అదే వైఖరిని దేశంలోనూ స్పష్టంగా ప్రకటించి అమలు చేయాలి
నేడు ఢిల్లీలో లక్షలాది మందితో సీపీఐ నిరసన
మతం పేరుతో రాజకీయ లబ్ది పొందే విధానాన్ని వీడాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన విదేశీ పర్యటనలో భాగంగా భారతదేశం అందరిదనే భావన, వైవిధ్యంలో ఏకత్వం, సమ్మిళిత అభివృద్ధి వంటి అంశాలను ప్రస్తావించడం స్వాగతించదగిన విషయమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని మఖ్ధూంభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోహన్ భగవత్ విదేశాల్లో మాట్లాడడం మాత్రమే కాకుండా అదే వైఖరిని దేశంలో కూడా స్పష్టంగా ప్రకటించి అమలు చేయాలని కోరారు. మతం పేరుతో రాజకీయ లబ్ది పొందే విధానాన్ని వీడాలని, హిందూ మతాన్ని, రాముడిని ఒక రాజకీయ పార్టీకి మాత్రమే చెందిన వారిగా చూపడం సరైందికాదన్నారు. అన్ని మతాలు, కులాలను సమానంగా చూడాలని చెప్పారు. రాజకీయాలకు మతానికి, దేవుళ్లకు సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై రాజకీయాలు కొనసాగితే ప్రయోజనమన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలతో పాటు బీజేపీ అనుసరిస్తున్న మత రాజకీయాలను నిరసిస్తూ సీపీఐ జాతీయ సమితి ఆధ్వర్యంలో ‘బద్లావ్ జరూరీ హై’ నినాదంతో మంగళవారం ఢిల్లీలో లక్షలాది మందితో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బీజేపీ మత విశ్వాసాలు, దేవుళ్లను రాజకీయాలతో ముడిపెట్టి రాజకీయ లబ్ది పొందే విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ప్రతి మార్పు వెనుక యువత కీలక పాత్ర పోషిస్తుందని గుర్తు చేశారు. విద్య, ఉద్యోగాలు, భవిష్యత్ అవకాశాలపై యువత తీవ్ర ఆందోళనతో ఉన్నదని తెలిపారు. ప్రభుత్వ విధానాలపై ఎన్నో ఏండ్లుగా పేరుకుపోయిన నిరాశ, ఆగ్రహం యువతలో తిరుగుబాటు భావనకు దారితీస్తోందని, అందులో నుంచి పుట్టిందే జెన్-జీ ఉద్యమమని తెలిపారు. ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ కారణంగా శాశ్వత ఉద్యోగాల స్థానంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగికి చెల్లించే వేతనంతోనే పలువురు కాంట్రాక్ట్ కార్మికులను పని చేయించుకుంటున్నారని విమర్శించారు. వీటన్నింటికి వ్యతిరేకంగా ‘బద్లావ్ జరూరీ హై’ నినాదంతో ఈ నిరసన కార్యక్రమానికి సీపీఐ శ్రీకారం చుట్టిందని తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకులు అవసరంలేని అంశాల జోలికి వెళుతూ తమకు తాము చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారని చెప్పారు. ఇది ప్రభుత్వానికే మంచిదికాదని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యను స్కిల్ విశ్వవిద్యాలయంలో విలీనంపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, మేధావులతో చర్చించిన అనంతరమే విద్యార్థులకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంతో పోల్చితే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేసిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలలో అసంతృప్తి కనిపిస్తుండడానికి ప్రధాన కారణం తమ శాఖలకు సంబంధించి ఆర్థికపరమైన అంశాలలో తాము స్వయంగా నిర్ణయాలు చేయలేకపోవడమేనని చెప్పారు. బడ్జెట్‌లో కేటాయించిన నిధులను ఆయా శాఖల మంత్రులు నిర్ణయాలు తీసుకునే విధంగా, ఖర్చు పెట్టుకునే విధంగా ఉండాలని సూచించారు. సాదా బైనామాలతో పాటు 22ఏ భూముల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలు, ఇతర అవసరాలకు భూములు కేటాయించే సందర్భంలో నిర్ణయాలు న్యాయబద్ధంగా, పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవా లన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసేందుకు ప్రభుత్వం జీఓ జారీ చేయడం హర్షణీయమని, అయితే ఇంకా అనేక రంగాల్లో ఆ జీఓ అమలు కావడంలేదని పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ కూతురు సీఎం స్థాయిని అవమాన పర్చే విధంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి కష్టపడ్డారని గుర్తు చేశారు.
మోహన్ భగవత్ వ్యాఖ్యలు సమర్థనీయమే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



