రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో నయా కిడ్నాపర్స్‌

– ప్లాట్స్‌ అమ్ముతామంటూ మహిళల వాయిస్‌తో ఫోన్‌ కాల్స్‌
– రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నారాయణ కిడ్నాప్‌, అనంతరం విడిచిపెట్టిన దుండగులు
నవతెలంగాణ-ఆదిభట్ల
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో నయా కిడ్నాపర్స్‌ హల్‌చల్‌ చేస్తున్నారు. ప్లాట్స్‌ అమ్ముతామంటూ లేడీస్‌ వాయిస్‌ కాల్స్‌లో పలువురికి ఫోన్లు చేసి ప్లాట్స్‌ ఉన్నవి అమ్మి పెట్టమంటూ మాటలు కలుపుతూ వ్యాపారులను కిడ్నాప్‌ చేస్తున్నారు. ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం జరిగింది. సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం పట్టణం బోయవాడకు చెందిన నారాయణకు గుర్తు తెలియని వ్యక్తులు వారం రోజులుగా ఫోన్‌ కాల్‌ చేస్తూ తమకు ప్లాట్స్‌ ఉన్నవి అమ్మి పెట్టమని ఆడుగుతున్నారు. నారాయణ సరే అనడటంతో బొంగుళూర్‌ గేట్‌ సమీపంలోని మెట్రో సిటీ వెంచర్‌కి ఆదివారం పిలిపించుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న నలుగురు అగంతకులు నారాయణ కండ్లకు గంతలు కట్టి, గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. నారాయణ తలకు గన్‌ గురిపెట్టి కోటీ రూపాయలు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా బెదిరిపోయిన నారాయణ భయంతో వణుకుతూ డబ్బులు లేవని చెప్పడంతో పది ఖాళీ పేపర్స్‌ మీద సంతకాలు చేయించుకున్నారు. అనంతరం ఓఆర్‌ఆర్‌పై నారాయణతోపాటు అతని డ్రైవర్‌ను వదిలిపెట్టిన ఆగంతకులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితుడు నారాయణ ఆదిభట్ల పీఎస్‌లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

Spread the love