పారదర్శకత ఏదీ?

Any transparency?– ఎన్నికల సంఘాన్ని తన అదుపులో ఉంచడమే లక్ష్యం
– ఎలక్ట్రోరల్‌ బాండ్‌ ఎన్నికల కుంభకోణం: సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీి జాన్‌ బ్రిట్టాస్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పని చేయాల్సిన ఎన్నికల సంఘాన్ని పూర్తిగా మోడీ ప్రభుత్వం లొంగదీసుకునేలా చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, కమిషనర్ల నియామక బిల్లు ఉన్నదని సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ విమర్శించారు. రాజ్యసభలో మంగళవారం బిల్లుపై జరిగిన చర్చలో సీపీఐ(ఎం) తరఫున మాట్లాడారు. ఈ బిల్లు సుప్రీంకోర్టులోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలను రద్దు చేయడానికి, ఎన్నికల కమిషన్‌ను నియంత్రణలో ఉంచడానికి ఉద్దేశించబడిందని విమర్శించారు. కాశ్మీర్‌ తీర్పు తరువాత, ప్రభుత్వం సుప్రీంకోర్టును ప్రశంసించిందని, మరుసటి రోజు అదే కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తోందని దుయ్యబట్టారు. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వు ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయత, నిష్పాక్షికత, స్వతంత్రతను నిర్ధారించే లక్ష్యంతో ఉందన్నారు. ప్రభుత్వం దానిని తారుమారు చేస్తోందని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్‌కు ప్రత్యేక కార్యాలయం అవసరమా? దాన్ని మూసేసి న్యాయ మంత్రిత్వ శాఖలో పెడితే సరిపోతుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘాన్ని మరో ప్రభుత్వ శాఖగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలను సృష్టిస్తుందని హెచ్చరించారు. దేశంలో ఎన్నికల రంగం ప్రస్తుతం డబ్బు, అధికారంతో నియంత్రించబడుతున్నదని విమర్శించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు రూ.60 వేల కోట్ల ఖర్చు చేశాయని, ఇందులో సింహభాగం బీజేపీ ఖర్చు చేసిందని అన్నారు. 2024లో ఇది చాలా రెట్లు పెరుగుతుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్ట్రోరల్‌ బాండ్‌ నిజానికి ఎన్నికల కుంభకోణమని, పారదర్శకంగా లేదని బ్రిట్టాస్‌ అన్నారు.

Spread the love