నేటి నుంచి బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు

– హాజరుకానున్న కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు
– మొదటిరోజే నామినేషన్లు వేయనున్న డీకే అరుణ, ఈటల, రఘునందన్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థులు నేటి నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. తొలిరోజు మల్కాజిగిరి స్థానం నుంచి ఈటల రాజేందర్‌, మెదక్‌ నుంచి రఘునందన్‌రావు, మహబూబ్‌నగర్‌ నుంచి డీకే అరుణ నామినేషన్లు వేయనున్నారు. మహబూబ్‌ నగర్‌లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, మెదక్‌లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి, మల్కాజిగిరిలో కేంద్ర మంత్రి హరిదీప్‌సింగ్‌ పూరీ ముఖ్యఅతిథులు పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం సికింద్రాబాద్‌, సిక్‌ విలేజ్‌ లో జువెల్‌ గార్డెన్లో మాజీ సైనికులతో జరిగే సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ హాజరవుతారని తెలిపారు. 19న సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్‌కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నండగా ఆ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా రాజ్‌నాథ్‌సింగ్‌ హాజరుకానున్నారు. 22న జహీరాబాద్‌ నుంచి బీబీపాటిల్‌, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, నల్లగొండ నుంచి సైదిరెడ్డి, మహబూబాబాద్‌ నుంచి సీతారాంనాయక్‌ నామినేషన్లు వేయనున్నారు. ఆ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, కేంద్ర మంత్రులు పీయూష్‌గోయల్‌, కిరణ్‌ రిజిజు పాల్గొననున్నారు. 23న బూర నర్సయ్య భువనగిరి పార్లమెంట్‌ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. 24న పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్‌, ఆదిలాబాద్‌ నుంచి గోడం నగేశ్‌, హైదరాబాద్‌ నుంచి మాధవీలత, వరంగల్‌ నుంచి ఆరూరి రమేశ్‌ నామినేషన్లు వేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, అనురాగ్‌ ఠాకూర్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం శ్రీవిష్ణు దేవుసాయి పాల్గొంటారు. 25న కరీంనగర్‌ నుంచి బండి సంజరు నామినేషన్‌ వేయనుండగా ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుజరాత్‌ సీఎం భూపేంద్ర పాటిల్‌, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. నిజామాబాద్‌ నుంచి ధర్మపురి అర్వింద్‌, నాగర్‌ కర్నూల్‌ నుంచి పోతుగంటి భరత్‌ నామినేన్లు దాఖలు చేయనుండగా ఆ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, గుజరాత్‌ సీఎం భూపేంద్ర పాటిల్‌, కిషన్‌రెడ్డి పాల్గొంటారు.

Spread the love