Monday, May 25, 2026
E-PAPER
Homeజాతీయంజిమ్‌ ‌జిహాద్‌తో వి(ద్వే)ష ప్రచారం

జిమ్‌ ‌జిహాద్‌తో వి(ద్వే)ష ప్రచారం

- Advertisement -

ముస్లింలపై మరో కుట్ర సిద్ధాంతం
 మహిళల స్వేచ్ఛను కూడా అనుమానంగా చూపుతున్న హిందూత్వ శక్తులు
 అండగా నిలుస్తున్న బీజేపీ ప్రభుత్వాలు
 అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే 
ఈ ప్రయత్నాలు : మేధావులు, సామాజిక కార్యకర్తలు


న్యూఢిల్లీ :
దేశంలోని బీజేపీ పాలనలో ముస్లింలను టార్గెట్‌ ‌చేసుకుంటూ విద్వేషపూరిత రాజకీయాలు తీవ్రమయ్యాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పోకడలు పెరిగాయి. కాషాయపార్టీ అండ చూసుకొని హిందూత్వ శక్తులు రెచ్చిపోతున్నాయి. దేశంలో లవ్‌ ‌జిహాద్‌, ల్యాండ్‌ ‌జిహాద్‌ అంటూ ముస్లింలపై భయాందోళనలు సృష్టించిన ఈ సంఘ విద్రోహ శక్తులు.. ఇప్పుడు మరో కొత్త పదాన్ని తెరపైకి తెచ్చాయి. అదే ‘జిమ్‌ ‌జిహాద్‌’. యూపీ లోని మీర్జాపూర్‌‌లో పది మంది ముస్లిం జిమ్‌ ‌యజమానులపై గ్యాంగ్‌‌స్టర్స్‌ ‌యాక్ట్‌ ‌కింద కేసులు నమోదు చేయడంతో ఈ పదం మళ్లీ చర్చకు దారి తీసింది. అయితే ఇప్పటి వరకు ఈ విషయంలో పోలీసుల వద్ద ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవు. ఇటు బీజేపీ అనుబంధ హిందూత్వ సంస్థలు మాత్రం దీనిని పెద్ద కుట్రగా ప్రచారం చేస్తుండటం గమనార్హం.

​ముస్లింలే టార్గెట్‌‌గా యోగి సర్కారు చర్యలు
యూపీలోని యోగి ప్రభుత్వం ముస్లింలను టార్గెట్‌‌గా చేసుకుంటూ వ్యవహరిస్తున్నది. ముస్లిం జిమ్‌ ‌నిర్వాహకులు హిందూ మహిళలను ఆకర్షించి, వారితో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకొని, ఆ తర్వాత ఫొటోలు, వీడియోల ద్వారా ఒత్తిడి తెచ్చి ఇస్లాం మతంలోకి మారుస్తున్నారని యూపీ పోలీసులు ఆరోపిస్తున్నారు. 50 మందికి పైగా మహిళలు ఈ కుట్రకు బలయ్యారని చెప్తున్నారు. అయితే పోలీసులు చేస్తున్న ఆరోపణ లకు బలం చేకూరేలా ఏమైనా ఆధారాలు ఉన్నాయా.. అంటే వారి వద్ద ఎలాంటి స్పష్టమైన సమాధానాలూ లేవు. బాధిత మహిళల వాంగ్మూలాలు కానీ, వారి వీడియోలు, ఫొటోలు కానీ ఏవీ కూడా లేకుండానే పోలీసులు ఇలాంటి ఆరోపణలు చేయడం ఒక వర్గం వారిని టార్గెట్‌ ‌చేసే కుట్రలో భాగమని విమర్శలు వినిపిస్తున్నాయి.

​ముస్లింలను దేశానికి ముప్పుగా చూపే యత్నం
ఇక ఈ కేసులో విచారణ పూర్తికాకముందే హిందూత్వ వర్గాలు మరో జిహాద్‌ ‌కథనాన్ని తయారు చేశాయి. గత దశాబ్ద కాలంగా ఇదే తరహా రాజకీయ ప్రచారం కొనసాగుతోందని విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా ముస్లింలను దేశానికి ముప్పుగా చూపించి, హిందువులలో భయాన్ని పెంచడం బీజేపీ రాజకీయ వ్యూహంగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ‘లవ్ జిహాద్’ అనే పదం కూడా ఇలాగే వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. ముస్లిం యువకులు హిందూ మహిళలను ప్రేమలో పడేసి బలవంతంగా మతమార్పిడి చేస్తున్నారనే ఆరోపణలతో అనేక రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చాయి. అయితే కేంద్ర హోంశాఖే పార్లమెంట్‌లో ‘లవ్ జిహాద్’ అనే పదానికి భారత చట్టాల్లో ఎలాంటి నిర్వచనమూ లేదని స్పష్టం చేయటం గమనార్హం. కోర్టుల్లోనూ ఇలాంటి కేసుల్లో అనేక ఆరోపణలు నిలబడలేదని పలు నివేదికలు సైతం చెప్తున్నాయని విశ్లేషకులు వివరిస్తున్నారు.

​హిందూ మహిళల స్వతంత్రతకు విఘాతం
విమర్శకుల అభిప్రాయం ప్రకారం… ఈ కథనాల వెనుక ఉన్న ప్రధాన భావజాలం హిందూ మహిళలకు స్వతంత్ర నిర్ణయం తీసుకునే సామర్థ్యం లేదని భావించడం. ఒక మహిళ ముస్లిం వ్యక్తితో మాట్లాడినా, స్నేహం చేసినా, ఉద్యోగంలో కలిసి పనిచేసినా దానిని ‘కుట్ర’గా చిత్రీకరించడం ద్వారా మహిళల స్వేచ్ఛను కూడా నియంత్రించే ప్రయత్నం జరుగుతోందని వారు అంటున్నారు. ఇటీవల ‘మెహందీ జిహాద్’, ‘గర్బా జిహాద్’, ‘కార్పొరేట్ జిహాద్’ వంటి పదాలు కూడా మీడియా చర్చల్లోకి వచ్చాయి. నవరాత్రి వేళ గర్బా కార్యక్రమాలకు వెళ్లే ముస్లిం యువకులు హిందూ మహిళలను టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు, కార్పొరేట్ కార్యాలయాల్లో ముస్లిం ఉద్యోగులు మహిళలను మతమార్పిడికి ప్రేరేపిస్తున్నారనే కథనాలు ప్రచారం అయ్యాయి.

​మతపరమైన విభజనలు ప్రోత్సహిస్తున్న బీజేపీ
 ప్రభుత్వం
దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రైతు సమస్యలు, మహిళలపై పెరుగుతున్న హింస వంటి అసలు సమస్యలపై సమాధానాలు చెప్పలేకపోతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం… ప్రజల దృష్టి మళ్లించడానికి మతపరమైన విభజనలను ప్రోత్సహిస్తోందని మేధావులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా హిందుత్వ రాజకీయాలు మరింత దూకుడుగా మారాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దేశంలో మహిళల భద్రతను బీజేపీ ప్రభుత్వాలు గాలికి వదలేశాయనీ, దేశంలో పెరుగుతున్న వరకట్న హత్యలు, లైంగిక వేధింపులు, గృహ హింస వంటి సమస్యలపై మౌనం పాటిస్తున్నాయని సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ‘జిమ్ జిహాద్’ వంటి పదాలు అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించే రాజకీయ ఆయుధాలుగా మారుతున్నాయని వారు అంటున్నారు.

​ఇప్పటికే పలు ‘జిహాద్‌’ పదాలు తెరపైకి తెచ్చిన హిందూత్వ శక్తులు
అయినా కూడా, హిందూత్వ సంస్థలు కొత్త కొత్త ‘జిహాద్’ కథనాలను తయారు చేస్తూనే ఉన్నాయి. ‘ల్యాండ్ జిహాద్’ పేరుతో ముస్లింలు ప్రభుత్వ భూములపై మసీదులు, దర్గాలు నిర్మించి భూమిని ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు చేశాయి. అలాగే ‘కౌ జిహాద్’ పేరుతో ముస్లింలు పశువులను దొంగిలించి అక్రమ రవాణా చేస్తున్నారనే ప్రచారాన్ని హిందూత్వ సంస్థలు జరుపుతున్నాయి. ఇక ముస్లింలు, క్రైస్తవులు హిందువులకు అవయవ దానం చేసి వారి పవిత్రతను చెడగొడుతున్నారనే విచిత్రమైన కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చాయి. దీనికి ‘ఆర్గాన్‌ ‌జిహాద్‌’ అని పేరు పెట్టాయి. ఇక ముస్లిం పండ్ల వ్యాపారులు ఆహారంపై ఉమ్మి వేస్తూ వ్యాధులు వ్యాపింపజేస్తున్నారనే ఆరోపణలతో ‘తూక్‌ ‌జిహాద్‌’ పదాన్ని బీజేపీ, దాని అనుబంధ హిందూత్వ సంస్థలు ప్రచారం చేశాయి. ఇక ‘ఫర్టిలైజర్ జిహాద్’తో ముస్లిం రైతులు అధిక ఎరువులు వాడి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారనేది అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆరోపణ. వరదలు రావడానికి ముస్లింలే కట్టలు ధ్వంసం చేస్తున్నారనీ, దీనికి ఫ్లడ్‌ ‌జిహాద్‌ అని, ఢిల్లీలో ముస్లింలు జీన్స్ ఫ్యాక్టరీలు పెట్టి హిందువుల జనాభాను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారనీ, దీనికి జీన్స్‌ ‌జిహాద్‌ అని హిందూత్వ శక్తులు పేర్లు పెట్టాయని విశ్లేషకులు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -