అధికారుల నిర్వాకం..అవస్తలు పడుతున్న వాహనదారులు

– రెండు, మూడు రోజులైనా ఇసుక లోడింగ్ కాని వైనం
– ఇబ్బందులు పడుతున్న లారీ డ్రైవర్లు
నవతెలంగాణ – ముత్తారం
టీఎస్‌ఎండీసీ అధికారుల నిర్వాకంతో ఇటు లారీ డ్రైవర్లు, అటు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముత్తారం మండలంలోని ఓడేడు, ముత్తారం మానేరు వద్ద ఇసుక క్వారీలను నిర్వహిస్తున్నారు. అయితే రోజు రోజుకు ఇసుక డిమాండ్‌తో వందలాది బుకింగ్‌లు కావడం, ఆ మేర ఇసుకను తరలించేందుకు లోడింగ్ అనుకున్న సమయానికి జరగకపోవడంతో అటు లారీల డ్రైవర్లు, ఇటు వాహనదారులు అనేక అవస్తలు పడుతున్నారు. ఇసుక లోడింగ్ కు  చాలా సమయం పడుతుండటంతో లారీలు మండలంలోని రహాదారి వెంట కిలోమీటర్ల మేర నిలిచిపోయి ఉండే పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే లారీలు రహాదారి పక్కనే పార్కింగ్‌ చేసి ఉన్న కారణంగా వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురెదురుగా వాహనాలు వచ్చిన సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. ఒకవేళ ట్రాఫిక్‌ జామ్‌ అయితే రాకపోకలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే ఏం జరుగుతోందనని కూడా ఊహించలేని పరిస్థితులు ఇక్కడ నెలకొంటున్నాయి. ఇకనైనా టీఎస్‌ఎండీసీ అధికారులు క్వారీల వద్ద ఎన్ని లారీలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకొని, అంతమట్టుకే ఇసుక బుకింగ్‌లు స్వీకరించాలని, తద్వారా వాహనదారులు, లారీ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు.
Spread the love