భారత్‌లో మొబైల్‌ ఛార్జీలు పెరగాల్సిందే..!

భారత్‌లో మొబైల్‌ ఛార్జీలు పెరగాల్సిందే..!– మూడు టెల్కోలు చాలు.. : ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ విట్టల్‌
న్యూఢిల్లీ : ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ముగియగానే మొబైల్‌ ఫోన్‌ రీచార్జ్‌ బాదుడు షురూ కానుందని వచ్చిన రిపోర్టులకు భారతీ ఎయిర్‌టెల్‌ సిఇఒ గోపాల్‌ విట్టల్‌ వ్యాఖ్యలు బలం చేకూర్చాయి భారత్‌లో మొబైల్‌ ఛార్జీలు పెరగాల్సిన అవసరం ఉందని గోపాల్‌ విట్టల్‌ అన్నారు. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లోనే టెలికం టారీఫ్‌లు తక్కువగా ఉన్నాయన్నారు. ప్రస్తుత సమయంలో వినియోగదారుడి నుంచి సగటు రాబడి (ఎఆర్‌పియు) రూ.300కు చేరాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రూ.200 పైన ఎఆర్‌పియు ఉందన్నారు. ప్రపంచంలోనే ఇది తక్కువన్నారు. భారతీ ఎయిర్‌టెల్‌ మార్చి త్రైమాసికం ఫలితాల వెల్లడి అనంతరం బుధవారం గోపాల్‌ విట్టల్‌ మాట్లాడుతూ.. పెట్టుబడికి తగిన ప్రతిఫలం పెరగాలంటే టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. 5జి పెట్టుబడులకు ప్రతిఫలం తక్కువగానే ఉందన్నారు. ఇటీవల వొడాఫోన్‌ ఐడియా రూ.18,000 కోట్ల ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ నిధుల సమీకరణ స్వాగతించదగ్గ పరిణామమని అన్నారు. భవిష్యత్‌లో ఆ సంస్థకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. దేశంలో మూడు బలమైన ప్రయివేటు టెలికం ఆపరేటర్లతో సేవలు సరిపోతాయని అన్నారు. దీంతో పరోక్షంగా బిఎస్‌ఎన్‌ఎల్‌కు ఎసరు పెట్టాలని సంకేతాలు ఇవ్వడం గమనార్హం.
ప్రస్తుత ఎన్నికల ఫలితాల తర్వాత ఛార్జీల పెంపునకు టెలికం కంపెనీలు ప్రణాళికలు వేస్తున్నాయని బ్రోకరేజీ సంస్థ ఆక్సిస్‌ కాపిటల్‌ ఓ రిపోర్ట్‌లో తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుత ధరలపై 25 శాతం వరకు ధరలు పెంచాలని యోచిస్తున్నాయి. టెలికం పరిశ్రమలో పోటీ, టెక్నాలజీ కోసం పెట్టుబడులు పెరిగాయనే సాకుతో ప్రస్తుత ప్రభుత్వ మద్దతుతో టారిఫ్‌ ధరల పెంపునకు ప్లాన్లు వేస్తున్నాయని వెల్లడించిన విషయం తెలిసిందే.
ఆర్థిక సంవత్సరం 2023-24లో భారతీ ఎయిర్‌టెల్‌ నికర లాభం రూ.7,467 కోట్లుగా నమోదయ్యింది. మరోవైపు ఆదాయం 7.7 శాతం పెరిగి రూ.1,49,982 కోట్లకు చేరింది. మార్చి త్రైమాసికంలో రూ.2,072 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గడిచిన మార్చి త్రైమాసికంలో ఒక్కో వినియోగదారుడిపై కంపెనీకి సగటు రాబడి 8 శాతం పెరిగి రూ.193 నుంచి రూ.209కు చేరిందని గోపాల్‌ విట్టల్‌ తెలిపారు. మార్చి ముగింపు నాటికి 7.2 కోట్ల 5జి వినియోగదారులకు ఉన్నారని.. ప్రతీ నెల 20-25 లక్షల మంది కొత్త వినియోగదారులను జోడించుకుంటున్నట్లు పేర్కొన్నారు. 5జి ప్లాన్లలకు ఉచిత డాటాను అందించడం ద్వారా ఎఆర్‌పియు తగ్గుతుందన్నారు. 4జి ధరలోనే ఉచితంగా 5జి డాటా పొందుతున్నారని అన్నారు. దీంతో ఆయన 5జికి ప్రత్యేక ప్లాన్లు ఉండాలని సంకేతాలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అదే జరిగితే వినియోగదారులపై మరింత భారం పడనుంది.

Spread the love