న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఒక ముస్లిం వ్యక్తిపై జరిగిన మూకదాడి గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఇద్దరు జర్నలిస్టులతో సహా ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని వివిధ మీడియా సంస్థలు తీవ్రంగా ఖండించాయి. ఈ నెల 5న షామ్లీ జిల్లాలోని జలలాబాద్ పట్టణంలో దొంగతనం చేశాడనే ఆరోపణలతో ఖురేషి అనే స్కాప్ వర్కర్‌పై మూకదాడి జరిగింది. ఈ దాడిలో కొట్టిన దెబ్బలతో ఖరేషి మరణించాడు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదయింది. ఈ మూక దాడి గురించి జర్నలిస్టులు జాకిర్ అలీ త్యాగి, వసీం అక్రమ త్యాగి, మరో ముగ్గురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరణించిన ఖురేషి ఫోటోను, ఖురేషి కుటుంబ సభ్యులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను, దాడిలో పాల్గొన్న కొంత మంది వ్యక్తుల పేర్లను పోస్టు చేశారు. దీంతో వీరిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నూతన క్రిమినల్ చట్టాల్లోని సెక్షన్ 196 (వివిధ గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), సెక్షన్ 353 (ప్రజల మధ్య విభజనకు కారణమయ్యే ప్రకటనలు చేయడం) కింద పోలీసులు అభియోగాలను మోపారు. దీనిని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ వుమెన్స్ ప్రెస్ కార్ప్, డిఐజిఐపియుబి తీవ్రంగా ఖండించాయి. ఈ ఎఫ్‌ఐఆర్‌తో క్రిమినల్ చట్టాలను దుర్వినియోగం చేశారని విమర్శించాయి. ఈ మేరకు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. అందుబాటులో ఉన్న సమాచారాన్ని నివేదించడం, పంచుకోవడం తప్పుకాదని తెలిపాయి. భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) కింద ఇలాంటి ఏకపక్ష ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)ను నేరుగా ఉల్లంఘించడం, జర్నలిస్టులను బెదిరించడంతో సమానమని విమర్శించాయి. ఇద్దరు జర్నలిస్టులపై తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.