– కార్డులపై రాయితీలు రద్దు చేసిన మెట్రో
– సువర్ణ ఆఫర్‌తో మెట్రోకు పెరిగిన రద్దీ
– నగర ప్రయాణికులపై అదనపు భారం
– మెట్రోలో రోజూ 5లక్షల మంది ప్రయాణం
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో అసలే ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలకు కూల్ జర్నీ చేద్దామనుకున్న గ్రేటర్ ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గట్టి షాకిచ్చింది. ఇప్పటివరకు మెట్రో ప్రయాణికులకు కార్డులపై ఇచ్చిన రాయితీలను పూర్తిగా రద్దు చేసింది. ప్రస్తుతం మెట్రో కార్డుపై 10శాతం రాయితీతో పాటు హాలీడే కార్డును పూర్తిగా రద్దు చేసినట్టు మెట్రో అధికారులు తెలిపారు. మెట్రో అధికారుల నిర్ణయంతో నగర ప్రయాణికులపై అదనపు భారం పడనుంది.హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కరోనా తర్వాత మెట్రో ప్రయాణికులకు ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్ల ప్రకటిస్తూ వచ్చింది. దీంతో నగర ప్రజలు కూడా ఈ ఆఫర్లను వినియోగించుకునేందుకు ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. రెండేండ్ల క్రితం హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ సూపర్ సేవర్ ఆఫర్-59ను ప్రవేశపెట్టింది. సెలవు దినాలు, పండుగల రోజుల్లో ఉపయోగపడే ఈ ఆఫర్‌కు ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ లభించింది. ఫలితంగా మెట్రో రైలులో రోజువారి ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో గతేడాది సూపర్ సేవర్ ఆఫర్-59 స్థానంలో 99 రూపాయలకు పెంచింది. అయినప్పటికీ మెట్రో ప్రయాణికుల నుంచి ఆదరణ తగ్గలేదు. ఇక అదే సమయంలో ప్రయాణికుల తాకిడి తట్టుకునేందుకు అప్పటివరకు రద్దీ వేళల్లో ప్రయాణికులకు ఇచ్చిన రాయితీలకూ కోత పెట్టింది. గతంలో మెట్రో కార్డు, క్యూ ఆర్ కోడ్‌పై ప్రతి ప్రయాణ చార్జీల్లో 10శాతం డిస్కౌంట్ ఉండేది. దీనిని గతేడాది నుంచి కేవలం ఆఫ్ పీక్ అవర్స్‌లో ఉదయం 6 నుంచి 8గంటల వరకు, రాత్రి 8 నుంచి 12గంటల వరకు మాత్రమే కాంటాక్ట్ లెస్ స్మార్ట్‌కార్డుల(సీఎస్సీ)పై 10శాతం రాయితీని ఇచ్చింది. ఇప్పుడు దీనిని సైతం పూర్తిగా ఎత్తివేసింది. దీంతో మెట్రో అధికారులు తాజాగా తీసుకున్న నిర్ణయంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. నగరంలో ట్రాఫిక్ రహిత, సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణం అందిస్తున్న తరుణంలో రాయితీలు ఎత్తివేయడంపై సామాన్య, మధ్య తరగతి ప్రజలు మెట్రో ప్రయాణాలకు దూరమయ్యే అవకాశం ఉందని, హాలీడే కార్డుతో పాటు మెట్రో కార్డు, క్యూఆర్ కోడ్‌పై ఎల్అండ్టీ మెట్రో అధికారులు యథావిధిగా పదిశాతం డిస్కౌంట్ కొనసాగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
రద్దీకి అనుగుణంగా రైళ్లను పెంచని మెట్రో
నగరంలోని నాగోల్-రాయదుర్గం, ఎల్బీనగర్-మియాపూర్ , జేబీఎస్-ఎంజీబీఎస్ మూడు కారిడార్లలోని 57 స్టేషన్ గుండా ప్రతిరోజు వెయ్యికిపైగా మెట్రో సర్వీసులు నడుస్తుండగా.. 5లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు నడుస్తున్న రైళ్లలో ఎప్పుడూ రద్దీ ఉంటోంది. కాలేజీ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు మొదలుకుని వివిధ తరగతుల ప్రజలు మెట్రో రైళ్లను వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా నగరంలో ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా తక్కువ సమయంలో ప్రజలు, ఉద్యోగులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దాంతో ఉదయం, సాయంత్రం వేళల్లో, సెలవు రోజుల్లో మెట్రో ప్రయాణంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ఎండలు దంచికొడుతుండటంతో ప్రజలు మెట్రోకి క్యూ కడుతున్నారు. మెట్రో రైళ్లు పుల్ రష్‌తో నడుస్తున్నాయి. మెట్రో రైళ్లలో కాలుతీసి కాలుపెట్టలేనంత మంది ప్రయాణికులు జర్నీ చేస్తున్నారు. అయితే రద్దీకి సరిపడ రైళ్లను పెంచని మెట్రో యాజమాన్యం… రాయితీలను ఎత్తి వేయడం ఏంటని ప్రయాణికులు మండిపడుతున్నారు. మెట్రో అధికారులు ఇప్పటికైనా తమ నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని ప్రయాణికుల డిమాండ్ చేస్తున్నారు.