మైనార్టీల అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు: ఎంఐఎం జిల్లా అధ్యక్షులు ఫయాజుద్దీన్

నవతెలంగాణ కంఠేశ్వర్ 
భారతదేశంలో మైనార్టీల అస్తిత్వాన్ని కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని జిల్లా ఎంఐఎం పార్టీ అధ్యక్షులు ఫయాజుద్దీన్ ఆరోపించారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో ముస్లిం పర్సనల్ లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వక్ఫ్ బోర్డ్ లో సవరణలపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎంఐఎం పార్టీ అధ్యక్షులు ఫయాజుద్దీన్ మాట్లాడుతూ.. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశమని, ఇక్కడ వివిధ మతాలు, కులాలు, సంస్కృతుల సంగమమన్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం విభజించు పాలించు అనే ధోరణిలో ప్రజలను విడదీస్తున్నదన్నారు. ప్రత్యేకించి ముస్లింలను శత్రువులుగా చూపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఢిల్లీ నుండి గల్లి వరకు నిరసన ధర్నా కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఒకవేళ వక్ఫ్ బోర్డ్ లో సవరణలు ఆపకపోతే రాబోవు రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంఐఎం ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షాబాజ్, మాజీ కార్పొరేటర్ మునవర్ ఆలీ, నాయకులు సోహైల్ చౌస్, అమర్ ఫారూఖ్, షకీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love