ప్రమాదంలో లక్షల మంది
విద్యార్థుల భవిష్యత్
ప్రధాని స్పందించరేం : రాహుల్ గాంధీ ఫైర్
న్యూఢిల్లీ : నీట్-యూజీ 2026 పేపర్ లీక్ వివాదంపై ప్రధాని మోడీ మౌనం వహించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. వరుసగా జరుగుతున్న నీట్ పేపర్ లీక్‌లకు ప్రభుత్వ ఉదాసీనతే కారణమని పేర్కొన్నారు. అందుకే దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని మరోసారి డిమాండ్ చేశారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యూఐ) ఆధ్వర్యంలో జరిగిన నిరసన వీడియోను జతచేస్తూ రాహుల్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. అందులో రాహుల్ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. “లక్షలాది మంది యువకులు రోడ్లపైకి వచ్చినప్పుడు, 22 లక్షల మంది పిల్లల భవిష్యత్ ప్రమాదంలో పడినప్పుడు కూడా ప్రధాని మోడీ మౌనం గా ఉంటున్నారు. అంటే ఈ ప్రభుత్వం సమాధానం చెప్ప డంపై కాకుండా, తప్పించు కోవడంపైనే దృష్టి పెట్టింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి, నీట్ వంటి పేపర్ లీక్‌లను అరికట్టడానికి ఒక పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేసే వరకు మేము విశ్రమించం.” అని రాహుల్ గాంధీ తెలిపారు.
విద్యార్థుల కలలపై దాడి!
నీట్ పేపర్ లీక్ సమస్యపై ఎన్ఎస్‌యూఐ తనదైన రీతిలో స్పందించింది. నీట్-యూజీ 2026 పేపర్ లీక్ అనేది ’22 లక్షల మంది విద్యార్థుల కలలపై జరిగిన దాడి’ అని అభివర్ణించింది. విద్యార్థుల భవిష్యత్‌తో చలగాటమాడటాన్ని ఇకపై సహించేది లేదని, ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.



