కాంగ్రెస్‌ భిక్షమేసినట్లు రెండు హామీలు మాత్రమే ఇచ్చారు: ఎంపీ బండి

– ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదు?
– అయోధ్యలో రామ మందిరం కట్టడం తప్పా?
నవతెలంగాణ – కోహెడ
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి బిక్షమేసినట్లు ప్రజలకు రెండు హామీలు మాత్రమే ఇచ్చారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ప్రజాహిత యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మోదీని ప్రధాని చేయకపోతే రామ మందిరం బాబ్రీ మసీదుగా మారే ప్రమాదముందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌లకు కండ కావరం ఎక్కువైందని, 24 గంటలు నన్ను తిట్టడమే వాళ్లు పనిగా పెట్టుకున్నారాన్నరు. ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేని దద్దమ్మలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం నేనేం చేశానో చెప్పడానికే యాత్ర చేస్తున్నానన్నారు. కరీంనగర్‌ నుండి వరంగల్‌, కరీంనగర్‌ నుండి జగిత్యాల వరకు రోడ్డు విస్తరణకు నిధులు శాతవాహన వర్శిటీకి 12 బి, ఎస్సారార్‌ కాలేజీకి అటానమస్‌ హోదా తెచ్చానని, కాంగ్రెస్‌ పాలనలో పొన్నం ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారో ప్రజలకు సమాధానమివ్వాలని ప్రశ్నించారు. పీఎం సడక్‌ యోజన కింద గూండారెడ్డిపల్లి నుండి ముత్తన్నపల్లి వరకు 3 కోట్ల 74 లక్షలతో బీటీ రోడ్డు, గుండారెడ్డిపల్లి బస్వాపూర్‌ వరకు రోడ్డు కోసం 3 కోట్లకుపై నిధులిచ్చామన్నారు. గ్రామీణ సడక్‌ యోజన కింద 7 కోట్లకుపైగా నిధులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద ఇటీవల పార్లమెంట్‌ పరిధిలో రూ.28 కోట్లు ఖర్చు చేశామని సిద్ధిపేట నుండి ఎల్కతుర్తి వరకు జాతీయ రహదారి నిర్మాణం కోసం రూ.578 కోట్లు ఖర్చు చేశామన్నారు. నేను చెప్పిన లెక్కలన్నీ తప్పయితే నాపై కేసు పెట్టొచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో బీజెపీ నియోజకవర్గ ఇంచార్జ్‌ బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి, సీనియర్‌ నాయకులు కోమటిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కరీంనగర్‌ పార్లమెంటరీ నియోజకవర్గం ప్రతినిధి కళ్యాణ్‌, మండల పార్టీ అధ్యక్షులు ఖమ్మం వెంకటేశం, పిల్లి నర్సయ్య, గుగ్గిళ్ళ శ్రీనివాస్‌, కొండబత్తిని సతీష్‌, బొమ్మగాని శివకుమార్‌, వెంకటేష్‌, ఎం. రజినీకాంత్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, పేర్యాల సాగర్‌రావు, ఖమ్మం రమేష్‌, గాజుల వెంకటేశ్వర్లు, శ్రీకాంత్‌, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love