16న దేశ వ్యాప్త సమ్మె : సీఐటీయూ

నవతెలంగాణ – అశ్వారావుపేట

దేశం కోసం శ్రమిస్తున్న సంపద సృష్టి కర్తలైన కార్మికుల,శ్రామికుల బ్రతుకుల పై మోడీ ప్రభుత్వం తీవ్రమైన దాడి చేస్తుంది అని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకు కర్షకులు,కార్మికులు ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. బుదవారం స్థానిక సుందరయ్య భవన్ లో ఆ సంఘం మండల విస్తృత సమావేశం వెంకటప్పయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పదేళ్లలో ప్రజల సమస్యలు వేటిని పరిష్కరించకుండా మత ఉద్వేగాలు రెచ్చగొడుతూ ప్రభుత్వ రంగాన్ని,దేశ సంపదను ఆదా ని లాంటి పారిశ్రామికవేత్తలకు దోచి పెడుతుందని అన్నారు.కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను అమలు చేయకుండా కార్పొరేట్ల కు కార్మికులను బలి పెట్టేందుకు నాలుగు లేబర్ కోడ్ లు తెచ్చిందని, కార్మికుల 8 గంటల పని విధానం స్థానంలో 12 గంటలకు పెంచడం పిఎఫ్ ఈఎస్ఐ కనీస వేతనం లేకుండా చేసిందని అన్నారు.మోడీ పాలన వల్ల ప్రజల కొనుగోలు శక్తి రోజు రోజుకు పడిపోతున్న పరిస్థితిలో ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపిందన్నారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక కర్షకులు ఐక్యమై పోరాటానికి సిద్ధమవుతున్నారని ఫిబ్రవరి 16న జరిగే సమ్మెలో ప్రజలంతా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ నరసింహారావు,రామకృష్ణ అప్పన్న, భారతి ముత్తారావు,మహేష్ , నందు తిరుపతమ్మ,భూదేవమ్మ తదితరులు పాల్గొన్నారు.
Spread the love