ఇవి కథలు మాత్రమే కావు. గ్రామజీవన దశ్యాలు. ప్రకతిని తమలో ఇంకించుకున్న ప్రజల అంతరంగ చిత్రణలు. కవి హదయాన్ని ఇముడ్చుకున్న కథకుడి మనోహర అభివ్యక్తులు. పాఠకుడిని తన వెంట తీసుకువెళ్లే నాదస్వరాలు.
నందిని సిధారెడ్డి వీటి రచయితేకానీ, ఇవి అతను కల్పించిన కథలు కావు. అతను పుట్టిన చోటు, అక్కడి సంస్కతి, ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు, అనుబంధాలే కథలయ్యాయి. ఈ కథలు రాయడానికి కథకుడికి అవసరమైందల్లా పాత జ్ఞాపకాలను తలచుకున్నపుడల్లా మళ్లీ అనుభవించగలగడం. తన అనుభవాలు, అనుభూతులను సార్వజనీనం చేయడానికి ప్రయత్నించడం. ఇది ఇటీవల కథారచనలో నడుస్తున్న ధోరణే. అటువంటి కథల జాబితాకు ఈ సంకలనం మరో చక్కని చేర్పు.
బందారం కథల్లో అక్కడి భౌగోళిక పరిస్థితి, జనజీవనం ఉంటుంది. అక్కడి వత్తులు, కళాకారులు ఉంటారు. అక్కడి ప్రకతి, వర్గ, కుల, లింగ స్వభావాలు, వత్తి కళాకారులే ఇందులోని పాత్రలు. అయితే వీటన్నిటినీ ఏకరువు పెడితే అది డాక్యుమెంటరీ అవుతుంది. వ్యాసమవుతుంది. ప్రాపంచిక దక్పథం, రచనాశిల్పం, పాత్ర చిత్రణానైపుణ్యం అనే ముడిసరుకు సిధారెడ్డి వద్ద వున్నాయి. ఇవి మూడూ ఉన్నాయి కనకనే ఇవి మంచి కథలు.
ఈ కథల్లో వస్తువేమిటి? అని ప్రశ్నించుకున్నపుడు తరతరాలుగా ఉన్న విశ్వాసాలు (చినికి చినికి వాన మరికొన్ని), బాధ్యతారాహిత్యం, స్వార్థం మూర్తీభవించిన మగవాళ్లు (జంజాటం, కుంజీలు), స్వంత వ్యక్తిత్వం కలిగిన స్త్రీలు (యశోద వెంట, జాయిజాద్, మనసు పాడుగాను), వత్తి కళాకారుల జీవితాలు మొదలైనవి. ఇందులో వస్తువులన్నీ తెలుగు కథకు కొత్తవి కావు. కానీ రచన మాత్రం ప్రత్యేకమే. అలాగే కొన్ని ప్రత్యేకమైన కథలు ఈ సంకలనాన్ని ప్రత్యేక రచనగా నిలబెడతాయి. అవి ఇక్కడ సంస్కతికి సంబంధించినవి. పాటలు, నత్యాలు, ఆచారాలు, వత్తినైపుణ్యాలు, నమ్మకాలు కలగలిసినవి. బందారం జానపద సంస్కతిని కళ్లకు కట్టించేవి. అక్కడి జీవన శకలాలను, అక్కడి జన జీవితంలోని అతిచిన్న విషయాలను కూడా రూపుకట్టించేవి.
అలాంటి మంచి కథల్లో ఒకటి ఋణానుబంధాలు. తనకు ఐశ్వర్యం తెచ్చిపెట్టిన ఆవు చనిపోతే ఊరి షావుకారు చాలా బాధపడతాడు. దానికి శాస్త్రోక్తంగా, మనిషికి చేయించినట్లుగా దహనకాండ జరిపిస్తాడు. ఆ క్రమం మొత్తం కళ్లకు కట్టినట్టు చిత్రిస్తాడు రచయిత. దాన్ని ఊరేగింపుగా తీసికెళ్లి దహనం చేసేవరకూ కుంటుకుంటూ అందరి వెంటా నడుచుకుంటూ వచ్చిన ముసలమ్మను చూసి జనం నవ్వుకుంటారు. నిజానికి ఆ ఆవు తల్లి ఈ ముసలమ్మదే. తన నాన్నమ్మను బతికించుకోడానికి డబ్బులేక, ఈ ఆవుతల్లిని ఈ ఆవు గర్భంలో ఉండగా, ముసలమ్మ షావుకారికి అమ్మేసింది. అదే ఆవుకు ఇప్పుడు వైభవంగా దహనకాండ జరిగింది. అప్పుడు తన నాన్నమ్మ దిక్కులేక మరణించింది. ఇప్పుడు ఈ ఆవుకు ఘనంగా దహనకాండ జరుగుతోంది. ఈ వైరుధ్యాన్ని చక్కని ఐరనీతో చెప్తాడు రచయిత.
ధ్వనిగర్భితమైన మరోకథే శానతనం. కొమరయ్యను ఊళ్లో అందరూ తక్కువగానే చూస్తారు. ఇంట్లో కూడ గారాం చేసేవాళ్లు, ఖాతరు చేసేవాళ్లు లేరు. తనను ఏ దుకాణదారుడూ కూర్చోనివ్వడు. ఎక్కడా ఆదరం లేదు. చివరకు చింతమొద్దు మీద కూర్చున్నా తరిమికొడతారు. కానీ.. పీర్ల పండగరోజు నిప్పులు రాజేస్తున్నప్పుడు, కట్టెలు తక్కువయ్యాయని పెద్దలంటారు. కొమరయ్య కట్టెలు వెతికి తెచ్చేందుకు సిద్ధపడతాడు. పరిగెత్తుకు వెళ్లి, తనను కూర్చోనివ్వని చింతమొద్దును తెచ్చి కాష్టంలో వేస్తాడు. అది చక్కగా రాజుకుని కాలి బూడిదవుతుంది. తనను కూర్చోనివ్వని చింతమొద్దును తగలబెట్టిన ఆనందం. ఎక్కడా వాచ్యం చెయ్యకుండా చివరి వాక్యంతో కొమరయ్య పగతీర్చుకున్నాడని పాఠకుడికి ధ్వనింపజేస్తాడు రచయిత.
వాచ్యత లేకపోవడమన్నది సిధారెడ్డి కథల్లో సామాన్య లక్షణం. రచయితగా ఎప్పుడూ తెరవెనక ఉండిపోవడమే అతనికిష్టం. ఒక ఘట్టాన్ని లేదా పాత్రను మనముందుంచి, తను తెర వెనక్కి తప్పుకోవడం ఈ రచయిత అలవాటు. ఆ పాత్రను గురించి రచయిత ఏం చెప్పదలుచుకున్నాడు? కథ ద్వారా అందించాల్సిన సందేశం లేదా అవగాహన ఏమిటి? ఇవేవీ మనకు స్పష్టం కాని కథలున్నాయి. అలాంటి విలక్షణమైన కథే బంగారు గురిగి.
కానీ అన్ని కథల్లోనూ ఈరకమైన వ్యూహం లేదు. సమగ్రచిత్రణకు నోచుకున్న పాత్రలూ ఉన్నాయి. ఉదాహరణకు ‘కుంజీలు’ లో కమల, ‘యశోద వెంట’ లో యశోద, గడీలవాడులో హనుమంతరావు, ‘జాయిజాద్’లో జానమ్మ. అన్నిటికంటె చక్కని చిత్రణకు నోచుకున్నది ఏ వ్యక్తీ కాదు. బందారమనే ఆ ఊరే. ఈ కథల్లో ప్రధాన పాత్ర. ఊరు మానవీకరణ చెందిందనుకుంటే అది ఎలాంటి మనిషి? ఎల్లప్పుడూ ఉదాత్తంగా ఉంటుందా? హీరోయిజం ప్రదర్శిస్తుందా? న్యాయం పక్షం వహిస్తుందా? లేదు. ఆ గ్యారంటీ లేదు. బీభత్సం ప్రధానమైన ‘చెడ్డ గడియ’ కథలో ఊరు ప్రేక్షకపాత్రే వహిస్తుందంటాడు రచయిత. క్రియాశీలకంగా ఉండాలన్న నియమం ఊరికి లేదు. ఘోరాలు జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటుంది. బాకీ’ కథలో ఊరంతటికీ ప్రమాదం వచ్చినపుడు ఎక్కడలేని ఐకమత్యం వచ్చేసి, ఆ ప్రమాదఘడియ దాటగానే ‘షరా మామూలే’. ప్రవత్తి తలెత్తడం సర్వసాధారణమని చూపిస్తాడు రచయిత (ఈ కథ చదివితే అమరావతి కథల్లో ‘వరద’ కథ గుర్తుకొస్తుంది). ఇది 1979 లో స్కైలాబ్ కిందపడి అందరూ చనిపోతారని భారతదేశంలో విస్తరించిన వదంతి ఆధారంగా రాసింది. ఊళ్లో అందరూ అప్పులూ, సొప్పులూ లేకుండా కలిసిపోయి, చివరి దినం తాగుతూ, తింటూ ఆనందంగా గడపడం, వైషమ్యాలు మరిచిపోవడం చక్కగా చిత్రిస్తాడు రచయిత. రాత్రికి స్కైలాబ్ తునకలు సముద్రంలో పడిపోయాయి కనక ఊరికి భయం లేదని రేడియోలో చెప్పాక, మళ్లీ మామూలే. అందరి గొడవలూ యథాతథం.
అపుడపుడూ ఊరు సాక్షిగానే ఉన్నా, చాలాసార్లు ఊరు మంచికి కూడా పూనుకుంటుంది. ‘నన్నెజీవులు’లో అల్లుడిని వేధించుకు తింటున్న కుటుంబానికి బుద్ధిచెప్పి, అతన్ని బతికించింది ఊరు. ‘తడిసి మోపెడు’లో యువతలోని పౌరుషాన్ని రోషాన్ని అభినందించింది ఊరు. ‘ఉన్నదీ లేనిదీ’లో ఊరు వదిలి వెళ్లిపోవడంలో ఇమిడిన విషాదాన్ని వ్యాఖ్యానించింది ఊరు.
కళ కన్నీళ్లు కథ జానపద వత్తిగాయకులైన శారదకండ్ర కథ. తమ కళ ద్వారా పదిమందినీ ఏడ్పించే వీరికి జీవితంలో మిగిలేవి కన్నీళ్లే. వారి కట్టమైసమ్మ కథాగానం నేపథ్యంలో చాలా అందంగా అల్లిన కథ ఇది. ఇంతకూ వాళ్లకు కళే బ్రతుకా? బ్రతకడం ఒక కళా? రెండూనూ.
కథలలో పాటను ఇంత విరివిగా, సందర్భోచితంగా వాడుకున్న రచయితలు చాలా అరుదు, బహుశా లేరేమో. వాన రావాలని వర్షదేవుణ్ణి కోరుతూ పిల్లలు పాడే పాట దగ్గర్నుంచీ, కట్టమైసమ్మ వీరగాథను చెప్పిన శారదకాండ్రవరకూ ఈ కథలన్నిటా పాటలు అలరిస్తాయి. మౌలికంగా కవి అయిన సిధారెడ్డి ఏ వస్తువునైనా, వాతావరణాన్నయినా, వ్యక్తినైనా చక్కగా వర్ణించగలడు. బందారం కథల్లో భాషలోని సొగసు ఈ వర్ణనలను మించి కథనానికి కథలకూ వన్నె తెచ్చింది.
ఈ కథల మర్మం మొదటి కథలోనే సూచిస్తాడు రచయిత. ‘మావూరు తీరు’ అంటూ. బందారం కనికట్టుకు ప్రసిద్ధమైన వూరట. కనకే ఈ రచనలో కథ, కథనం, పాత్రలు- అన్నిటిలోనూ మార్మికత ఉంటుంది, గుట్టుచప్పుడు ఉంటుంది. పొరలుంటాయి. ఆ పొరలను విప్పుకుంటూ వెళ్లాలనే ఉత్సాహం, ఉద్వేగం కల్పించే శైలివుంటుంది. అందుకే ఇవి మంచి కథలు, చదవదగ్గ కథలు, చదివి తీరాల్సిన కథలు.
– మణాళిని