నవ నాగరిక వీధులన్నీ నగంగానే కనిపిస్తాయి కానీ
వాటిలో నివసించే అవకాశవాదాల్ని అవలోకించి
ఇమడలేక ముక్కుసూటిగా ముందుకే దూసుకెళ్తాను
కాలానుగుణంగా ఆశయాలను మార్చుకోలేని అశక్తతతో
స్థితప్రజ్ఞుడనై నిరంతరం రాజీలేని పోరాటాన్ని సాగిస్తాను
అసూయా అత్యాశలు కొలువుదీరిన రంగస్థలంపై
ఎవరికీ చెందని గూటికోసం అన్వేషిస్తాను
రాత్రిపడ్డ పొగమంచును కొద్దికొద్దిగా విడదీస్తూ
తుషార బిందువులతో మెరిసే గడ్డిపరకలకు
మరింత హరిత వర్ణాన్ని అద్దాలని తలపోస్తాను
నేలమీద చెల్లాచెదురుగా వెదజల్లబడి రాలినట్లుండే
పగడపువ్వుల పరిమళాలను ఆఘ్రాణిస్తూ
వారసత్వ భవిష్యత్తుకై విశ్వాసాన్ని ప్రోదిచేస్తాను
బలవంతుల కుట్రలకు బలైన బాధితులకు
క్షితిజరేఖ వద్ద ఎదురుచూసే విధివంచితులకు
బాధ్యత గుర్తెరిగి బలమైన చేయూతనందిస్తాను
నా అంతస్సాక్షి కొలిమిలో కాలుతున్న అంతరాత్మను
ఒక ఆకతిగా మలచడానికి దహించుకుపోతుంటాను
వదరుబోతుతనంతో కేవల వ్యాసంగానికి కాక
లక్షోపలక్షల కార్యరూపాల్లోకి దాల్చాలని
చలికీ చీకటికీ నక్కుకోక ఓ దయామయీ!
నీకై నీవు స్వయంగావస్తే అక్కునచేర్చుకుంటాను
ప్రేయసీ ప్రేయసీ! పేదవాడను నేను
విసరవే నీ చూపులను విస్తారం చేసి!!
– కరిపె రాజ్ కుమార్, 8125144729