ఆమె కేసు వివరాలు బీజేపీకి ఎవరు అందించారో విచారణ జరపాలి : కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు కాంగ్రెస్ కుట్రలే ముమ్మాటికీ కారణమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. ద్రోహం ఎవరు చేశారో కాంగ్రెస్ వాళ్లే తెలుసుకోవాలని అన్నారు. ఆమెపై ఉన్న కేసు వివరాలు బీజేపీ నేతలకు ఎవరు అందించారో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌లో పదవులు, డబ్బులకే వస్తున్నాయని షబ్బీర్ అలీ చెప్పినందుకు అభినందనలు చెప్పారు. ఆయన ఇప్పటికైనా ఉన్న వాస్తవాన్ని ప్రజల ముందు గట్టిగా చెప్పారని అన్నారు. మానసిక రోగి మాత్రమే హిట్లర్ స్ఫూర్తి అంటారని విమర్శించారు. శ్రీధర్ బాబు హిట్లర్ వ్యాఖ్యలను సమర్ధించడం జాలి కలుగుతున్నదని అన్నారు. హైదరాబాద్ వర్షాలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమని చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఉన్న సిటీని గాలికి వదిలేసి ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
హైడ్రా బ్లాక్‌మెయిల్ సంస్థ
హైడ్రాను అన్ని సమస్యలకూ జిందా తిలస్మాత్ లెక్క చూపిస్తున్నారనీ, పూడికతీత, వరద, చెరువుల నిర్వహణ ఇలా అన్నింటికీ హైడ్రా పేరే చెప్తున్నారని విమర్శించారు. కానీ హైడ్రా బ్లాక్‌మెయిలింగ్, డబ్బుల వసూళ్లకు తప్పించి ఇంకే పని చేయడం లేదన్నారు. నిజంగానే హైడ్రా ద్వారా లక్ష ఎకరాలు రక్షించి ఉంటే, వాటిని అమ్మి ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నెలాఖరులో సభ్యత్వ నమోదు ప్రారంభం
ఈనెలాఖరులో బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుంని కేటీఆర్ చెప్పారు. ఆ తర్వాత కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకుంటామన్నారు. లోపాలను సరిచేసుకుని ముందుకు పోతున్నామనీ, ఆత్మపరిశీలన చేసుకున్నామని అన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా ఉంటాయని చెప్పారు.
జమిలి ఎన్నికలు ఉండకపోవచ్చు
వచ్చే నెల నుంచి డీలిమిటేషన్ ప్రక్రియ జరిగే అవకాశం ఉన్నదని కేటీఆర్ అన్నారు. ఎవరు ఎక్కడ, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో ఎవరికీ తెలియదన్నారు. జాతీయ స్థాయిలో డీలిమిటేషన్ జరగకున్నా, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సి ఉందని చెప్పారు. జమిలి ఎన్నికలు ఉండకపోవచ్చని అన్నారు. దక్షిణ భారతదేశ ప్రాతినిధ్యం తగ్గకుండా ఉంటే డీలిమిటేషన్‌కి మద్దతు ఇస్తామన్నారు.
రూ.వందల కోట్లతో రేవంత్ రెడ్డి రాజసౌదం
రాష్ట్ర ప్రభుత్వం భారీగా అమ్ముతున్న భూముల నుంచి వచ్చే నిధులు ఎక్కడ పోతున్నాయో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రూ.నాలుగు లక్షల కోట్ల అప్పు తెచ్చి వాటిని ఎక్కడ పంపిందో చెప్పాలన్నారు. సీఎం రూ.200 కోట్లతో రాజసౌధాలు కట్టుకుంటున్నారని ఆరోపించారు. సీఎం రాజప్రసాదానికి సంబంధించిన నిర్మాణ జీవోలు అన్నింటినీ రహస్యంగా ఉంచుతున్నారని అన్నారు.
మోడీ పాలనలో దేశానికి ఒరిగిందేం లేదు నరేంద్ర మోడీ 12 ఏండ్ల పాలనలో దేశానికి ఒరిగిందేం లేదని కేటీఆర్ విమర్శించారు. 12 కాలంలో ఒక్క హామీని కూడా నిలుపుకోలేదని అన్నారు. అందరికీ ఇల్లు, ఇంటింటికీ నీళ్లు, ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ, రైతన్నల ఆదాయం రెట్టింపు వంటి ప్రతి అంశంలోనూ కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.
కాంగ్రెస్ కుట్రల వల్లే మీనాక్షి నామినేషన్ తిరస్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


