Monday, May 25, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచర్చలలో గణనీయ పురోగతి : అమెరికా

చర్చలలో గణనీయ పురోగతి : అమెరికా

- Advertisement -

శాంతి ఒప్పందంపై విస్తృత చర్చలు : ట్రంప్ అణు కార్యక్రమంపై చర్యలకు అంగీకరించం : ఇరాన్
వాషింగ్టన్/టెహ్రాన్ : ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చలలో ‘గణనీయ పురోగతి’ కన్పిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో చెప్పారు. అయితే ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకుండా చేయాలన్న అమెరికా లక్ష్యాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ‘ఇరాన్ వద్ద ఇకపై అణ్వాయుధం అనేదే ఉండకూడదు. ఈ విషయంలో మా అధ్యక్షుడు చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు’ అని అన్నారు. హార్ముజ్ జలసంధిలో ప్రయాణి స్తున్న నౌకలను ధ్వంసం చేస్తామంటూ ఇరాన్ చేస్తున్న హెచ్చరికలు ప్రమాదకర సంప్రదాయానికి తెర తీస్తున్నా యని చెప్పారు. ‘అది వారి సొంతం కాదు. అది అంతర్జాతీయ జలమార్గం. దానిని ఉపయోగించుకుం టున్న వాణిజ్య నౌకలను ధ్వంసం చేస్తామని వారు చెబుతున్నారు.
ఇది చట్టవిరుద్ధం’ అని అన్నారు. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ శాంతి ఒప్పందంపై విస్తృత చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. హార్ముజ్‌ను తిరిగి తెరవడం జరుగుతుందని అన్నారు. ఇరాన్ తాజా ప్రతిపాదనను సమీక్షించి ఒప్పందానికి తుది రూపు ఇవ్వాలని ఆయన ప్రాంతీయ నేతలను కోరారు. ‘ఒప్పందం పైన అయినా సంతకం జరగాలి. లేకుంటే వారిపై తీవ్రంగా దాడి అయినా జరగాలి’ అని అన్నారు. ఇరాన్‌తో ఒప్పందం కుదరడానికి, కుదరకపోవడానికి సమానంగా అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాగా తన అణు కార్యక్రమానికి సంబంధించిన ఎలాంటి చర్యలకు టెహ్రాన్ అంగీకరించలేదని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. జలసంధి మీదుగా నౌకల రాకపోకలు పూర్వపు స్థితికి చేరుకోబోవని స్పష్టం చేసింది.

సుప్రీం నేత నిర్ణయమే ఫైనల్ : పెజెష్కియాన్
టెహ్రాన్‌తో విస్తృత చర్చలు జరుగుతున్నాయంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పందిస్తూ సుప్రీం నేత అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని చెప్పారు. ఏ నిర్ణయమైనా సుప్రీం జాతీయ భద్రతా మండలి నిర్ణయానికి లోబడే ఉంటుందని అన్నారు. ఇదిలావుండగా ఇరాన్ నేతలతో చర్చలు జరిపిన అనంతరం పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అశిం మునీర్ ఇస్లామాబాద్ చేరుకున్నారు. తుది అవగాహన దిశగా పురోగతి ప్రోత్సాహకరంగా ఉన్నదని పాక్ వ్యాఖ్యానించింది. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, అమెరికా అధికారుల మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలను తొలగించేందుకు ఖతార్, ఈజిప్ట్, తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్ వంటి ప్రాంతీయ మధ్యవర్తిత్వ దేశాలు అనేక దఫాలుగా చర్చలు జరుపుతు న్నాయి. యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉద్దేశించిన అవగాహనా ఒప్పందంపై జరుగుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ధృవీకరించారు.

ప్రతిపాదిత ఒప్పందంలో ఏముంది?
హార్ముజ్ జలసంధిని క్రమేపీ తెరవడం, ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలను తొలగించడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటి అంశాలు ప్రతిపాదిత ఒప్పందంలో ఉన్నాయని తెలుస్తోంది. విస్తృతమైన, మరింత సవివరమైన తుది ఒప్పందంపై 30 నుంచి 60 రోజుల పాటు చర్చలు జరుగుతాయని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి చెప్పారు. యుద్ధానికి ముగింపు పలకడం, అమెరికా దిగ్బంధాలను తొలగించడం, హార్ముజ్ జలసంధిలో స్థిరత్వాన్ని సాధించడం వంటి అంశాలకు శాంతి చర్చలలో ప్రాధాన్యత ఇస్తున్నామని ఇరాన్ తెలిపింది. చమురు ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేయడం, స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయడం వంటి అంశాలు తమకు పెద్దగా ప్రాధాన్యత కలిగినవి కావని చెప్పింది. పాక్ నేతృత్వంలో జరుగుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నందుకు ఖతార్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

భద్రతా సేవల కోసమే హార్ముజ్‌లో టోల్ వసూలుపై ఇరాన్
వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని దాటేందుకు వాణిజ్య నౌకల వద్ద వసూలు చేస్తున్న ఫీజులు, టోల్స్ భద్రతా చర్యలలో భాగమేనని ఇరాన్ స్పష్టం చేసింది. నౌకలకు భద్రత కల్పించేందుకే తాము వాటిని వసూలు చేస్తున్నామని తెలిపింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో సమన్వయం చేసుకుంటూ గత 24 గంటల వ్యవధిలో 30కి పైగా నౌకలు హార్ముజ్‌ను దాటాయని చెప్పింది. కాగా అమెరికాతో భవిష్యత్తులో చర్చలు జరగాలంటే యుద్ధాన్ని అన్ని రకాలుగా ఆపాల్సిందేనని ఇరాన్ అధికారి ఒకరు అన్నారు. రెండు దేశాల మధ్య విభేదాలను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇంకా తుది ఒప్పందమేమీ కుదరలేదని తెలిపారు. ఒప్పందం కుదరాలంటే సానుకూల దౌత్య వాతావరణం ఒక్కటే సరిపోదని విశ్వసనీయ వర్గాలు తేల్చి చెప్పాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -