– మాజీ సీఎం శివరాజ్ చౌహాన్‌కు బీజేపీ హైకమాండ్ హ్యాండ్..
– స్పీకర్‌గా నరేంద్ర తోమర్
జైపూర్ : మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని ఎవరు చేపట్టాలన్న సస్పెన్స్‌కు తెరపడింది. ఒక్కసారి ఛాన్స్ ప్లీజ్ అంటున్న ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను బీజేపీ అధిష్టానం పక్కనబెట్టింది. ఛత్తీస్‌గఢ్‌లో రమణ్ సింగ్‌ను కాదన్నట్టుగానే.. మధ్యప్రదేశ్‌లోనూ శివరాజ్‌కు నో అనేసింది. ఆ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో సోమవారం జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా మోహన్ యాదవ్‌ను ఖరారు చేశారు. జగదీశ్ దేవరా, రాజేంద్ర శుక్లా డిప్యూటీ సీఎంలుగా ఎంపికయ్యారు. నరేంద్ర సింగ్ తోమర్‌కు అసెంబ్లీ స్పీకర్ బాధ్యతలు అప్పగించారు.
మధ్యప్రదేశ్‌లో ఉత్కంఠకు తెర
బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే విషయమై వారంరోజులకుపైగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. శాసనసభా పక్ష సమావేశంలో మోహన్ యాదవ్ పేరుపై ఏకాభిప్రాయం కుదిరింది. మోహన్ యాదవ్ ఉజ్జయిని సౌత్ ఎమ్మెల్యే. మోహన్ యాదవ్ సంఫ్‌ుకు సన్నిహితుడు. అయితే శాసనసభా పక్ష సమావేశంలో మోహన్ యాదవ్ పేరును శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతిపాదించినట్టు సమాచారం. కాగా శాసనసభా పక్ష సమావేశం జరుగుతున్న సమయంలో ప్రహ్లాద్ పటేల్, శివరాజ్ సింగ్ చౌహాన్ మద్దతుదారులు పార్టీ కార్యాలయం వెలుపల నినాదాలు చేశారు. అధిష్టానం వ్యూహాత్మకంగా శివరాజ్ సింగ్ చేత సీఎంగా మోహన్ పేరును ప్రకటించేలా చేయటంతో.. సీఎం కుర్చీ ఆటకు తెరపడింది.
ఛత్తీస్‌గఢ్ తరహాలో మధ్యప్రదేశ్‌లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రాజస్థాన్‌లో సీఎం ఎంపిక అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రేసులో…
ముఖ్యమంత్రి రేసులో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్, కైలాశ్ విజయవర్గీయ, ప్రహ్లాద్ పటేల్, వీడీ శర్మ పేర్లు వినిపించాయి. అయితే ఈ రేసులో మోహన్ యాదవ్ పేరు ప్రస్తావనలోకి రాలేదు. అంతేకాదు శాసనసభా పక్ష సమావేశానికి ముందు జరిగిన ఫొటో సెషన్‌లో కూడా మోహన్ యాదవ్ వెనుక వరుసలోనే కూర్చున్నారు. కేవలం సంఫ్‌ు సభ్యుడు కావటంతో సీఎం అయ్యారని శివరాజ్ సన్నిహితులు వాపోతున్నారు.
మోహన్ యాదవ్‌కు రూ.45 కోట్ల ఆస్తులు..రూ.9 కోట్ల అప్పులు
ఉజ్జయిని సౌత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ మోహన్ యాదవ్ బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, పీహెచ్‌డీలో పట్టా పొందారు. శివరాజ్ ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఆస్తుల విలువ రూ.42 కోట్లు ఉంటే.. అప్పు దాదాపు రూ.9 కోట్లుగా చూపారు. అలాగే ఆయన వద్ద రూ.1.41 లక్షల నగదు ఉండగా, ఆయన భార్య వద్ద రూ.3.38 లక్షల నగదు ఉంది. బ్యాంకుల్లో సీఎం మోహన్ , అతని భార్యకు వేర్వేరు బ్యాంకుల్లోని ఖాతాలలో రూ.28,68,044.97 డిపాజిట్లున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో మోహన్ యాదవ్ ఈ సమాచారాన్ని ప్రస్తావించారు. ఈయన రాష్ట్రంలో అత్యంత ధనిక నాయకుల్లో ఒకరు. మధ్యప్రదేశ్ 2018 అసెంబ్లీ ఎన్నికలకు గరిష్ట ఆస్తులను ప్రకటించిన మధ్యప్రదేశ్ టాప్-3 మంత్రులలో, భూపేంద్ర సింగ్ మొదటి స్థానంలో ఉండగా, మోహన్ రెండో స్థానంలో ఉన్నారు.
షేర్-బాండ్లలో పెద్ద పెట్టుబడి
ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. మోహన్ యాదవ్ తన భార్యతో కలిసి పలు కంపెనీల షేర్లు, డిబెంచర్లు, బాండ్లలో రూ.6,42,71,317 ఇన్వెస్ట్ చేశారు. పొదుపు ఖాతాల్లో డబ్బులు కూడా జమ చేశారు. సమాచారం ప్రకారం బజాజ్ అలయన్స్‌లో ఆయన దాదాపు రూ.3 లక్షల విలువైన పాలసీని కలిగి ఉన్నారు. భార్య పేరు మీద రిలయన్స్ నిప్పన్, బజాజ్ అలియాంజ్‌లో రూ.9 లక్షల కంటే ఎక్కువ విలువైన బీమా పాలసీ ఉంది.
బంగారం..కారు..
ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం…మోహన్ యాదవ్ వద్ద దాదాపు 140 గ్రాముల బంగారం ఉంది. మార్కెట్ విలువ సుమారు రూ.8 లక్షలు. ఆయన భార్య వద్ద 250 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.2 కిలోల వెండి ఉంది. వీటి విలువ సుమారు రూ.15.78 లక్షలు. వీటితో పాటు రూ.22 లక్షల విలువైన ఇన్నోవా కారు, రూ.72 వేల విలువైన సుజుకీ స్కూటర్ ఉన్నాయి. ఆయుధాలను పరిశీలిస్తే.. రూ.80 వేల విలువైన రివాల్వర్, రూ.8 వేల విలువైన 12 బోర్ గన్ కూడా ఉన్నాయి.
కోట్ల విలువైన భూములు
డాక్టర్ మోహన్ యాదవ్ దంపతులకు కోట్ల విలువైన భూమి ఉంది. దాదాపు రూ.15 కోట్ల విలువైన వ్యవసాయ భూమి ఉంది. ఇది కాకుండా ఉజ్జయినిలో మోహన్ యాదవ్ పేరిట సుమారు కోటి రూపాయల విలువైన ప్లాట్ ఉంది. ఆయన భార్య పేరు మీద దాదాపు రూ.6 కోట్ల విలువైన రెండు వ్యవసాయేతర భూములున్నాయి. అలాగే భార్యాభర్తల పేర్లపై రూ.6 కోట్లకుపైగా విలువైన ఇండ్లు, ఫ్లాట్లు ఉన్నాయి.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 58 ఏండ్ల డాక్టర్ మోహన్ యాదవ్ ఉజ్జయిని సౌత్ స్థానం నుంచి బీజేపీ టిక్కెట్‌పై 95,699 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్‌కు చెందిన చేతన్ ప్రేమనారాయణ యాదవ్‌పై 12,941 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.