అబ్బాస్ అన్నారు. ఈ మేరకు మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో రామ్మోహన్ రావు అధ్యక్షతన పార్లమెంటు ఎన్నికలు – పరిశీలన అంశం పై శనివారం ట్రస్ట్ భవనంలో చర్చా గోష్టి జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని, 400 సీట్లు సాధించి రాజ్యాంగాన్ని మార్చాలని చూసిన బీజేపీ కి 240 సీట్లు మాత్రమే ఇచ్చి ప్రజలు ముకుతాడు వేశారని అన్నారు. ప్రజల దైనందిన జీవిత సమస్యలు పరిష్కారం చేయడంలో విఫలం చెందిన బిజెపి మత విద్వేషాలు రెచ్చగొట్టి మరోసారి విజయం సాధించాలని చూసిందని దీనిని ప్రజలు తిరస్కరించారని ఆయన అన్నారు. విభిన్న సంస్కృతుల నిలయమైన దేశాన్ని ఏక సంస్కృతి లోకి కుదించాలనే బీజేపీ ప్రయత్నాన్ని ప్రజలు ప్రతిఘటించారని, వైవిధ్యమే మన దేశ బలమని, దానినే ప్రజలు కాపాడుకోవడం కోసం కృషి చేశారని అన్నారు. అయితే ప్రమాదం తొలగిపోలేదని మరింత పట్టుదలతో నియంతృత్వ, మతోన్మాద పోకడలకు వ్యతిరేకంగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సమావేశంలో హుస్సేన్, ఈ వి ఎల్ నారాయణ, చంద్రశేఖర్, రాధా కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love