Friday, June 12, 2026
E-PAPER
Homeజాతీయంసహకార సమాఖ్యవాద స్ఫూర్తితో 
దేశాభివృద్ధి

సహకార సమాఖ్యవాద స్ఫూర్తితో 
దేశాభివృద్ధి

- Advertisement -

కేంద్ర, రాష్ట్రాల సమిష్టి కృషే కీలకం
రాష్ట్రాల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం మార్గ‌ద‌ర్శ‌కంగా ఉండాలి :
నిటి ఆయోగ్ 11వ పాల‌క మండ‌లి భేటీలో ప్ర‌ధాని మోడీ

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, చ‌ర్చ‌లు, ఇచ్చిపుచ్చుకోవ‌డం మార్గదర్శకంగా ఉండాలని ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. విక‌సిత్ భారత్ దార్శనికత దిశగా రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకోవడానికి, కలిసి పనిచేయడానికి వీలు కల్పించే ఒక సహకార వేదికగా నిటి ఆయోగ్ కీలక పాత్ర పోషించగలదని తెలిపారు. గురువారం నాడిక్క‌డ రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ప్ర‌ధాని అధ్య‌క్ష‌త‌న‌ నిటి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రులు ఎ.రేవంత్‌‌రెడ్డి, ఎన్‌.చంద్ర‌బాబు నాయుడుతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య‌మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ఎక్స్-అఫీషియో సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్రమంత్రులు, నిటి ఆయోగ్ వైస్ చైర్మెన్, సభ్యులు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పాల్గొన్నారు. ‘2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం అందరికీ సమ్మిళిత అభివృద్ధి ఫలాలు’ను ఈ సంవత్సరం ఇతివృత్తంగా ఎంపిక చేశారు.
​దేశంలో ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట, గ‌ణ‌నీయ‌మైన‌ ఫలితాలను అందించడానికి అవలంభించాల్సిన విధానంపై పాలక మండలి సమావేశంలో చ‌ర్చించారు. అలాగే సమ్మిళిత మానవాభివృద్ధి ప్రాథమిక ప్రణాళిక పైనా చర్చలు జరిపారు. ‘

‘1. మూలాధార మానవ పెట్టుబడి, రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని సన్నద్ధంగా ఉండే నైపుణ్యాలు. 2. ఉత్పాదక ఉపాధికల్పన, ఔత్సాహిక పారిశ్రామికత్వం, వికేంద్రీకరించిన అభివృద్ధి. 3. ఆరోగ్యం, పోషణ, సంక్షేమం. 4. అందరికీ సమాన అవకాశాలు, ఆత్మగౌరవం’’ వంటి నాలుగు ముఖ్యాంశాల ఆధారంగా చర్చలు నిర్వహించారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఔత్సాహిక పారిశ్రామికత్వాన్ని, నైపుణ్యాల సాధనను ప్రోత్సహించడంతో పాటు దీర్ఘకాలం పాటు మనుగడలో ఉండే ఉద్యోగావకాశాలను కల్పించడానికి ఏయే చర్యలు తీసుకోవాలన్నదాని గురించి కూడా చర్చించారు. పాలన, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), భాగస్వామ్యాలు, డేటా ఆధారిత వ్యవస్థలు సహా ప్రధాన సహాయకారి అంశాలను వినియోగించుకుంటూ ఒక కార్యాచరణ నమూనాను రూపొందించడంపై దృష్టి సారించారు. సమ్మిళిత మానవ అభివృద్ధిపై జాతీయ దృష్టికోణానికి, రాష్ట్రాల దృష్టికోణాలకు మధ్య పొందికను సమకూర్చడంపై చర్చలు జరిపారు. ఫలితంగా సమాన, దీర్ఘకాలిక అభివృద్ధి దిశగా ఏకీకృత, సహకార ప్రధాన విధానాన్ని అమలు చేయడానికి మార్గం సుగమం అవుతుందని చర్చల్లో వివరించారు.

​నిటి ఆయోగ్ పాలక మండలి 2025 డిసెంబరు 26 నుంచి 28 మధ్య నిర్వహించిన ముఖ్య కార్యదర్శుల 5వ జాతీయ సమావేశం సిఫారసులు ‘‘1. బాల్యంలో ముందస్తు విద్యాబోధన: పునాదిని వేయడం. 2. పాఠశాల విద్యాబోధన: మూలాధారంగా నిలిచే నిర్మాణం. 3. నైపుణ్యాలను నేర్పించడం: భవిష్యత్తు అవసరాల కోసం సన్నద్ధులై ఉండే శ్రమ శక్తి. 4. ఉన్నత విద్యాబోధన: జ్ఞానాధారిత ఆర్థికవ్యవస్థను ఏర్పాటు చేయడం. 5. క్రీడలు, పాఠ్యాంశేతర కార్యకలాపాలు: తరగతి గదులకు ఆవల సన్నాహక చర్యలు’’పై కూడా ఈ సమావేశంలో చర్చించారు.

​సహకార సమాఖ్యవాద స్ఫూర్తితో దేశ అభివృద్ధి : మోడీ
ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ మాట్లాడు తూ.. అభివృద్ధి చెందిన దేశం అనే ఉమ్మడి లక్ష్యాన్ని సాకారం చేసుకోవడంలో కేంద్ర, రాష్ట్రాల సమిష్టి కృషి కీలక పాత్ర పోషిస్తుందని నొక్కి చెప్పారు. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చితి, అస్థిరతతో కూడిన కాలం గుండా వెళ్తున్నప్పటికీ.. భారత్‌ ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో తన వృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. సహకార సమాఖ్యవాద స్ఫూర్తితో, దేశ అభివృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి మనం కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. వృద్ధి, ఎగుమతులకు కొత్త అవకాశాలను సృష్టించేం దుకు భారత్‌ అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని ఆయ‌న‌ నొక్కి చెప్పారు. ఈ ఒప్పందాలు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందిస్తున్నాయ‌ని తెలిపారు. దేశ జనాభా డివిడెండ్‌ను దేశం కోల్పోలేని ఒక చారిత్రాత్మక అవకాశంగా ప్రధాని మోడీ అభివర్ణించారు. నాణ్య మైన విద్య, డిమాండ్‌కు అనుగుణమైన నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలతో యువత కోసం సరైన వ్యవస్థను సృష్టించాలని ఆయన పిలుపునిచ్చారు. వికసిత్‌ భారత్ దార్శనికతకు మహిళా నేతృత్వంలోని అభివృద్ధి ఒక మూలస్తంభమని గుర్తించారు. వ్యవసాయం, స్టార్టప్‌ల నుంచి సైన్స్, ఆవిష్కరణల వరకు నారీ శక్తి వివిధ రంగాలలో తన వంతు కృషి చేస్తోందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -