నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సోమవారం ఆయన హైదరాబాద్ పంజగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. విద్యార్థినులు మహాలక్ష్మి, జ్యోతి, శైలజలను పరామర్శించారు. వారు త్వరగా పూర్తిగా కొలుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షించారు. విద్యార్థులతో మాట్లాడిన మంత్రి జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నదని తెలిపారు. నిమ్స్ ఆస్పత్రిని బలోపేతం చేస్తున్నట్టు చెప్పారు.
మంత్రి వెంట నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, డాక్టర్లు నిమ్మ సత్యనారాయణ, డాక్టర్ గంగాధర్ లు పాల్గొన్నారు.
విద్యార్థినీల్లో ఇద్దరు కోలుకోగా వారిలో ఒకరు డిశ్చార్జి అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపారు. మరొక విద్యార్థినీ శైలజ పరిస్థితి మరోసారి విషమించినట్టు వెల్లడించారు. రోగులకు, వారి సహాయకులకు ఉచిత ఆహారంతో పాటు, రోగుల సహాయకులకు ప్రత్యేకంగా ఉచిత వసతి కల్పించినట్టు తెలిపారు.