మహిళలను వస్తువు లాగా చూస్తున్న పురుషులు..

– మహిళలకు సమస్యలు ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం ఉండాలి
– మాతృక పత్రిక సంపాదకులు రమా సుందరి
నవతెలంగాణ – భువనగిరి
భారతదేశంలో మహిళలను ఒక వస్తువు లాగా చూస్తున్నారని మాతృక పత్రిక సంపాదకులు రమా సుందరి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో  సామాజిక చైతన్య సమితి ఆధ్వర్యంలో, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సమావేశానికి రమాసుందరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో మహిళల మీద అణిచివేత సైలెంట్ వార్ లాగా జరుగుతుందని  ఆవేదన వ్యక్తం చేశారు. ఏ దేశంలో యుద్ధం జరిగిన మహిళల మీద దాడులు ఎక్కువగా జరుగుతాన్నాయన్నారు. మహిళలు తమ కంటే అన్నిట్లోనూ తక్కువ వారని, వారి మీద సర్వహక్కులు మనకు ఉన్నాయని, పురుషులు నమ్మటం వలనే మహిళల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయన్నారు.  తల్లిదండ్రుల పెంపకంలోనే  లోపం ఉందని, ఆడపిల్లలను, మగ పిల్లలను సమాన దృష్టితో చూడకపోవటమే ఇందుకు   కారణమన్నారు. ఇంటర్నెట్లో మహిళల శరీరాలతో ,అశ్లీల, యాప్ లతో వ్యాపారాలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల మీద విపరీతమైన అశ్లీల పోస్టులు పెడుతున్నారని తెలిపారు.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వంటగ్యాస్ పై వంద రూపాయలు తగ్గించామని, మోడీ ప్రకటన చేయటం విడ్డూరం అన్నారు. దీని ప్రకారం ఆడవాళ్లు వంటింటికే పరిమితమని , వంట మీరే వండుతారు కాబట్టి, మీకు ఇది కానుక అని చెప్పటమేనని రమా సుందరి  మండిపడ్డారు. ఆడవాళ్ళే ఆహారం తింటారా, మగవాళ్ళు భోజనం చేయరా? అని ఆమె ప్రశ్నించారు. మణిపూర్లో మహిళలను వివస్త్రలుగా  చేసి ఊరేగిస్తుంటే, ప్రధానమంత్రి మోడీగాని, కేంద్ర మంత్రులు గాని, అటువైపు చూడకపోవటం అన్యాయం అన్నారు. గత ఏడు నెలల నుంచి మణిపూర్లో రెండు వర్గాలు మధ్య, విపరీతమైన దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రధానిగా ఆ ప్రాంతాన్ని మోడీ సందర్శించకపోవడం దారుణం అని అన్నారు  అదేవిధంగా ఈనాటికి కాశ్మీర్లో మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని, 12 ఏళ్ల నుంచి 70 ఏళ్ల ముసలి వారితో సహా, వందమంది ఆడవారిపై, సైన్యం అత్యాచారం జరపి 30 సంవత్సరాలు కావస్తున్న, నేటికీ వారికి న్యాయం జరగలేదని తెలిపారు. కాశ్మీర్ లోని జైళ్లు అన్ని  ముస్లింలు, దళితులతో నిండి ఉన్నాయన్నారు.  తమ స్థానం, ఆత్మగౌరవం  కాపాడుకోవడానికి, పురుషులతో సమానంగా ఉన్నత స్థానాలకు ఎదగడానికి, మహిళలంతా భయపడకుండా ముందుకు రావాలన్నారు. ప్రతి మహిళ చదువుతోపాటు చైతన్యం కూడా కలిగి ఉండాలని, పక్కవారికి అన్యాయం జరిగితే నిలదీసే శక్తి కలిగి ఉండాలని  ఆమె కోరారు. అలాగే  నవభారత్ డిగ్రీ, పీజీ కళాశాల కరస్పాండెంట్ చిక్క ప్రభాకర్ గౌడ్, ఉపాధ్యాయుని అనిత అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏవిధంగా ఏర్పడింది అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం వ్యాసరచన పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఉపాధ్యాయురాలు అనిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ,సామాజిక చైతన్య సమితి అధ్యక్షులు శేక్ హమీద్ పాష, శ్రీనివాసాచార్యులు, సామ మల్లారెడ్డి, చిన్నయ్య, గాయని సుశీల, కల్యాణి,వివిధ కళాశాల నుంచి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Spread the love