నేడు రాష్ట్రంలోని రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌లు: మంత్రి తుమ్మల

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో ఈ వానాకాలం సీజన్‌ నుంచి ప్రారంభించనున్న రైతుభరోసా పథకంపై రైతుల అభిప్రాయాలను సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్రంలో 110 నియోజకవర్గాల్లోని రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌లు జరగనున్నాయి. ఆ నియోజకవర్గాల్లోని క్లస్టర్ల నుంచి రైతులను రైతువేదికలకు ఆహ్వానించి వారి అభిప్రాయాలు తెలియజేసేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆయన సూచించారు. అనంతరం వాటిని నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న రైతుబంధు పథకం స్థానంలో ‘రైతుభరోసా’ను అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘రైతుబంధు’ నిబంధనలను మార్చి కొత్త మార్గదర్శకాలతో ‘భరోసా’ను అమలుపరిచేందుకు కసరత్తు చేస్తోంది. రైతులు, వివిధ వర్గాలవారి అభిప్రాయాలను తెలుసుకొని వాటికి అనుగుణంగా రైతుభరోసాపై నిర్ణయం తీసుకోవాలని ఇటీవలి మంత్రిమండలి సమావేశం తీర్మానించింది.

Spread the love