అమ్మకు అందలం!

Mom is beautiful!కౌసల్యా..రామా.. అనే కాలర్‌ ట్యూన్‌తో సెల్‌ ఫోన్‌ మోగింది.
కొద్ది సేపటికి జానకమ్మ ఫోన్‌ ఆన్‌ చేసి ”హలో!” అంది.
”అమ్మా! నేను సంధ్యని!” అని అవతలి వైపునుండి వినిపించింది. ఆగకుండా తనే ”అదేమిటి అంత సేపు పట్టిందేమిటి ఫోన్‌ తీయడానికి!?” అని ప్రశ్నించింది.
”నువ్వా తల్లి! ఏమీ లేదమ్మా! నిద్రపోతున్నాను!” అంది జానకమ్మ.
”ఈ టైంలో పడుకోవటమేమిటి! మీ దగ్గర టైం ఎంతయిందేమిటి!? ఆ.. సాయంత్రం 5 గంటలై ఉంటుంది. అసుర సంధ్యవేళ పడుకోవద్దని నువ్వే చెబుతావుగా! వొంట్లో బాగోలేదా!” అడిగింది సంధ్య.
”బాగానే ఉందమ్మా!.. ఏదో అలిసిపోయినట్టయి కన్ను మూత పడింది.. (అని దగ్గింది..)!” అంది జానకమ్మ.
”నువ్వు అబద్ధం చెబుతున్నావు! ఆ దగ్గేమిటి! మాట మాట్లాడటానికి కూడా ఆయాస పడుతున్నావు! నాన్న ఇంట్లో లేడా!?” ఆందోళనగా అడిగింది సంధ్య.
”అంత సీరియస్‌గా ఏమి లేదే! సీజన్‌ మారుతోందిగా (మళ్లీ దగ్గు..) అందుకే కాస్త జలుబు చేసింది. విక్స్‌ రాసుకున్నాను. తగ్గిపోయిందిలే!” అంది జానకమ్మ.
”నాన్న ఏడి! ఇంట్లో లేడా! ముందు ఆ విషయం చెప్పు! నిన్నొక్కదాన్ని ఇంట్లో వదిలేసి సీరియల్స్‌, షార్ట్‌ ఫిలింలంటూ షూటింగులకు వెళ్లాడా!” సీరియస్‌గా అంది సంధ్య.
”ఏదో ఆయన పనులు ఆయనకుంటాయే.! నాలాగా ఇంట్లో కూర్చుని వంటలు చేసుకొనే మనిషా! వరంగల్‌లో ఏదో సీరియల్‌ షూటింగ్‌ ఉందని మొన్న వెళ్లారు. రెండు రోజుల్లో వచ్చేస్తారులే!” సర్ది చెబుతున్నట్టు అంది జానకమ్మ.
”అదేంటమ్మా! ఉద్యోగం చేసినంత కాలం అటు ఉద్యోగం, ఇటు నాటకాలు, సీరియల్స్‌ షూటింగులంటూ ఒక్క పూట కూడా ఇంట్లో లేకుండా తిరిగాడు. ఆదివారాలైతే అసలే కనబడేవాడు కాదు. నన్నూ, చెల్లిని కనిబెట్టుకుని రాత్రిం బవళ్ళు నువ్వే కాసావు. అటు వంట పని, ఇంట్లో పని, ఆయనకు సేవలు చేస్తూ నీ జీవితమంతా గడిచిపోయింది. ఒక్క రోజూ సుఖపడింది లేదు. యంత్రంలా పనిచేశావు. ఈ రోజు మేం చదువుకొని అమెరికాలో సెటిలయ్యామంటే అంతా నీ చాకిరీవల్లే గదమ్మా! రిటైర్‌ అయ్యాకన్నా ఇంటిపట్టున వుండి నిన్ను చూసుకుంటాడంటే అదీ లేదు! ఇంకా బిజీ అయిపోయాడు!.. నీకు వొంట్లో బాలేదని ఆయనకు తెలుసా!” ఆవేదనగా అంది సంధ్య.
”అదేంటే నాన్నగారిని అంత మాటంటావు! ఆయన బయట తిరిగి సంపాదించకపోతే మనమందరం బతికే వాళ్లమా! ఇంత బాగుపడేవాళ్ళమా! మా తరం ఆడవాళ్ళ జీవితమే ఇంతమ్మా! మాకు వేరే వ్యాపకమేముంటుంది! సంసారం చేయడం, పిల్లలను కనడం, వాళ్ళను కనిపెట్టుకుని, పెంచి పెద్దవాళ్ళను చేయడం! మా అమ్మా అదే చేసింది. నేనూ అదే చేశాను! అదేదో విడ్డూరంలాగా, నేనొక్కదాన్నే కష్టపడిపోయినట్టు మాట్లాడుతావ్‌!” దీర్గాలు తీస్తూ అంది జానకమ్మ!
”నువ్వెప్పుడూ అనేమాటే ఇదేగానీ!.. నాన్నకు నీ జ్వరం గురించి తెలుసా లేదా! ఆ మాట చెప్పు!” విసుగ్గా అంది సంధ్య.
”ఆయన బయలుదేరేటప్పుడే కొద్దిగా మొదలయిందమ్మా! కానీ ఆయన షూటింగ్‌ అప్పటికే ఫిక్స్‌ అయింది. అది మానకూడదని చెప్పాడు. నేనే వెళ్ళమని చెప్పానులే! దానిదేముంది అవసరమైతే పక్కింటి ఆంటీని తోడుగా తీసుకొని డాక్టర్‌ దగ్గరకు వెళ్ళమని చెప్పారు! ఒకటి రెండు రోజుల్లో తగ్గకపోతే ఆ పనే చేస్తాలే!” మళ్లీ దగ్గసాగింది జానకమ్మ.
”పీకలమీదకొచ్చే దాకా ఇంట్లో అలాగే పడుకో!.. ఆయనకు బుద్ధి లేదు.. నీకు లేదు! నాన్న కనీసం ఫోన్‌ చేసి తెలుసుకుంటున్నాడా!” సంధ్య కోపంగా అంది.
”ఆయన షూటింగ్‌ చేసే ప్లేసులో ఫోన్‌ సిగల్స్‌ వుండవట! ఆయనేం చేస్తాడు. ఎందుకే ఊరికే అంత కంగారు పడి ఇంతెత్తున ఎగురుతున్నావు! నేను ఈ రోజే డాక్టర్‌ దగ్గరకు వెళ్ళొస్తాలే!” అంది జానకమ్మ.
”ఇవాళ మొదటిసారి కాదు గదమ్మా! ఇలా ఎంతకాలం ఒంటరిగా గడుపుతావు. షూటింగులు, నాటకాలంటూ నాన్న ఊరిమీద తిరుగుతుంటాడు. నువ్వేమో పిచ్చిదానిలా ఆ వెధవ టీవీ పెట్టుకొని ఆయన ఎప్పుడొస్తాడా, పాద సేవ చేద్దామని ఎదురు చూస్తుంటావు. అమ్మమ్మంటే చదువుకోలేదు. వాళ్ళ తరం అలా గడిచి పోయింది. నువ్వు చదువుకున్నా వుద్యోగం లేకుండా మాకోసమే ఇన్నాళ్లు గడిపావు. నీక్కూడా అరవై ఏళ్ళు దాటాయి గదా! ఇప్పటికైనా నిన్ను సుఖంగా చూడాల్సిన బాధ్యత ఆయన మీద లేదా! మేమేమైనా మాట్లాడితే ఆయనకు కోపం. ఇంతెత్తున లేస్తాడు! నువ్వుకూడా మీ అమ్మలాగానే ఇంట్లో మగ్గిపోవాలని అనుకోకు. నీ వెనక మేమున్నాం…. ఇది ఇలా కాదుగాని నేనూ చెల్లి కలిసి ఏదో ఒకటి ఆలోచిస్తాం! ముందు నువ్వు డాక్టర్‌ దగ్గరకు వెళ్లిరా! ఏమన్నాడో నాకు మెసేజ్‌ పెట్టు! ఉంటా!” అని ఫోన్‌ పెట్టేసింది సంధ్య.
ఏమిటో ఈ కాలం పిల్లలు అని అనుకుంటూ వుసూరుమంది జానకమ్మ!

వారం రోజులవుతుందనుకున్న షూటింగ్‌ పదిహేను రోజులవడంతో ప్రముఖ నటుడు సుబ్రమణ్యం ఆలస్యంగా ఇంటికి చేరాడు. షూటింగు తాలూకు జ్ఞాపకాలను నెమరేసుకుంటూ, ఆ నెలలో చేయాల్సిన ఇతర కార్యక్రమాలను సరి చూసుకుంటూ, తోటి కళాకారులతో మాటలు చెప్పుకుంటూ రిటర్న్‌ జర్నీ హుషారుగా గడిచి పోయింది. ఇంటిముందు కార్‌ ఆగే వరకు సమయమే తెలీలేదు. టైం చూస్తే మధ్యాహ్నం ఒంటిగంట అవుతోంది.
చేతిలో సూట్‌ కేసుతో దిగిన ఆయనకు తన శ్రీమతి ఎదురొస్తుందనుకుంటే గేట్‌కు తాళం వెక్కిరిస్తున్నట్టు కనబడింది. దానితో ఈ ప్రపంచంలోకి వచ్చిపడ్డాడు. ఎక్కడకు పోయింది ఈవిడ! అని విసుక్కుంటూ వచ్చి డూప్లికేట్‌ కీస్‌తో తాళం తీసి ఇంట్లోకి ప్రవేశించాడు. ఎప్పుడూ తళతళలాడుతూ కనబడే పోర్టికో, వరండా దుమ్ము ధూళితో ఉండడం చూసి ఆశ్చర్యం కలిగింది.
”జానకికి ఏమైంది! ఇల్లంతా దుమ్ముకొట్టుకు పోయింది. ఎప్పుడు ఇలా వుంచదే!” అనుకుంటుంటే, తాను వెళ్ళేటప్పుడు ఆమె జ్వరంతో ఉండడం గుర్తొచ్చింది. ‘కొంపదీసి ఏమి కాలేదుగా?!’ గుండె ఒక్కసారిగా ఆందోళనతో వణికింది. ఛీ ఛీ నేనే తప్పు చేశాను! మధ్యలో ఒక్కసారి కూడా ఫోన్‌ చేయలేదు! అని తిట్టుకున్నాడాయన.
సరే ఇప్పుడేమనుకుని ఏం లాభం! ఇగనుంచైనా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఎప్పుడూ కాలేదు అనుకుంటూనే తలుపు తీసి ఇంట్లోకి ప్రవేశించాడు. హాల్లో పరిస్థితీ అలాగే వుంది. కనీసం వారం రోజులనుండి ఇంట్లో ఎవరూ లేని ఆనవాళ్లు కనబడుతున్నాయి. చేతిలోని సూట్‌కేసును టీపారు మీద పడేసి జేబులో నుండి ఫోన్‌ తీసి జానకి నెంబర్‌కు డయల్‌ చేశాడు సుబ్రహ్మణ్యం. భార్యకు ఏమైందో అనే ఆందోళన ఆయన మోహంలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అవతల రింగవుతోంది కానీ ఎత్తడం లేదు. ఆయనలో కంగారు మరింత పెరిగింది. మరోసారి చేశాడు. ఈ సారికూడా నో రిప్లై. కాసేపటికి ఆ ఫోన్‌ ఇంట్లో బెడ్‌రూమ్‌లో నుండి రింగ్‌ అవుతోందని గ్రహించాడు. ఇదేంటి ఫోన్‌ కూడా ఇంట్లో పడేసి పోయింది! దీనికేమైంది అసలు! అనుకుంటూ బెడ్‌ రూమ్‌లోకి పరిగెత్తాడు.
అక్కడ బెడ్‌ పక్కనే వున్న టీపారు మీద జానకి ఫోన్‌, దాని కిందనే ఒక కాగితం వుంది. దానిపై…
”ఏమండీ!..
మీరు వెళ్ళిపోయాక నాకు జ్వరం పెరిగి పోయింది. పెద్దమ్మాయి ఫోన్‌ చేసి దాని ఫ్రెండ్‌ సుజిని పంపి హాస్పిటల్‌లో జాయిన్‌ చేయించింది. దేవుడి దయ వల్ల రెండు రోజుల్లోనే కోలుకున్నాను. ఆ రెండు రోజులు సుజి, వాళ్ళ ఆయన నాతోనే వున్నారు. మీకు ఫోన్‌ చేస్తే కలవ లేదు. పిల్లలిద్దరూ కలిసి మాట్లాడుకొని నాకు అమెరికాకు టికెట్‌ బుక్‌ చేశారు. నేను వద్దని ఎంత చెప్పినా వినలేదు. మీరు రాగానే మిమ్మలనుకూడా అమెరికాకు రప్పిస్తామని అనడంతో నేను మొన్న గురువారంనాడు అమెరికాకు బయలుదేరాను. సుజి వాళ్ళు విమానం ఎక్కే వరకు నాతోటే వున్నారు. మీరు ఇంటికి వచ్చేసరికి నేను లేకపోవడం మీకు ఇబ్బంది కలిగివుంటుంది. నన్ను క్షమించండి. పిల్లలు పట్టుబట్టారు. నేను రాకపోతే వాళ్ళ మీద వొట్టే అని బలవంత పెట్టేశారు. మీరు రాగానే పిల్లలకు ఫోన్‌ చేయండి. నేను మాట్లాడుతాను.
– ఇట్లు జానకి
కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది సుభ్రమణ్యానికి! ఇదేమిటి చెప్పా పెట్టకుండా ఏదో అనకాపల్లి కెళ్లినట్టు అమెరికాకు వెళ్లిపోవడమేమిటి! నేను వచ్చే వరకు ఆగొచ్చుగా! ఈ పిల్లలకు మరీ బుద్ధి లేకుండా పోయిందని కోపం నషాళానికెక్కింది. అదే ఆవేశంలో అమెరికాకు ఫోన్‌ కలిపాడు. కాసేపటికి అవతల సంధ్య ఫోన్‌ ఎత్తింది!
”ఇదేంటి నాన్న, ఇంత రాత్రి ఫోన్‌ చేసావు. టైం చూసుకోవద్దా!” అని చిరాకు పడింది.
”సారీరా..! నేనిప్పుడే వచ్చాను. అమ్మ లేకపోవడంతో కంగారులో టైం చూసుకో లేదు. రేపు పొద్దున్న చేస్తాలే!” అన్నాడు.
”పర్వాలేదు నాన్న! లేచేశాంగా మాట్లాడు!” అంది సంధ్య.
”అదేరా! అమ్మకు ఎలా ఉందిరా! నేనొచ్చే వరకైనా ఆగక పోయారా! హఠాత్తుగా తీసుకెళ్లి పోయారు!” నిష్టూరంగా అన్నాడు.
”అమ్మ ఇప్పుడు బాగానే వుంది. ఇక్కడకు వచ్చాక ఒక్క రోజులోనే కోలుకుంది. ఆవిడకు మా మీద, మనవళ్ల మీద బెంగ! నన్నూ, చెల్లిని చూసి ఎంతో సంతోషించింది. నీకు చెప్పాలంటే నీ ఫోన్‌ పని చేయలేదు. ఎప్పుడొస్తావో తెలీదు. అమ్మ హాస్పిటల్‌ నుండి ఇంటికొచ్చాక ఇంట్లో ఎవరు చూస్తారు. ఎంత క్లోజ్‌ ఫ్రెండ్‌ అయినా సుజి చూడలేదుగా! దాని సంసారం దానికుంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం!” కూల్‌గా చెప్పింది సంధ్య.
”బాగున్నాయే మీ ప్రేమలు. నన్నొక్కడిని వదిలిపెట్టి పోతే నేనేమైపోతానో అనే ఆలోచన మీకు లేదా!” ఆక్రోశంగా అన్నాడు సుభ్రమణ్యం.
”నీకేంటి నాన్న! నెలకు ఇరవై రోజులు పైగా బయటనే తిరుగుతుంటావు. తినడానికి హోటళ్లు ఉండనే వున్నాయి. ఇంట్లో వున్నప్పుడు ఎవరైనా పనివాళ్లను పిలిచి శుభ్రం చేయించుకో! మన కాలనీలో టిఫిను, భోజనాలు సప్లై చేసే క్యాటరర్లు ఉండనే వున్నారు. అమ్మతో నీకేం పని! మాకు అమ్మతో పనులుంటాయి! అమ్మ కూడా సంతోషంగా ఉంటోంది. వీడియో కాల్స్‌ ఉండనే వున్నాయి. నీకు వీలైనప్పుడల్లా మాట్లాడు. అమ్మ నాదగ్గర కొన్ని రోజులు, చెల్లి దగ్గర కొన్ని రోజులు ఉంటుంది” యథాలాపంగా అంది సంధ్య.
”నీకు తెలివితేటలు పెరిగిపోయాయే! నాకు చెప్పా పెట్టకుండా అమ్మను తీసుకుపోయి వెధవ కబుర్లు చెబుతున్నావా! వెంటనే అమ్మను పంపించు” ఆగ్రహంతో ఊగిపోయాడు సుభ్రమణ్యం.
”కూల్‌ నాన్న! కూల్‌! ఎందుకట్లా అరుస్తావు! అమ్మ నీకెంత సొంతమో ఆమె కడుపున పుట్టిన మాకూ అంతే సొంతం! నువ్వు ఉద్యోగం చేసినంతకాలం ఒక్క రోజూ ఇంట్లో వున్న పాపాన పోలేదు. మా చిన్నప్పుడంతా అమ్మే ప్రపంచంగా గడిపాం! ఇప్పుడు అమెరికాలో మేమింత మంచి పొజిషన్‌లో సెటిలయ్యామంటే అది అమ్మ పెంపకమే! మమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని పెంచింది. అలాంటి అమ్మ ఈ వయస్సులో కూడా దిక్కు లేనిదానిలా ఇంట్లో ఒక్కతి జ్వరమొచ్చినా చూసేవాళ్లు లేక పడుంటే చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నాం! నీకు బాధ కలుగుతుందని తెలిసినా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు! సరే అమ్మకు ఫోన్‌ ఇస్తా అమ్మతోనే మాట్లాడు!” అంది సంధ్య.
కాసేపటికి జానకి లైన్‌లోకి వచ్చింది.
”ఏమండి ఎలా వున్నారు! ఇంటికెప్పుడు వచ్చారు!” ఆతతగా అడిగింది జానకి.
”ఇప్పుడే తగలడ్డాకాని, నువ్వు చేసిన పనేమన్నా బాగుందా! నేను ఇంట్లోలేనప్పుడు పిల్లల మాట పట్టుకుని చెప్పా పెట్టకుండా అమెరికా చెక్కేస్తావా! నా బాగోగులు ఎవరు చూస్తారే! నీకు నీ సంసారం అక్కర్లేదా! నోరుమూసుకుని వెంటనే బయల్దేరిరా!” ఉగ్రంగా అరిచాడు.
”అయ్యయ్యో! అదేంటండి అలా అంటారు. నా ఆరోగ్యం బాగా లేదని పిల్లలు అలా చేశారు. దీనిలో తప్పేముందండి. మీరెలాను ఇంట్లో వుండరు. ఒక్కదాన్ని ఆ ఇంట్లో పడుండడమెందుకని అనుకున్నాను! ఇక్కడ మన బుజ్జి మనవళ్లను నేనే చూసుకుంటున్నాను. నా ఆరోగ్యం కూడా కుదుటపడింది. ఇంటికి వస్తానులెండి రాకెక్కడ పోతాను. అయినా మీరు ఇంటికి రాగానే మిమ్మలను కూడా ఇక్కడికి తెప్పిస్తామని పిల్లలు చెప్పారుగా! ఊరికే కోప్పడి పోతున్నారు!” జానకి అంది.
అంతలోనే సంధ్య కాల్‌లోకి వచ్చింది. ”అవును నాన్నా! అమ్మకు మేం అలానే చెప్పాం! నువ్వు అమ్మతో పూర్తి సమయం ఎప్పుడుంటావో చెప్పు. అప్పుడే నీకు కూడా ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేస్తాం. అప్పటి దాకా అమ్మను ఇక్కడే ఉండని. మాకు, ఆవిడకు మనశ్శాంతిగా ఉంటుంది!” అంది సంధ్య.
ఆ మాటకు సుభ్రమణ్యం గొంతులో వెలక్కాయ పడినట్లయింది.
ఆయనకు మరో రెండు రోజుల్లోనే టూర్‌ వుంది. ఈసారి ఇంకా బిజీ! నెల్లాళ్ళ పాటు అవుట్‌ స్టేషన్‌ వెళ్ళాలి. ప్రముఖ సినీ ప్రొడ్యూసర్‌తో లేక లేక అవకాశం దొరికింది. ఏం సమాధానం చెప్పాలి!
”అలాగేనమ్మా! నేను ఫ్రీ కాగానే మీకు కాల్‌ చేస్తాను. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి!” అని కాల్‌ డిస్‌ కనెక్ట్‌ చేసి నీరసంగా మంచం మీద వాలిపోయాడు! తాను అల్లుకున్న సాలెగూడులో తానే చిక్కుకున్నట్లుగా అనిపించింది సుబ్రమణ్యానికి!

– సత్య భాస్కర్‌ ఆత్కురు, 9848391638

Spread the love