అబల కాదు..సబల

Not weak..strongఎందులో తక్కువని తోచేయాలి
దేనిలో రాణించలేదని మరచిపోవాలి
అమ్మగా సృష్టికి లాలపోసి పెంచావు
మహాశక్తిగా లోకాన్ని పరిపాలించావు
కరుణామూర్తిగా ప్రేమను పంచావు
సహనానికి మారుపేరై నిలబడ్డావు

గుణంలో మేటితనానికి ఆజ్యమైనావు
సుగుణంలో తరతరాలకు వెలుగైనావు
అంతరిక్షాన్ని సైతం అధిరోహించావు
కళారత్నమై కూచిపూడి నాట్యమైనావు
స్వరవాణిలో సరస్వతి పలుకైనావు
ఆలిగా తోడుగా నీడలా అడుగులేసావు
పురిటి నొప్పుల్ని పుణీతంలా భరించావు

కూతురిలా మమకారమై పూసావు
కోడలిగా నట్టింటిని పావనం చేసావు
పైలెట్‌లా మారి ఆకాశాన్ని చుట్టేసావు
యుద్ధభూమిలో శత్రువుల్ని జయించావు
సేవలో మానవత్వాన్ని బతికించావు
రాజ్యాధికార అధిపతివై రాణివైనావు
వీరమాతగా కీర్తికి కిరీటం తొడిగినావు

కవుల చేతి కలంలో వర్ణనై వికసించావు
క్రీడల్లో ఖండాలను దాటెళ్లిపోయావు
కర్షక లోకంలో మహిళా రైతువైనావు
సాంకేతిక రంగాల్లో స్పూర్తివై నిలబడ్డావు
చేనేతల అల్లికల్లో వేకువ పొద్దయి పొడిచావు
పట్టు వస్త్రాల్లో పల్లెపట్టువైనావు
వాహనాలను బతుకు దారిలో నడిపావు

పరాశక్తిగా లోకాన్నే ఏలినావు
తిరుగులేని ప్రతిభకు మూలమైనావు
ఎదురులేని మనిషిగా ఎదిగిపోయావు
భూమి ఆకాశాలకు వారధివైనావు
త్రిలోకాలకు త్రికరణశుద్ధిగా మెలిగావు
నువ్వు అబలవి కాదు సబలవి
అన్నింటిలో మేటితనానికి ప్రతీకవి
(మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం)
– నరెద్దుల రాజారెడ్డి,
9666016636

Spread the love