ముంబయిపై 30 పరుగులతో గెలుపు
జోఫ్రా ఆర్చర్ ఆల్‌రౌండర్ షో
రాజస్తాన్ 205/8 ముంబయి 175/9
ఉత్కంఠకు తెరపడింది. రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఆదివారం వాంఖడెలో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై 30 పరుగుల తేడాతో గెలుపొందిన రాజస్తాన్ రాయల్స్ టాప్-4లో చోటు ఖాయం చేసుకుంది. రాజస్తాన్ రాయల్స్ గెలుపుతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ నిష్ర్కమించాయి. ఈ నెల 26న ధర్మశాలలో క్వాలిఫయర్1లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడనుండగా.. 27న న్యూ చంఢీగడ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ ఎలిమినేటర్‌లో ఢీకొట్టనున్నాయి. 29న న్యూ చంఢీగడ్‌లోనే క్వాలిఫయర్2 జరుగనుంది.
నవతెలంగాణ-ముంబయి
జోఫ్రా ఆర్చర్ (32, 15 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు.. 3/17) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముంబయి ఇండియన్స్‌పై రాజస్తాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్లే ఆఫ్స్‌కు చేరుకునేందుకు కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ సమిష్టిగా రాణించింది. లీగ్ దశలో ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరగటంతో ముంబయి ఇండియన్స్ భారీ ఛేదనతో చతికిల పడింది. పవర్‌ప్లేలోనే ముంబయి ఇండియన్స్ అవకాశాలను ఆర్చర్ దెబ్బకొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ (60, 42 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీకి తోడు విల్ జాక్స్ (33, 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్దిక్ పాండ్య (34, 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిసినా ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగులే చేసింది. రోహిత్ శర్మ (0), నమన్ ధిర్ (6), తిలక్ వర్మ (3), రియాన్ రికెల్టన్ (12) దారుణంగా నిరాశపరిచారు. రాజస్తాన్ రాయల్స్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, నండ్రె బర్గర్ (2/43), బ్రిజేశ్ శర్మ (2/26), యశ్ రాజ్ (2/44) క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. ఏ దశలోనూ గెలుపు దిశగా సాగని ముంబయి ఇండియన్స్ ఓటమితో సీజన్‌ను ముగించింది.
సమిష్టి ప్రదర్శన :
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ సమిష్టి ప్రదర్శనతో భారీ స్కోరు చేసింది. వైభవ్ సూర్యవంశీ (4) నిరాశపరచగా, యశస్వి జైస్వాల్ (27, 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఎదురుదాడి ఎంతోసేపు కొనసాగలేదు. ధ్రువ్ జురెల్ (38, 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), దశున్ శనక (29, 15 బంతుల్లో 3 సిక్స్‌లు), జోఫ్రా ఆర్చర్ (32), రవీంద్ర జడేజా (19 నాటౌట్, 11 బంతుల్లో 3 ఫోర్లు), బర్గర్ (10 నాటౌట్, 3 బంతుల్లో 1 సిక్స్) రాణించారు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ (2/41), దీపక్ చాహర్ (2/43) రాణించినా.. రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. రాయల్స్ బ్యాటర్లలో ఎవరూ అర్థ సెంచరీ సాధించకపోయినా.. అందరూ సమిష్టిగా స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. టెయిలెండర్లు ఆర్చర్, బర్గర్, సహా జడేజా ఆఖర్లో విలువైన పరుగులు జోడించారు. దీంతో రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది.
సంక్షిప్త స్కోరు వివరాలు :
రాజస్తాన్ రాయల్స్ : 205/8 (ధ్రువ్ జురెల్ 38, జోఫ్రా ఆర్చర్ 32, శనక 29, శార్దుల్ ఠాకూర్ 2/41, దీపక్ చాహర్ 2/43)
ముంబయి ఇండియన్స్ : 179/9 (సూర్యకుమార్ యాదవ్ 60, హార్దిక్ పాండ్య 34, విల్ జాక్స్ 33, జోఫ్రా ఆర్చర్ 3/17, బ్రిజేశ్ శర్మ 2/26)



