ఉన్మాదులకు ఉద్యమాలే అడ్డుకట్ట

Movements are a barrier to maniacsఉన్మాదం చాలా భయం కరమైనది. ప్రమాదకరమైనది. ప్రాణాంతకమైనది. దాని అంతిమ ఫలితం మారణహోమం. మానవ హననం. చివరకది విచక్షణ లేని నరమేధానికి సైతం (జినోసైడ్‌) దారి తీయవచ్చు. అది యుద్ధోన్మాదం కావచ్చు. లేదా మతోన్మాదం కావచ్చు. అంతర్జాతీయంగా యుద్ధోన్మాదం ఇజ్రాయిల్‌ నేత బెంజిమన్‌ నెతన్యాహు రూపంలో నేడు తాజాగా బుసలు కొడ్తున్నది. గత ఎనిమిది నెలలుగా జరుపుతున్న ఆ నరమేధానికి అంతులేకుండా పోతున్నది. దాదాపు 35 వేల మందికి పైగా ప్రజానీకం ఈ యుద్ధదాడిలో నేలకొరిగారు. వారిలో 65శాతం మంది స్త్రీలు, చిన్నారులే. ప్రస్తుతం ఈ ఘోరకలిని నిరసిస్తూ అమెరికా, ఐరోపా, ఆసియాల్లోని 120పైకి విశ్వ విద్యాల యాల్లో గుడారాల ఉద్యమం నడుస్తున్నది. యువ విద్యార్థినీ లోకం ఎక్కడికక్కడ వందల వేల సంఖ్యల్లో తరగతులను బహిష్కరించి. హాస్టల్‌ గృహ వసతులను విడనాడి, ఆరుబయట టెంట్లు వేసుకుని యుద్ధ దాడులకు స్వస్తి చెప్పాలని, ప్రజల ప్రాణాలను, ప్రపంచశాంతిని కాపాడాలని దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నారు. ఈ పుడమిపై ఎక్కడైనా సరే మానవాళి రక్షణకు సంఘీభావం ప్రకటించడమే తమ ధ్యేయంగా ముందుకొస్తున్నారు. అంతేకాదు, ఇజ్రాయిల్‌ సంబంధం ఉన్న కంపెనీలలో పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని, ఆయా దేశాల పాలకవర్గాలపై ఒత్తిడి తెస్తున్నారు. వాటి లాభాలను మనం గనుక వాడుకుంటే, ఆ నెత్తురుకూడును మనం కూడా తింటున్నట్టే అని నిర్ద్వంద్వంగా వాదిస్తున్నారు. అందుకే ఈ ఉద్యమం అటు పాలకుల్నే కాదు ఇటు శాంతి ఉద్యమకారులనూ విస్తుపోయేటట్లు చేస్తున్నది. యుద్ధాలకు వ్యతిరేకంగా గతం నుండి మానవాళి చేస్తున్న ఉద్యమాలకు మా ఉద్యమం కొనసాగింపు మాత్రమేనంటూ, ఈ ఉన్మాద పాలకులకు ముకుతాడు వేయాలంటే మాకు ఇంతకన్నా గత్యంతరం లేకుండా పోయిందని ఆ విద్యార్థి ఉద్యమ నేతలు తెలుపుతున్నారు.
నరమేధాన్ని కోరుకునే ఈ జియోనిస్టులు పైకి రూపంలో మనుషుల్లా కనిపిస్తున్నా వారు అంతరంగంలో తీవ్ర విద్వేష ఉన్మాదంతో రగలిపో తుంటారు. అన్యమతస్థుల ఊచకోతను నిర్లజ్జగా సమర్థిస్తుంటారు. క్రూరమృగాలు ఎక్కడున్నా ఒక్కలానే వ్యవహరిస్తుంటాయి. హింసా రక్తపాతాలే వాటి వికృతక్రీడ. అలాగే పెట్టుబడిదారీ దేశాల్లోని ప్రతీఘాత మితవాద శక్తులు పైకి నవ నాగరిక లక్షణాలతో సూటూబూటూ వేష భాషలతో వ్యవహరిస్తున్నా అంతర్గతంగా వారి మార్కెట్‌ లాభాల వేటలో ఎంతకైనా తెగిస్తారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూనే ఉంటారు. వారి వ్యవహారశైలి కపటత్వానికే ఓ పరాకాష్ట. ఇక మన దేశంలో హిందూ మతోన్మాదులు సరేసరి. ఇస్లోమోఫోబియా (ముస్లింలపై మత విద్వేషం)తో విషం కక్కుతుంటారు. నిత్యం ఎన్నికల ప్రచారంలో ఆ లజ్జాకర రెచ్చకొట్టుడు వైఖరిని మనం గమనిస్తూనే ఉన్నాం. ఎన్నికల ఓట్లకోసం మత ఘర్షణలు రగులు కొల్పేందుకు ఎంత చేయాలో అంతా చేస్తూనే ఉన్నారు.క్షణక్షణం పిల్లిమొగ్గలు వేస్తూనే ఉన్నారు.
అయినా నాలుగు దశల పోలింగ్‌ ప్రశాంతంగా జరగడానికి కారణం మన భారత ప్రజానీకంలో బలంగా నాటుకుపోయిన ప్రజాస్వామ్య, మత సామరస్య వాతావరణమే కీలకమని చెప్పకతప్పదు. కంటికి రెప్పలా మనం దీనిని కాపాడుకోవాల్సిందే.
ఇలాంటి ఉన్మాదులంతా నేడు ఏకమై పాలస్తీనా స్వతంత్ర ఆకాంక్షకు, ఆ ప్రజల మానవ హక్కులకు విఘాతం కలిగిస్తున్నారు. వందేండ్ల పాలస్తీనా స్వతంత్ర పోరాటాన్ని అసలు గమనించడమే లేదు. గతేడాది అక్టోబరు 7న జరిగిన హమాస్‌ దాడిని ఓ సాకుగా ప్రపంచానికి చూపడానికి యత్ని స్తున్నారు. కేవలం దానిని ‘ఓ ఉగ్రవాద చర్యగా’ కుదించి తమ పబ్బం గడుపుకునేందుకు విఫలయత్నం చేస్తున్నారు. పాలస్తీనా ప్రజల (అరబ్బుల) ఘటనను ఇస్లామిక్‌ టెర్రరిస్టు బూచిగా చూపేందుకు, ఐక్యరాజ్య సమితి న్యాయ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కుతున్నారు. అయితే ఇలా చేయడం అమెరికా – ఇజ్రాయిల్‌ పాలకవర్గాలకు కొత్తేమీ కాదు. 1950 నుండి వారావిధంగా పాలస్తీనాకు వ్యతిరేకంగా మారణా యుధాలతో పాటు దుష్ప్రచారాస్త్రాలనూ సమకూర్చు కుంటున్నారు. అందుకు అవసరమయ్యే అర్థబలం అంగబలం గల ఉన్మాదుల లాబీను ఎప్పటికప్పుడు సృష్టించుకుంటూనే ఉంటారు.
ఇదే విషయాన్ని తెలియజేస్తూ 2006లో ‘ది ఇజ్రాయిల్‌ లాబీ’ అనే పుస్తకం కూడా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా యూదు యువతను సైన్యంలోకి ఆహ్వానిస్తూ తమ శిక్షణలో భాగంగా ఈ మతోన్మాద జాత్యాహంకారాన్ని నూరిపోస్తారు. పిల్లలకు పాఠశాలలు స్థాపించి చిన్నప్పటి నుండి వారికి అదే ఉన్మాద శిక్షణనిస్తారు. అందుకు అసంబద్ద పురాణవాదనలను ముందు పెడతారు. పాలస్తీనా భూ భాగంపై ఇజ్రాయిల్‌ యూదులకు తప్ప అరబ్బులకు ఎలాంటి స్థానం లేదంటూ విషబీజాలు నాటుతారు.
చివరకు అరబ్బులు పాలస్తీనాను విడిచిపెట్టి వెళ్లడమే శ్రేయస్కరం అంటూ వారి మీడియా సన్నాయి నొక్కులతో కోడై కూస్తోంది. తరతరాలుగా జీవిస్తున్న వారి సొంతగడ్డపై వారు నిలబడటం కూడా పాపమనే రీతిలో ఓ కుట్రపూరిత భావాన్ని మనస్సుల్లోకి చొప్పిస్తారు.
పైగా నెతన్యాహుతో సహాల యూదు రాజ్య భావనను తలకెక్కించుకున్న ఉన్మాదులు నరమేధం (జినోసైడ్‌) చేసే హక్కు, అధికారం తమ సొంతం అన్నట్టు, పరులెవ్వరూ ఆత్మరక్షణలో భాగంగా ప్రతి దాడులు చేసినా అది నేరంగానే బలంగా నమ్ముతుంటారు.
అందుకే నెతన్యాహును హిట్లర్‌ను పోలిన నరహంతకునిగా టర్కీ అధ్యక్షుడు ఎర్గోదిన్‌ విమర్శిస్తున్నాడు. కొలంబియా వామపక్ష నేత గుస్రావ్‌ పెట్రో అయితే ‘చరిత్ర నిన్ను నరహంతకుడిగానే చూస్తుందని’ నెతన్యాహును డైరెక్టుగానే హెచ్చరిస్తున్నాడు. ‘బాంబులేసి వేలాది మంది అమాయక ప్రజలను బలికొనడం హీరోయిజం అనుకుంటున్నావా? నీకు ఫాసిస్టు హిట్లర్‌కు ఏమీ తేడాలేదు. పాలస్తీనా దేశాన్ని మొత్తం తుడిచిపెట్టేందుకు ఫాసిస్టులు ప్రయత్నిస్తుంటే మానవత్వం గలవారు చేష్టలుడిగి ఎలా కూర్చోగలరు?’ అంటూ ఘాటుగా స్పందించాడు. కనుకనే మేం ఇజ్రాయిల్‌తో పూర్తి దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నట్టు మేడే నాడు విస్పష్టంగా ప్రకటించాడు. అంతకు ముందే బొలివియా ఇదే పనిచేసింది. హౌండూరస్‌, బెలిజ్‌, మరికొన్ని చిన్నదేశాలు ఈ బాటనే ఎంచుకున్నాయి. ఇజ్రాయిల్‌కు సహకరించేది లేదని ఈజిప్టు తెగేసి చెప్పింది. ఒక వైపు శాంతి యత్నాలు జరుగుతూ ఉంటే, మరోవైపు గాజా సరిహద్దు రఫాపై ఇజ్రాయిల్‌ యుద్ధదాడులు జరపడం ఏరకమైన యుద్ధనీతి అని ప్రశ్నించింది.
అణుబాంబుతోనైనా సరే ఇజ్రాయిల్‌కు బుద్ది చెప్పవలసివస్తే వెనుకాడేది లేదని ఇరాన్‌ అంటున్నది. ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పరిణామాలే విద్యార్థి ఉద్యమాలకు కొత్త ఊపిరులు ఊదుతున్నాయి. ఉన్మాదులకు ఉద్యమాలే ఎన్నటికైనా అడ్డుకట్ట వేస్తాయని చరిత్ర మరోసారి రుజువు చేస్తున్నది.

– కె.శాంతారావు
9959745723

Spread the love