– బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే
– తల్లిని చంపి బిడ్డను వేరుచేశారని ప్రధాని అన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు?
– టీఎస్‌గా మార్చినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? : బీజేపీ సభ్యులపై మంత్రి డాక్టర్ దనసరి అనసూయ ధ్వజం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శ్రమైక జీవన సౌందర్యానికి తెలంగాణ తల్లి ప్రతీక అని మంత్రి డాక్టర్ దనసరి అనసూయ(సీతక్క) నొక్కిచెప్పారు. తెలంగాణ ఆడబిడ్డలు ఎట్టిబిడ్డలు కాదు మట్టి బిడ్డలు, గట్టి బిడ్డలనీ, వారికి ప్రతిరూపంగా విగ్రహం ఉందని అన్నారు. సోమవారం శాసనసభా సమావేశాల్లో ఆమె మాట్లాడారు. సోనియాగాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు సొంత రాజకీయ ఎజెండాతో వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడి పదేండ్లు అవుతున్నా ఇప్పటిదాకా తెలంగాణ తల్లికి అధికారికంగా రూపం లేదన్నారు. కేవలం బీఆర్‌ఎస్ రూపం, ఆ పార్టీ జెండా రూపం, కేటీఆర్ చెల్లికి విగ్రహ రూపం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహం అని ప్రచారం చేసి ప్రజలమీద రుద్దారని విమర్శించారు. టీఆర్‌ఎస్ పార్టీ పేరుకు అనుగుణంగా రాష్ట్ర సంక్షిప్త పేరును టీఎస్‌గా మార్చారన్నారు.
ఉద్యమకారులు బండ్లమీదనే కాకుండా గుండెల మీద టీజీ గుర్తు వేయించుకున్నారనీ, వారి ఆకాంక్షల మేరకు ఇప్పుడు టీజీగా మార్చామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు గుండె నిండుగా పాడుకునే జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా చేసుకుందామని ఆలోచన చేయలేదని విమర్శించారు. అందెశ్రీ గీతాన్ని వినడానికి కూడా గత పాలకులు వినడానికి ఇష్టపడలేదనీ, ప్రజాప్రభుత్వం అధికారికంగా గుర్తించడంతో ఇప్పుడు ఏ సమావేశానికి వెళ్లినా దళిత బిడ్డ అందె శ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపిస్తుంటే మనసు పులకరిస్తున్నదని చెప్పారు. ఇప్పుడు తమ ప్రజాప్రభుత్వం ఏం చేయాలని చూసినా బీజేపీ, బీఆర్‌ఎస్ సభ్యులు అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని పార్లమెంటు సభలో ప్రధాని మోడీ అవమానించారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటును కించపరిచిన చరిత్ర బీజేపీదన్నారు. ఇప్పుడు బీజేపీ సభ్యులు తెలంగాణ తల్లి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తాను ఎక్కడున్నా పోరాటంలోనే, ప్రజలతోనే ఉన్నాననీ, తెలంగాణ ఉద్యమంలో జైలు జీవితం కూడా అనుభవించానని చెప్పారు.
తాము గతంలో ఉన్న టీడీపీ పార్టీతో బీజేపీ అంటకాగుతున్నదనీ, ఆ పార్టీతో ఆధారపడే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుందని అన్నారు. రాష్ట్ర గీతం లేనప్పుడు, రాష్ట్రం సంక్షిప్త పేరును టీఎస్‌గా మార్చినప్పుడు బీజేపీ సభ్యులు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. తమ ప్రభుత్వానికి ఏడాది నిండకముందే హామీలు ఏమయ్యాయంటూ నిలదీస్తున్న బీజేపీ సభ్యులు…పదేండ్ల కిందట ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామనీ, విదేశాల్లోని నల్లధనం రప్పించి ప్రజల బ్యాంకుల ఖాతాల్లో డబ్బులు వేస్తామన్న ప్రధాని మోడీ హామీల గురించి కూడా మాట్లాడాలని చురకలు అంటించారు.