నవతెలంగాణ కథనాల ఎఫెక్ట్..
జీహెచ్‌ఎంసీలో డిజిల్ కుంభకోణంపై విచారణ వేగవంతం
ఐదు రోజుల్లో 10 మందిని విచారించిన విజిలెన్స్ అధికారులు
15 ఏండ్ల రికార్డుల పరిశీలన
కొత్తగా డీఈ, ఇద్దరు ఈఈలకు బాధ్యతలు
నవతెలంగాణ- సిటీబ్యూరో
హైదరాబాద్ మలక్‌పేట్ జీహెచ్‌ఎంసీ ట్రాన్స్‌పోర్టు (పార్కింగ్ యాడ్) విభాగంలో డీజిల్ కుంభకోణం కథనాలపై కూపీలాగితే డొంక కదులుతోంది. డీజిల్ కూపన్ల కుంభకోణంపై ‘నవతెలంగాణ’ దినపత్రికలో వచ్చిన కథనాలపై స్పందించిన అధికారులు విచారణ వేగవంతం చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తీవ్రంగా స్పందించారు. ఈ నెల 5న ‘సీజ్‌లో ఉన్న వాహనానికీ డీజిల్ కూపన్లు’ అంటూ వచ్చిన కథనంపై జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. దాంతోపాటు మే 7న ‘ఇక్కడ మాజీ ఉద్యోగి చెప్పిందే వేదం’ అనే కథనంపైనా విచారణ చేపట్టారు. మూలనపడిన వాహనాలకూ డ్రైవర్ల ప్రమేయం లేకుండా స్పేర్‌పార్ట్స్ వేయడం, పోలీస్‌స్టేషన్‌లో సీజ్‌లో ఉన్న ‘ఏపీ 11ఏక్స్7241 గూడ్స్ వాహనానికి’ 22 రోజులపాటు 36 డీజిల్ టోకెన్లు జారీ చేయడంతోపాటు వేలాది లీటర్ల డిజిల్ కూపన్ల జారీపై అధికారులు కూపీలాగారు.
ప్రశ్నలను సంధించిన అధికారులు
నవతెలంగాణలో వచ్చిన రెండు కథనాలపై ఐదు రోజులుగా దాదాపు 10 మంది ఉద్యోగులను, ఆపరేటర్లను, కొందరు యూనియన్ నాయకులను విజిలెన్స్ అధికారులు విచారించినట్టు తెలిసింది. ముఖ్యంగా నవతెలంగాణలో (మే7, ఈ నెల 5 వచ్చిన) వచ్చిన రెండు కథనాల పేపర్లను ముందు పెట్టి అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. డీజిల్ కూపన్లు ఎలా జారీ చేశారు.. ఎన్నేండ్ల నుంచి ఈ కుంభకోణం కొనసాగుతోందని, ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత మేరకు ఉందని, మాజీ ఉద్యోగి ఎందుకు రెగ్యులర్‌గా వస్తున్నాడు అనే అంశాలపై విజిలెన్స్ అధికారులు ఆరా తీసినట్టు తెలిసింది. మొదటి రోజు ఆపరేటర్‌తోపాటు మాజీ ఉద్యోగులను, కాంట్రాక్టు ఉద్యోగులను కొంతమందిని లిబర్టీలోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని విజిలెన్స్ కార్యాలయానికి పిలిపించిన అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కొక్కరినీ విడివిడిగా ప్రశ్నించినట్టు తెలిసింది. వారి నుంచి లిఖిత పూర్వకంగా స్టేట్ మెంట్‌ను తీసుకున్నట్టు సమాచారం. మూడ్రోజుల విచారణ అనంతరం మలక్‌పేట్‌లోని హెచ్‌ఎంసీ ట్రాన్స్‌పోర్టు కార్యాలయానికి వెళ్లిన విజిలెన్స్ అధికారులు అక్కడ రికార్డులను పరిశీలించినట్టు తెలిసింది. దాదాపు 15ఏండ్ల నుంచి ఏం జరుగుతోందని ఆరా తీసినట్టు సమాచారం. వివిధ అంశాలపై అందరి స్టేట్‌మెంట్ తీసుకున్న అధికారులు వారిచ్చిన సమాచారంతో మరికొంత మందిని విచారించే అవకాశం ఉంది.
బంక్ యజమానిని విచారించే అవకాశం
‘ ఏపీ 11ఏక్స్7241’ గూడ్స్ వాహనానికి 22 రోజులపాటు 36 డీజిల్ (కూపన్లు) టోకెన్లపై ఎవరికి డీజిల్ పోశారని సదరు బంక్ యజమానిని విజిలెన్స్ అధికారులు ప్రశ్నించే అవకాశముంది. బంక్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించే అవకాశముంది. ఇదిలావుండగా రెండు నెలలుగా రాత్రి 8గంటల తర్వాత మలక్‌పేట్ జీహెచ్‌ఎంసీ ట్రాన్స్‌పోర్టు విభాగంలోకి కొందరు వ్యక్తులు వస్తున్నట్టు తెలిసింది. ఆ రాత్రి వచ్చిన వారిలో కొందరు ఉద్యోగులు కంప్యూటర్ ఆపరేటర్‌తో కలిసి ఈ కూపన్లు జారీ చేయించినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో సెక్యురిటీ ఏం చేస్తోందని, వారిని ఎందుకు లోనికి అనుమతించారు, ఎందుకు అడ్డుకోలేకపోయిందో విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. అయితే ఈ కుంభకోణం వెలుగు చూడడంతో అక్కడ పనిచేసే అశోక్ అనే చిరుద్యోగి కనిపించకుండా పోయినట్టు సమాచారం. అతని వెనుక పెద్దల హస్తం ఉండొచ్చని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ అధికారులు సంప్రదిస్తే అతని ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉందని సమాచారం. అతన్ని విచారిస్తే పూర్తి వివరాలు బయటపడే అవకాశముంది. దాంతో కొందరు యూనియన్‌నాయకులు, పెద్దల వ్యవహారం సైతం వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఇదిలావుండగా మలక్‌పేట్ జీహెచ్‌ఎంసీ ట్రాన్స్‌పోర్టు విభాగంలో(పార్కింగ్ యార్డ్) డీఈ, ఇద్దరు ఏఈలు బాధ్యతలు చేపట్టారు.
కూపీ లాగితే డొంక కదులుతోంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



