నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డిలో నిర్వహించిన 6వ జిల్లా స్థాయి యోగాసన చాంపియన్‌షిప్ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి, అనంతరం యోగాసన పోటీలను తిలకించి, క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. యోగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, క్రమశిక్షణను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
చిన్నారులు, యువత ప్రతిరోజూ యోగా సాధన చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కూడా విజయాలు సాధించి కామారెడ్డి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యోగా, క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యోగా నిర్వాహకులు రాంరెడ్డి, కౌన్సిలర్ సత్యం, జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేష్ గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు, సీనియర్ యోగా సభ్యులు అంజయ్య గుప్తా, అఖిల్, శిక్షకులు, క్రీడాకారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



