నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ గ్రామ పెద్ద చెరువు గట్టు, కట్టను మండల ఎంపీఓ రాము గురువారం పరిశీలించారు. గత నాలుగు రోజులుగా మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మోస్తరు వర్షాల నేపథ్యంలో చెరువులో నీటిమట్టం, గట్టు పరిస్థితిని స్థానికులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీఓ రాము మాట్లాడుతూ, జూన్ నెల నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారని, అయితే ఇటీవల నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయని తెలిపారు. రైతులు ఇప్పటికే వివిధ రకాల పంటలను సాగు చేయగా, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు ఎంతో ఉపయోగకరంగా మారాయని పేర్కొన్నారు.
వర్షాల నేపథ్యంలో మండలంలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, నదుల్లో నీటి మట్టాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఖండేబల్లూర్ గ్రామ పెద్ద చెరువును సందర్శించి, నీటిమట్టం, గట్టు భద్రతను పరిశీలించినట్లు చెప్పారు. ఎలాంటి ప్రమాద పరిస్థితులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ తులసీరాం, గ్రామపంచాయతీ కార్యదర్శి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



