కొన్ని కార్యకారణ సంబంధాలు ఎందుకు, ఎలా పరమ గందరగోళంగా ఉంటాయో ఎవరికీ తెలియదు. వీధిలో చెత్తను మునిసిపాలిటీ వాళ్లు ఎత్తుకుపోకపోవడానికి అంతకు ముందు రోజు రాత్రి అమెరికా అధ్యక్షుడూ, భారత దేశ ప్రధానమంత్రి హాట్‌లైన్‌లో తిట్టుకోవడం కారణం కావచ్చు. ఊయలలో పిల్లవాడి పిర్రమీద తల్లి ఒక్కటంటించడానికి ఇరాన్ ఇరాక్ యుద్ధం కారణమై ఉండొచ్చు. ఒక చీమ చక్కెర పలుకును మోసుకుపోతూ దారి మార్చడం వల్ల, ఎక్కడో ఒక ప్రభుత్వం కూలిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అట్లాంటిదే ఒక చిన్న సంఘటన దేశంలో కోట్లాదిమంది జీవితాలను గొలుసుకట్టు పరిణామాల్లోకి నెట్టేసింది.
—
ఆ దేశంలో ఆ చట్టం అమలులోకి రావడానికంటే మూడేళ్ల ముందు, ఒక వద్దుడు ఆ పట్టణానికి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఎందుకు వచ్చాడో ఎవరికీ తెలియదు. రైల్వే స్టేషన్ ఎదురుగా పనిచేయని పాత గడియార స్తంభం కింద కూర్చునేవాడు. ఆ గడియారం పదకొండు గంటల పదిహేడు నిమిషాల దగ్గర ఎప్పుడో ఆగిపోయింది. కానీ వద్దుడు వచ్చిన తర్వాత, అర్ధరాత్రిళ్లు దాని ముళ్లు వెనక్కి తిరుగుతున్నాయని కొందరు చెప్పుకునేవారు. అతని పేరు ఎవరికీ తెలియదు.
పిల్లలు ‘బూచోడు’ అనేవారు. పెద్దలు ‘కాలజ్ఞాని’ అన్నారు. అతడు నడిస్తే అడుగుల చప్పుడు వినిపించేది కాదు. కానీ అతడు నిలబడిన చోట నేల కొద్దిగా కంపించేది. అతడి దుస్తుల నుంచి పాత పుస్తకాల వాసన, ఎండిన మట్టి వాసన వచ్చేవి. అతడి ఎడమ కన్ను గతాన్ని, కుడి కన్ను భవిష్యత్తును చూస్తాయని జనం నమ్మారు.
అతడి దగ్గర ఒక చిన్న చెక్కపెట్టె ఉండేది. ఆ పెట్టెలో భూమి పత్రాలు, తుప్పుపట్టిన తాళాలు, విరిగిన కళ్లద్దాలు, చనిపోయినవారి వెంట్రుకలు, పాత ఇళ్ల గోడల నుంచి ఊడిన సున్నం ముక్కలు ఉండేవి. ఎవరైనా అతడి దగ్గరికి వచ్చి తమ తండ్రి గురించి గొప్పగా చెప్పుకుంటే, అతడు ఒకటే ప్రశ్న అడిగేవాడు.
”మీ తండ్రి మీకు ఏమిచ్చాడు?”
”మూడు ఎకరాలు.” ”రెండు అంతస్తుల ఇల్లు.” ”నాలుగు దుకాణాలు.” ”బంగారం.” ”నగదు.” రకరకాలుగా వచ్చిన సమాధానాలన్నీ విన్నాక అతడు పెట్టె తెరిచి చూపించేవాడు. లోపల ఖాళీ.
”అన్నీ చివరకు ఇక్కడికే వస్తాయి,” అనేవాడు ఆ ఖాళీని చూపిస్తూ.
అది హాస్యమో, శాపమో ఎవరికీ అర్థమయ్యేది కాదు.
ఒకసారి ఓ పంతులుగారు అతడ్ని అడిగాడు.
”నీకెంతమంది పిల్లలు ?”
వృద్దుడు నవ్వుతూ ”నాకున్నవాళ్లంతా నన్ను వారసత్వంగా పొందారు. నేను వాళ్లను కాదు.” అన్నాడు.
అర్థం కాక ఉపాధ్యాయుడు తల గోక్కున్నాడు
—
ఒక డిసెంబర్ రాత్రి, దేశ ప్రధానమంత్రి సచివాలయంలో ఒంటరిగా రహస్య ఫైళ్లు చూస్తున్నాడు. గదిలోపలి వెలుగు మెలమెల్లగా గడ్డకట్టిపోయింది. బల్బు వెలుగుతూనే ఉంది. కానీ ఆ కాంతి టేబుల్ మీద పడకుండా మధ్యలోనే విరిగిపోయింది. గోడలోంచి వద్దుడు నడుచుకుంటూ వచ్చాడు. అతడి చేతిలో తుప్పుపట్టిన తాళంచెవి. ప్రధానమంత్రి కొంత కంగారుగా అలర్ట్ అలారం నొక్కబోయాడు. బటన్ లోపలికి వెళ్లింది. బయటకు రాలేదు. ఏ చప్పుడూ రాలేదు.
”ఎవరు నువ్వు?” అన్నాడు ప్రధాని
వృద్దుడి పెదవులు కదల్లేదు. కానీ ప్రధానమంత్రికి చెవిలో ఏదో వినిపించింది.
”తలుపులు చేసినవాళ్లు తాళాలు కూడా చేస్తారు. కానీ కొన్ని తలుపులకు తాళాలు మనుషులే .” అన్నాడు వృద్దుడు.
అతడు తాళంచెవిని టేబుల్ మీద ఉంచాడు. ప్రధానమంత్రి దాన్ని తాకగానే గది మాయమై ఒక దృశ్యం ఆవిష్కృతమైంది. అతడి ముందు ఒక విశాలమైన మైదానం. అక్కడ లక్షలమంది పిల్లలు నిలబడి ఉన్నారు. ప్రతి పిల్లవాడి కాళ్లకు ఏదో ఒకటి గొలుసులతో కట్టి ఉంది. కొందరి కాళ్లకు పొలం, కొందరి కాళ్లకు ఫ్యాక్టరీ, కొందరి మెడకు బంగారం, కొందరి వీపుమీద బ్యాంకు ఖాతాలు. వాళ్లు ఎగరడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కాలి బంధాలు నేలను విడవనివ్వడం లేదు. ఇంకొంత దూరంలో ఇంకొందరు పిల్లలున్నారు. వాళ్ల కాళ్లకు ఏమీ కట్టిలేదు. కానీ వాళ్లకు రెక్కలే లేవు. తల్లిదండ్రులు సంపాదించలేదని కాదు. తల్లిదండ్రులే లేరని కాదు. వారికి పుట్టుకతోనే ఏ తాళం సరిపోలేదంతే. ప్రధానమంత్రిలో కొంత ఆందోళన కనిపించింది. వద్దుడి స్వరం మళ్లీ చెవుల్లో వినిపించింది.
”పిట్ట గూడు కడుతుంది. పిల్లలు ఎగిరిపోయాక ఆ పిట్ట గూటిని మోసుకుపోదు. మనిషి మాత్రమే చచ్చినా గూటిని పిల్లల కాళ్లకు కట్టేసి,
వాళ్లను ఎగరనీయకుండా చేస్తాడు.”
”అయితే ఏం చేయాలి?” ప్రధానమంత్రి అడిగాడు.
”గొలుసులు తెంచు.”
”దేశం మండిపడుతుంది.”
”గొలుసు తెగినప్పుడు శబ్దం తప్పదు.”
దృశ్యం మాయమైంది. వృద్దుడు లేడు. టేబుల్ మీద తాళంచెవి మాత్రం ఉంది. మళ్లీ ప్రధాని చెవిలో ఏదో వినిపించింది.
‘మనిషి మరణించిన తర్వాత అతని ఆస్తి సమాజానికి, సంక్షేమ నిధికి చెందుతుంది. వారసత్వ హక్కు రద్దు చేస్తున్నాం.’
ఆ డిసెంబర్ ఎనిమిది రాత్రి ఎనిమిది గంటలకు ప్రధానమంత్రి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
‘తండ్రి చనిపోతే కొడుకుకు ఆస్తి చెందదు. తల్లి చనిపోతే కూతురికి ఇల్లు చెందదు. ఎవరి సంపాదన వారితోనే ముగుస్తుంది. వారు మరణించిన తర్వాత ఆస్తి సామాజిక నిధిలోకి చేరుతుంది. పిల్లలకు తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు ఉండదు. ఎవరి భవిష్యత్తును వారే నిర్మించుకోవాలి’
దేశం శ్వాస ఆగిపోయింది. అదే శ్వాస ఆ తర్వాత అరవడం మొదలుపెట్టింది.
—
రాజారావు రెవెన్యూ అధికారి. లంచాలు మేయడంలో ఘనాపాఠి. ప్రతి అక్రమ సంతకానికి ఒక గోడ కట్టించాడు. ప్రతి ఆక్రమిత స్థలానికి ఒక గది వేసుకున్నాడు. అతని ఇంట్లో ఇరవై ఏడు గదులు ఉన్నాయి. చట్టం వచ్చిన రాత్రి అతడు గోడల్లో దాచిన నోట్ల కట్టలను బయటకు తీశాడు. అవి కొడుకుకు చెందవు. ప్రభుత్వానికి అప్పగిస్తే జైలు. కాల్చేస్తే బూడిద. పెరట్లో ఒక ఇనుప బిందెలో నోట్లను కుక్కి అగ్గిపుల్ల వెలిగించబోతుండగా, గాలి లేకపోయినా నోట్లు ఒక్కసారిగా ఎగిరాయి. అవి సీతాకోకచిలుకలుగా మారాయి. ప్రతి సీతాకోకచిలుక రెక్క మీద ఒక ముఖం కనిపించింది. తన భూమి రికార్డు కోసం భార్య మంగళసూత్రం అమ్ముకున్న రైతు ముఖం. పెన్షన్ కోసం ఆరు నెలలు తిరిగి చనిపోయిన వద్ధుడి ముఖం. ఇంటి అనుమతి కోసం అప్పు చేసి లంచం ఇచ్చిన కార్మికుడి ముఖం. రాజారావు కళ్లుమూసుకున్నాడు. నోట్ల రెపరెపల్లో పేర్లు వినిపించాయి. తేదీలు వినిపించాయి. తాను చెప్పిన అబద్ధాలు వినిపించాయి. ఆ రాత్రి అతడు ఒక్కో గది తాళం తెరిచాడు. ప్రతి గదిలో అతని తండ్రి నిలబడి ఉన్నాడు.
”నువ్వు ఎన్ని గదుల్లో ఒకేసారి చనిపోగలవు?” తండ్రి ప్రశ్న.
మరుసటి రోజు రాజారావు ఆఫీసుకు వెళ్లాడు. ఒక కాంట్రాక్టర్ కవర్ ముందుకు జరిపితే రాజారావు దాన్ని తాకనైనా లేదు.
”అంతా రూల్ ప్రకారమే జరుగుతుంది ,” అన్నాడు. ఆ మాట చెప్పగానే అతని ఇంట్లో ఒక గోడ కూలిపోయింది.
అదే రోజు సాయంత్రం, ఇరవై ఏడు గదుల ఇంట్లో మొదటిసారి గాలి ఒక చివర నుంచి మరో చివరికి ఏ ఆటంకం లేకుండా వీచింది.
—
పట్ణణం చివర మల్లయ్యకు యాభై ఎకరాల మామిడితోట ఉంది. చట్టం ప్రకారం తాను చనిపోయాక తోట ప్రభుత్వానికి వెళ్తుందని తెలిసిన రోజు, అతడు కూలీలను పిలిచాడు. ”ఒక్క చెట్టూ మిగలకూడదు,” అన్నాడు. ”ఎందుకయ్యా?” అని కొడుకు నిఖిల్ అడిగాడు. ”నా పిల్లలకు చెందనిది ఎవరికీ చెందకూడదు.” దూరంగా గడియార స్తంభం కింద ముసలివాడు కూర్చుని కనిపించాడు. ”ఈ భూమి నా తండ్రిది,” మల్లయ్య అరిచాడు.
”నీ తండ్రి వెళ్లేటప్పుడు తీసుకెళ్లలేదుగా.” వ్రుద్దుడు నవ్వాడు.
”ఇది నా కొడుకుదై ఉండాలి.”
”నీ కొడుకు ఈ తోటను ప్రేమిస్తే, అతడు దాని సంరక్షకుడు అవుతాడు. ప్రేమించకపోతే యజమాని అయినా పరాయి వాడే.”
మొదటి చెట్టు మీదకు మల్లయ్య తనే స్వయంగా గొడ్డలి ఎత్తాడు. అప్పుడు అతని నీడ శరీరం నుంచి విడిపోయింది. మెల్లగా వెళ్లి చెట్టును కౌగిలించుకుంది. మల్లయ్య చేతిలోంచి గొడ్డలి జారిపోయింది. నీడ చెట్టును పట్టుకుని ఏడుస్తోంది. ఆ ఏడుపు మనిషిదో, చెట్టుదో చెప్పలేకపోయారు. మల్లయ్య వెనక్కి తగ్గాడు. అక్కడే నేల మీద ఒక ఎండిన మామిడి ఆకు కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. తెలియకుండానే నాలుకకు తగిలించాడు. ఆ క్షణం అతనికి యాభై ఏళ్ల దాహం రుచి తెలిసింది. తాను నాటిన ప్రతి మొక్క వేసవిలో ఎలా తపించిందో, వర్షం పడిన రాత్రి వేర్లు ఎలా ఊపిరి తీసుకున్నాయో, ప్రతి పండు తనలో ఎంత వెలుతురు దాచుకుందో అతనికి వినిపించింది. మల్లయ్య చెట్టును తాకాడు. మొదటిసారి అది ఆస్తిలా కాకుండా, తనకంటే ఎక్కువకాలం ఆయువున్న జీవిలా అనిపించింది.
కూలీలను వెనక్కి పంపించాడు. కొన్నేళ్ల తర్వాత అదే తోట సామాజిక నిధికి చేరింది. అక్కడ పాఠశాల పిల్లల కోసం ఉద్యానవనం ఏర్పాటైంది.
ప్రవేశద్వారం దగ్గర ఒక చిన్న బోర్డు.
‘ఇక్కడ పండ్లు ఎవరివీ కావు. ఆకలివి.’
మల్లయ్య పేరు ఎక్కడా లేదు.
కానీ ప్రతి వేసవిలో మొదటి మామిడిపండు అతని పాత ఇంటి కిటికీ లోంచి ఇంట్లో పడేదని నిఖిల్ చెప్తుంటాడు.
—
చట్టం వచ్చినంత మాత్రాన మనుషులంతా మంచివాళ్లైపోలేదు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల దగ్గరకు రావడం మానేశారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ముఖాల్లో ప్రేమకంటే లెక్కలు వెతికారు. కుటుంబాల్లో పాత అబద్ధాలు బయటపడ్డాయి.
”నువ్వు నన్ను ప్రేమించావా? లేక నా ఇల్లు ప్రేమించావా?”
”మీరు నన్ను పెంచారా? లేక వద్ధాప్యంలో చూసుకునే పెట్టుబడిలా భావించారా?” దేశమంతా ఇలాంటి ప్రశ్నలతో నిండిపోయింది.
ఒక సాయంత్రం మల్లయ్య అనారోగ్యంతో మంచంలో ఉంటే నిఖిల్ కాళ్లు నొక్కుతున్నాడు.
”నాకు నీ ఆస్తి వద్దు నాన్నా,” అన్నాడు. ”నువ్వు కొంచెం ఎక్కువ రోజులు ఉంటే చాలు.”
మల్లయ్య నవ్వాలని ప్రయత్నించాడు. ”ఆస్తి లేదని ఇప్పుడలా అంటున్నావేమో.”
”చెట్టుకు పండ్లు పుడతాయి. కానీ చెట్టు చనిపోతే పండ్లు తిరిగి చెట్టులోకి వెళ్లవు ” అన్నాడు నిఖిల్ నవ్వుతూ.
నిఖిల్ కంటినుంచి ఒక కన్నీటి చుక్క జారింది. కానీ నేలపై పడలేదు. గాల్లోనే ఆగిపోయింది. గది మొత్తం పలుచని నీటి పొరతో నిండినట్టు అనిపించింది. తండ్రికొడుకులు నీటి అడుగున ఉన్నట్టుగా ఒకరి శ్వాస మరొకరికి వినిపించింది. కిటికీ బయట వద్దుడు నిలబడి ఉన్నాడు. అతడు వేలితో ఆ కన్నీటి చుక్కను తాకాడు. అది చిన్న స్పటికంలా మారి మల్లయ్య గుండె మీద పడింది. ఆ క్షణంలో మల్లయ్య తన కొడుకు మనసును విన్నాడు. అందులో పొలం లేదు. ఇల్లు లేదు. బ్యాంకు ఖాతా లేదు. బాల్యంలో తన భుజాలపై కూర్చున్న జ్ఞాపకం మాత్రమే ఉంది.
”నేను నీకు ఏమీ ఇవ్వలేకపోయాను,”మల్లయ్య అన్నాడు.
”ఇచ్చావు నాన్నా.”
”ఏమిచ్చాను?”
”నేను పడిపోతే లేపే చేతి జ్ఞాపకం. నేను సైకిల్ నడపడం, నా ఆత్మ విశ్వాసం.”
ఆ రాత్రి మల్లయ్య ప్రశాంతంగా నిద్రపోయాడు. ఉదయం లేవలేదు. నిఖిల్ తండ్రి చేతిని పట్టుకుని చాలా సేపు మౌనంగా కూర్చున్నాడు. బయట అధికారులు తోటను సామాజిక నిధికి బదిలీ చేసే పత్రాలు సిద్ధం చేస్తున్నారు. అతడు ఒక్క అభ్యంతరమూ చెప్పలేదు.
తండ్రి పాత చెప్పుల జతను మాత్రం తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చాడు.
—
ఇరవై సంవత్సరాలు గడిచాయి. పెళ్లిళ్లలో కట్నం తగ్గింది. ఆస్తి వివరాలు అడిగే బదులు, ”ఏం చేస్తారు?” అని అడగడం మొదలైంది. కొందరు పిల్లలు తల్లిదండ్రుల నీడ నుంచి బయటపడ్డారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలను తమ కొనసాగింపుగా కాకుండా, వేరే మనుషులుగా చూడటం నేర్చుకున్నారు. అవినీతి పూర్తిగా పోలేదు. కానీ దాని పాత జోరు తగ్గింది. ”పిల్లల కోసం” అని చెప్పుకునే సాకు లేకపోవడంతో కొందరి దాహం తన అసలు ముఖం చూపించింది. మరికొందరు మాత్రం ఇంకా కూడబెట్టారు. అలవాటుకు వారసత్వ చట్టాలు ఉండవు కదా. పాత ఇళ్లు మాత్రం రాత్రిళ్లు మూలుగుతూనే ఉండేవి. గాలి కిటికీల్లోంచి వెళ్లేటప్పుడు మనవళ్ల పేర్లు పలుకుతున్నట్టు వినిపించేది. ఆస్తి మనుషులను బద్ధకస్తులను చేస్తుందేమో, కానీ ఆస్తి లేకపోవడం మానవ సంబంధాల సహజ మమకారాన్ని కూడా ఒక వ్యాపారంగా మార్చే ప్రమాదం ఉంది. చట్టాలు వ్యవస్థను మారుస్తాయి కానీ, మానవ నైజంలో నిజాయితీ అనేది నెత్తురులోనే ఉండాలి.
—
ఒక చలికాలపు ఉదయం గడియార స్తంభం కింద వద్దుడు కనిపించలేదు. అతని చెక్కపెట్టె మాత్రమే ఉంది. జనం దాన్ని తెరిచారు. లోపల భూమి పత్రాలు లేవు. తాళాలు లేవు. సున్నం ముక్కలు లేవు. ఒక చిన్న అద్దం మాత్రమే ఉంది. దాని వెనుక ఇలా రాసి ఉంది. ‘మనుషులు తమ పిల్లలకు ఇళ్లు ఇవ్వాలని కోరుకుంటారు. కానీ ఇళ్లు ఎప్పుడూ మనుషులను వారసత్వంగా పొందాలని కోరుకుంటాయి.’
ఆ అద్దాన్ని పట్టణ గ్రంథాలయంలో ఉంచారు. కొన్నేళ్ల తర్వాత ఒక పిల్లవాడు దాని ఎదుట నిలబడ్డాడు.
”నాన్నా,” అన్నాడు, ” తాతయ్య మనకు ఏమిచ్చాడు?”
తండ్రి వెంటనే సమాధానం చెప్పలేదు. అద్దంలో తన ముఖం కనిపించలేదు. తండ్రి ముఖమా, తాత ముఖమా, గడియార స్తంభం కింద కూర్చున్న ముసలివాడి ముఖమా తెలియని ఒక ఛాయ కనిపించింది. తండ్రి ఆ పిల్లవాడి భుజంపై చేయి వేసి ”మన తాతయ్య మనకు ఆస్తి ఇవ్వలేదు బాబూ. ఇక్కడికి వచ్చి ఈ ప్రశ్న అడిగే మనసును ఇచ్చాడు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఒక తలుపు చూపించాడు.” అన్నాడు కొడుకును చూస్తూ. అప్పుడు అతనికి ఒక్కసారిగా అర్థమైంది. వారసత్వం పోయింది. కానీ ఒక కొత్త ప్రశ్న పుట్టింది. మనిషి తన పిల్లలకు ఆస్తి ఇవ్వాలా? లేక స్వతంత్రంగా బతికే ధైర్యం ఇవ్వాలా?
ఆ ప్రశ్నకు ప్రతి తరం తన సమాధానం రాస్తూనే ఉంటుంది. కిటికీ బయట పాత ఇల్లు నెమ్మదిగా ఊపిరి తీసుకుంది. ఆ ఊపిరిలో దుమ్ము ఉంది. తడి ఉంది. జ్ఞాపకం ఉంది. విడిపోలేని ఒక ప్రేమ ఉంది. తెగిపోవల్సిన ఒక గొలుసు ఉంది. అదే సమయంలో, ఇరవై ఏళ్లుగా ఆగిపోయిన గడియార స్తంభం ఉన్నట్టుండి మోగింది.
పదకొండు గంటల పదిహేడు నిమిషాల దగ్గర నిలిచిపోయిన ముళ్లు కదిలాయి. కాలం ఆగదు కదా. పిల్లలు మొదటిసారి తమ కాళ్లకు ఏ బరువూ లేకుండా ఎగరగలిగారు.
—
ప్రధాన మంత్రికి మెలకువ వచ్చింది. ఒకసారి కళ్లు నులుముకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఇంటర్ కంలో పిఏతో ఇవాళ అందరు అధికారులతో మంత్రిమండలితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయమని ఆదేశించాడు.
ప్రసేన్,
70133 58154



