నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ప్రధాని నరేంద్ర మోడీకి లేదని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఒక ప్రకటనలో విమర్శించారు. నల్ల చట్టాలు తెచ్చి అన్నదాతకు నరకం చూపిన బీజేపీ ప్రభుత్వం, ఢిల్లీ వీధుల్లో 700 మంది రైతుల మరణానికి కారణమైందని ఆరోపించారు. కిసాన్ సమ్మాన్ నిధితో పాటు 60 ఏండ్లు దాటిన వారికి పెన్షన్ పెంపు తదితర హమీలు ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. రైతు సంక్షేమాన్ని పట్టించుకోని బీజేపీ, వారిపై పెట్రోల్, డీజిల్ ధరల భారం మోపిందని ఆందోళన వ్యక్తం చేశారు.
అన్నదాతను దగా చేసిన మోడీ, మహారాష్ట్ర ఎన్నికల కోసం తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏకకాలంలో 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర తమదని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ను విమర్శించడం మానుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని సూచించారు.