Saturday, September 12, 2026
E-PAPER
Homeకథఆ నలుగురు కాదు లోపల...!

ఆ నలుగురు కాదు లోపల…!

- Advertisement -

సూర్యుడుకి రాత్రి తాగిన మైకం ఇంకా దిగలేనట్టుంది. ఏడ ఏ మబ్బుల చాటున పొర్లాడుతుండో, ఏమో కాస్త కనిపించి కనిపించినట్లు దోబూచులాడుతున్నాడు. చీకటిలోనే అలా ఒంటికి కాస్త చల్లగాలి తగిలించుకుందామని, కాళ్లకు పని చెబుతూ ఊరు బయట కొత్తగా కట్టిన చెరువు కట్టమీద వచ్చి కులబడ్డాను.
గాలి లేదు, చెరువులో నీళ్లు లేవు, నీళ్ల మీద వాలే పిట్టలు, కొంగలు, పక్షులు ఏవీ లేవు. కొత్తగా కట్టిన చెరువు కట్ట అక్కడక్కడ బెచ్చులు బెచ్చులుగా పడిపోయిన సిమెంటు శకలాలు మాత్రం మౌనంగా, పాడెకు తయారు చేస్తున్న శవంలా పడి ఉన్నవి.
అదే కట్టమీద అక్కడక్కడ ఒక్కొక్కరు వయసు నిమురుకుంటూ, తమలో తాము ఏదో గునుకుంటూ కూర్చుండ్రు. వాళ్లను చూస్తుంటే హైదరాబాదు హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండి మీద విగ్రహాలల కనిపిస్తుండ్రు.
ఏదో ఉండబట్టలేక ఒక్కొక్కరి దగ్గరికి పోయి, కాస్త మాటల్ని తడిపాను. ఏముంది బొల్లునా నీళ్లు ఊట చిమ్ముతూ కళ్ళ నుంచి ధారయింది.
అతడు రిటైర్మెంట్ అయినా బడి హెడ్మాస్టర్.. పేరు బాలస్వామి. పదవి విరమణై మూడు సంవత్సరాలు అవుతుందట, పైసా పైసా కూడబెట్టుకున్న రిటైర్మెంట్ డబ్బులు దాదాపు 45 లక్షలకు పైగా రావాలట, కానీ ఇంతవరకు రాలేదు.
బిడ్డ పెళ్లికి అప్పు ఇచ్చిన ఆప్త మిత్రుడు శత్రువుగా చూడబట్టిండు, శత్రులాగే మాట్లాడుతుండు.
ఇంకా ఇద్దరూ మగ పిల్లలు, మా నాన్న రిటర్మెంట్ డబ్బులు మాకు ఇస్తాడు దానితో ఏమైనా చేసుకోవచ్చు అనే ఆశ.. ఇప్పుడు నిరాశతో కుట్టుమిడుతున్నారు.
వారికి పెద్ద పెద్ద చదువులు చదివించినా, ఉద్యోగాలు లేక నిరుద్యోగ జాబితాలో పేర్లు నమోదు చేసుకోక, చిన్నచిన్న కంపెనీల చుట్టూ తిరుగుతుండ్రు.
ఇప్పుడు పిల్లలు కూడా శత్రువుగా చూడబట్టిరీ, శత్రువుగానే మాట్లాడబట్టిరి.
‘ఏం చేద్దాం బాబు కోరి కోరి తెచ్చుకున్న సర్కార్ ఏమో, సర్కస్ ఆట చూపిస్తుంది. దివాలాదీసిన కంపెనీలా ఉంది. ఏం చేయాలో తోచడం లేదు బాబు’ పంటి బిగువుల దుఃఖాన్ని దిగమింపుకుంటూ చెప్పిండు.
మరో మనిషి కాడికి కాళ్లు కలిపాను.
ఏముంది అతడు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుండేవాడట, నారాయణ శెట్టి.. 50 ఏళ్లు వయసు దాటింటది, ‘ఏదో కాస్తలో కాస్త బతుకు సంసారాన్ని దొబ్బుడు బండిలా తోలుకుంటూ వచ్చానయ్యా ఇన్నాళ్లు. ఇప్పుడు సాత అయితే లేదు. పెద్ద పెద్ద వాళ్లు గుజరాత్, మహారాష్ట్ర నుంచి వచ్చి పెద్దపెద్ద వ్యాపారాలు చేయబట్టిరి, వారికి సర్కారు వారి అండ ఉండబట్టే.
ఏం చేద్దాం అయ్యా మా బ్రతుకులే మాకు శత్రువులాగా కనిపిస్తుంది. చావలేక బతకలేక అప్పుల బాధ భరించలేక, ఇలా కాస్త మనశ్శాంతికి పొద్దున ఈ చెరువు కట్ట కాడికి వచ్చి ఇలా కూల పడతానయ్యా’ చెప్పుకుంటూ వచ్చిండు.
మరో దగ్గరికి కాళ్లు తీసి అడుగేసాను.
ఆమె, శాంతాదేవి. 75 ఏళ్లు పైబడి ఉంటాయి.
భర్త యాక్సిడెంట్‌లో చనిపోయాడట. ఒక మగ పిల్లవాడు, ఆడపిల్ల. ఆడపిల్ల పెళ్లి చేసి పంపింది. పిల్లవాడేమో అమెరికాలో ఉంటున్నాడు. ఒక్కతే.. లంకలాంత ఇంట్లో బిక్కుబిక్కుమంటూ సీతమ్మ లాగే పడి ఉంది.
తనకు తానే శత్రువై బ్రతుకు తలపోసుకుంటూ ఒంటరిగా శత్రుత్వం వీచే గాలిలో ఉంది.
మరో అతడు రామన్న, ఐదుగురు కొడుకులు, నలుగురు బిడ్డలు. అందరికీ పెళ్లిళ్లు చేసిండు. ఉమ్మడి కుటుంబం పగిలి వారు కూడా శకలాల్లాగా వేరే వేరే ఉంటూ కాపురాలు చేసుకుంటూ ఉన్నారు. అందరికీ పిల్లలకు పిల్లలు కూడా అయిండ్రు, మనవళ్లతో మనవరాళ్లతో హాయిగా ఉండవలసిన రామన్న ఇప్పుడు 75 ఏళ్ల వృద్ధాప్యంలో.. ఇప్పుడో అప్పుడో అనే రీతిలో భార్య మంచం మీద.. ఆమెకు సేవలు చేసుకుంటూ తనకు తానే శత్రుత్వం అనే కాలంలోకి తొంగి చూస్తుండు.
ఊరిలోనే ఉన్నా ఏ ఒక్కొ కొడుకు వచ్చి పలకరించిన పాపాన పోలేదు. పైగా తల్లిని పట్టుకొని ముసలిది ఎప్పుడు చస్తుందో, ఇంకా పడి ఉంది శని లాగా అంటూ పుల్ల పుల్ల మాటలరాయి విసిగితుంటారు.
‘బాబు చావైనా రాకపోయే! చెరువులోనైనా పడి చస్తామంటే, నీళ్లు కూడా లేకపాయే, అది ఎడారి మొఖం వేసుకొని నాలాగే చూస్తుంది. ఇప్పుడు రోగగ్రస్తురాలైన నా భార్య కోసం ఇలా బ్రతుకుతున్న బాబు.’
అతని దుఃఖానికి ఏమో, మబ్బులు భయపడి వాన కురుస్తలేదు!
ఇలా అనేక అనేక లోపలి శకలాల శవాల కథలు. చెరువు కట్టమీద ఆ నలుగురి మూగ రోధనల విగ్రహాల కాలం విలపిస్తుంది.
సూర్యుడు తాగిన మైకం దిగినట్లుంది.
నీటుగా తయారై, సూటు బూటు వేసుకొని, లోకం మీద గుర్ఖా డ్యూటీ చేయడానికి వచ్చినట్లు ఉన్నాడు.
బరువైన గుండెతో తిరుగు ప్రయాణం ఇలా నేను!
జనజ్వాల, 9949163770

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -