‘నోరు ఒకటి అనుకుంటే నొసలు ఇంకోటి తలచినట్టు ఉంది నా బ్రతుకు. దేవుడు నారాతనే గిట్లెందుకు రాసిండు, నిన్నటిదాకా అన్నీ మంచిగనే ఉన్న బతుకు ఒక్కసారిగా కుప్పకూలిపాయే. ఇప్పుడు నా మొఖం నలుగురిలో నారాజాయే. ఇంటి పక్కోడు ఇగురం చెప్తాడనుకుంటే మెల్లమెల్లగా ఇల్లేగాదు.. చివరకు బతుకే లేకుండా జేసిండు. పోయినోళ్ళు మంచిగనే పోయిండ్లు, ఉన్నోళ్ళకు అప్పుల కుంపటి బెట్టిపోయిరి’ మనసులో గునుగుకుంట బావి మీదా బోళ్లను కుప్పేసింది భారతి.
గిదంతా కుర్చీల కూసున్న రాజేశ్వరమ్మ జూస్తనే వున్నది.
‘కోపం వుంటే మనుషుల మీద జూపియాలేగని గా కంచాలమీద జూపిత్తే ఏమస్తదే’ కోడలుతో మెల్లగనే అన్నది.
‘ఆ..ఆ..నీ మొగుడు నువ్వు సరిపడ తినేకాడికి తిని పక్కోని మాటలిని ఉన్న భూమి హారతి కర్పూరం జేస్తిరి. చదువుకున్నోళ్ళేగదా వాని మాటలెందుకిన్నట్టు, పేరోగంది ఊరొగందైనట్టు ముళ్ళె తిన్నోళ్ళు మంచిగనే వున్నరు, వాళ్ళు సిటీలో అంత్రాల మీద అంత్రాలు గడుతాంటే ఇల్లు లేక మనమేమో పిల్లికూనలెక్క తిరుగుడాయే’ మూతి తిప్పుతు అత్తదిక్కు చేయి జాపుతు రుసరుస మంది భారతి.
‘సై..స్.. అంతైపోయినంక ఒర్రుతేమత్తదే.. దేవుడు కండ్లు తెరవకపోతడా వానికి గిటువంటి గతి పట్టకపోతదా’ మబ్బు దిక్కు జూసుకుంటా అన్నది రాజేశ్వరమ్మ.
‘అయినా గుండ్రంగా తిరిగే భూమికి వాస్తు ఏంది, ఓ రోజు బాయి కూల్చాలన్నడు, తరువాత గోడలన్నడు. మల్లో రోజు ఇల్లన్నడు, పశువుల కొట్టమన్నడు, రేపు ఇంకేమంటడో. వాడు మనింటి మీద ప్రయోగంజేసి వానిల్లు చక్కదిద్దుకున్నడు. ఏం ఎరుకలేనోళ్ళను నమ్మిచ్చి మోసంజేసిండు’ భారతి గిర్ర గిర్ర గిన్నెలకు సబ్బురుద్దుకుంటా అన్నది.
‘నువ్ అన్నది నిజమే గని చెరువుల నీళ్లు చెరువెనుక బడ్డంక తిరిగస్తయా తీయరాదే’ నశెం ముక్కులకు ఎగదోసుకుంట అన్నది రాజేశ్వరమ్మ.
‘నీ పానానికి నువ్ సాలిచ్చుకుంటానవ్ గని నాకు పోరగాండ్ల చదువులుండే, ఎనుకటి సదువులా ఏమన్ననా, ఏ చదువుకు తోలిన లక్షలేనాయే’ బాధగా అన్నది భారతి.
‘చిన్నోడా.. అన్న ఎండలబడచ్చిండు నీళ్లు ఇయ్యరా’ అంది రాజేశ్వరమ్మ.
గద్దెమీద సొమ్మసిల్లినట్టు ఒరిగిండు పెద్దోడు.
‘ఇగో అన్నా’ కుండల నీళ్ళిచ్చి రోలు బండ మీద కూర్చున్నడు చిన్నోడు.
‘పోయిన పని ఏమైంది బిడ్డా!’ భారతి తడి చేయి కొంగు తుడుచుకుని దగ్గరకచ్చి అన్నది.
‘ఇంకేమైతది, నేనేం జేయను, తిరిగి తిరిగి కాళ్ళ చెప్పులరిగినరు గాని వాళ్ళకు కనికరం గల్గుతలేదు’ గట గట నీళ్ళు తాగుకుంటనే అన్నాడు పెద్దోడు.
‘ముసలోడు గీ భూమి మనదని చెప్పుకోడానికి గింత ఆధారం లేకుండజేసే, పక్కోడు మన భూమి వాని పేరు మీదెక్కిచ్చుకుని నాటకం ఆడబట్టే’ భారతి మామ చేసిన పనిని ఉద్దేశిస్తూ అన్నది.
‘అందుకే ఎనుకటి పెద్దోళ్ళు ఇంటి దాపున మంచోళ్ళుండాలనేటోళ్ళు, దిక్మెల్లోనికి దగ్గరోడని జాగిచ్చి సాయంజేస్తే ఎట్లజేసిండో జూసిండ్లా, అప్పుడే మా అత్త వద్దు మోర్రో అని మోత్తుకున్నది నా మొగుడు ఇంటేనా’ గతం ముచ్చట అన్నది రాజేశ్వరమ్మ.
‘తాత వాన్ని పక్కల బల్లేంజేసి పోయిండు, ముసలోడు మొత్తం వాన్నే నమ్మితే మనకు తెల్వకుండనే అగ్గువ, సగ్గువకు భూమంతా మంది పాలు జేయించిండు. జనం దష్టిల మనల్ని తెలివి తక్కువోల్లను జేసి వాడు దొరతీర్గ తిరగబట్టే’ చిన్నోడు నాయనమ్మ దిక్కు గుర్రుగా జూసుకుంటా అన్నాడు.
‘సారును కలిసినవా బిడ్డా!’ భారతి కొడుకు పక్కన కూర్చోని అడిగింది.
‘కలిసిన్నే ఇప్పటికి నాలుగైదు సార్ల అప్లికేషన్ బెడితిమి. ఆఫీసర్ గూడా చుట్టాల తీర్గనే, వచ్చినోడు డబ్బున్నోడా లేడా అనే జూస్తాండు. ఈ భూమ్మీద మనుషులంతా గిట్లున్నరేందే’ బాదగా అన్నాడు పెద్దోడు.
‘లోకమే గట్లున్నది దానికి నువ్ ఏంజేస్తవ్ – నేనేం జేస్త దుడ్డున్నోడిదే బర్రే అంటాండ్లు. మీరన్న జెర తెలివి గుదుర్చుకోండ్లి లేకుంటే ఈ సమాజం బతుకనీయది బిడ్డా’ కొడుకు భుజం మీద చేయేసి అన్నది భారతి.
‘నాయనమ్మ నీసందుగలనో, మైల్దాన్లనో మల్లోసారి ఎంకులాడుదామానే ముసలోడు శిస్థు గట్టిన చీటిలన్ని భద్రంగా దాచెటోడు, గట్లాంటిది వాని మాయలబడిపోయే’ దీర్ఘాలోచనలో పడి తల పట్టుకుంటూ అన్నాడు పెద్దోడు.
‘మరి చిన్నోళ్ళనో, నడిపోళ్ళనో ఓ సారి వాళ్ళిండ్లల్ల జూడమని గట్టిగా అడుగరాదు’ వినపడ్తదో లేదో అని దగ్గరకచ్చి చెవుల అన్నడు చిన్నోడు.
‘లేదురా అదంతా మన పక్కోడి బద్మాశిగిరే కాయిదం కత్పంతా వాడే మాయం జేసిండు, ముసలోని పైసో కొత్త గూడా వాడే మింగిండు, ఎప్పుడు ఏ కాగితం మీద సంతకం బెట్టిచ్చుకున్నడో తెల్వదాయే, ఇప్పుడు ఏమన్న ఊరు వానిపట్టున్నది గదా’ రెండు చేతులారుస్తు అంది రాజేశ్వరమ్మ.
‘అయితే ఆర్.డి.వో తోనో, కలెక్టర్ తోనో గావాలే లేకుంటే గంతే నటరా పట్నం నుంచి సంతోష్ మామ ఫోన్ జేసి చెప్పిండు’ భారతి ఇద్దరు కొడుకుల భుజాలపై చేయివేస్తూ అన్నది.
‘పోని అందరం కలెక్టర్ ఆఫీస్‌కు పోదామా అన్నా’ చిన్నోడు గరంగనే అన్నాడు.
‘దొంగ ముండా కొడుకు వాడు మన గండానికే బుట్టిండు, ఏ జన్మ రాతో వాడు మనెంబడి బడ్డడు పోరగాండ్లందరి బతుకు ఆగం జేసిండు, వాని వంశం పుట్టగతులు లేకుండా పోను’ కంటికి పుట్టేడు శోకాలు పెడుతూ అంది రాజేశ్వరమ్మ.
‘నువ్ ఏడవకే నాయనమ్మ, దేవుడు ఇయ్యాల గాకపోతే రేపన్న మనదిక్కు నిలబడకపోడా’ పెద్దోడు గద్దెమీది నుండి లేచి నాయనమ్మ దగ్గరకచ్చిమోకాళ్ళ మీద కూర్చుండి అన్నాడు.
‘దేవుడు బండరాయి రా.. వాడు ఎప్పటికి కరగడు. ఎందుకంటే నలుగురి కడుపుగొట్టెటోడు వాడికీ త్రునమో – ఫణమో పెడుతడన్న ఆశ, ఉన్నోళ్ళు వాళ్ళ పాపాలు కడుకోనుగా దేవునికి కిరీటాలు, హారాలు తొడుగుతరు గదా గందుకే వాడు వాళ్ళనే జూస్తడ్రా మనవడా! లేనోళ్ళను ఆ దేవుడే గాదు ఎవ్వలు జూడరు రా..’ మనవడిని దగ్గరికి తీసుకుని తల నిమురుతు అంది.
‘భూమి కోసం మనుషులు ఇంత దిగజారుతారా అమ్మా….?’ అంటుంటే పెద్దోడి గొంతు ఉండ చుట్టుకపోయింది.
‘ఈ భూపోరాటం ఇప్పటిది కాదు బిడ్డా, ఎనకట రాజులు యుద్ధాలు జేసి రాజ్యాలను ఆక్రమించెటోళ్ళు, ఆ తర్వాత వచ్చిన దొరలు వాళ్ళ కాలంలో వేల ఎకరాలు మాయేననిరి, గిప్పుడు గిసోంటి భూ ఆక్రమన దారులు అందరు భూమి నాదంటే నాదని అమాయకుల మీద ప్రతాపం జూపిచ్చి భూములను ఆక్రమించుడు, లేకుంటే నయానో – భయానో బెదిరించి సంతకాలతో రాయించుకోబట్టిరి. రాను రాను ఇంకెన్ని ఘోరాలు చేస్తరో’ రాజేశ్వరమ్మ మనవళ్ళకు గతం, వర్తమానం, భవిష్యత్తును వివరిస్తుంది.
చెంపలపై చేతులు పెట్టుకుని వినయంగా వింటున్నారు ఇద్దరు మనవళ్ళు.
‘వీడు పట్నంల రియల్ ఎస్టేట్ దందా జేస్తాండట్నే’ అప్పుడే ఆడికచ్చి చెవులు రిక్కించివిన్న సోమేష్ అటూ ఇటూ జూసి మెల్లగా గుస గుస అన్నాడు.
‘భూమి విలువ – బంగారం విలువ తెలిసినోడు ఎప్పుడు ధనవంతుడే రా..’ సోమేష్ వెనుకచ్చి కూర్చున్న రవి అన్నాడు.
‘రోజు రోజుకు మనుషులు పెరుగుతున్నరు గని, భూమి పెరుగుతలేదు గదా బిడ్డా! మీ నాయన, చిన్నాయినలు ఎడ్డోళ్ళు గాబట్టే గదా! వాడు మనేంబడిబడ్డడు’ అంది రాజేశ్వరమ్మ.
‘ఏం జేయం బిడ్డా! ఇయ్యాల్నా, నిన్ననా వాడు కుట్రబట్టి వానికి మా ఉసురెన్నడు తల్గుతదో అక్కడిక్కడుండి ఇంటి కిరాయిలు గట్టలేక చస్తానం. కాలం మన కోసం ఆగదు గదా! ఆడపిల్ల ఎదిగే, దాని పెండ్లెట్ల చేయాల్నో అర్థమైతలేదు’ భారతి బాధగా అన్నది.
‘కష్టమో నష్టమో ఇంకోద్దిరోజులు సూడుండ్లక్కా ఏం జేస్తరు?’ రవి భారతమ్మతో అన్నాడు.
‘తెలిసినోళ్ళంత ఎక్కడికన్నబోయి బతుకండ్లని ఫోన్లు జేస్తాండ్లు వాళ్ళకేంది అంటరు ఊకుంటరు, కిరాయిలు గట్టుడంటే మాటలా పిల్లికూనల లెక్క తిరిగి తిరిగి ఈ ఆరోఇంట్లకచ్చినం రేపేమైతదో తెల్వని బతుకులుమాయి’ మనసులో బుగులు పడుతూ కంటి చెమ్మ భయటపడకుండా ఒత్తుకుంది భారతి.
‘ఇంతకు చెల్లెటు పోయిందే’ పెద్దోడు అటు ఇటు జూసి అన్నాడు.
‘సుజాత వాళ్ళింటికి పోయింది, మొన్న తోట ఏరిన కూల్లు ఇయ్యాలే పట్టుకరమ్మని తోలిన బిడ్డా!’
‘మన పరిస్థితి తెలిసి కూడా కూలి డబ్బులు ఆపుడేందే, అందుకే వాళ్ళకు పోకని చెప్పిన గదా’ కోపంగా అన్నడు పెద్దోడు.
‘ఏం జేద్దాం రా! ఊరిలో ఉన్నోళ్ళంతా వాని చుట్టాలేనాయే, వాళ్ళేవరు మనల్ని పిలువరు, పోకుంటే మన బతుకు గడవదు’ బాధగా అంది భారతి.
‘నారు పోసినోడు నీరు పోయడా బిడ్డా! ఎంత కాలం మనాదిబెట్టుకుని ఏడుస్తవ్’ కోడల్ను జూస్తూ అంది రాజేశ్వరమ్మ.
‘ఎనకటి బట్టి చుట్టూ ఎంత మంది బలగం ఉండెటోళ్ళు, ఇద్దరు పాలేర్లతోటి చక్కగా నడిసిన ఎవుసం కుప్పకూలి చేతులిరిగినట్లాయే! ఇప్పుడీ సీత కష్టం మాకేరావాల్నా, అయ్యో! బిడ్డలారా అన్నోళ్ళు లేకపోయిరి’ రందితో తల పట్టుకుని శూన్యంలోకి చూస్తూంది భారతి.
‘కాలం మారింది.. ఏందో గీ మనుషుల నడవడి మారింది. లంగలు, దొంగలు మాత్రమే బతుకేరోజులచ్చినాయి’ రవితో అంటుంటే సోమేష్ జేబుల ఫోన్ మోగింది.
‘ఎవరు పిలగా?’ కనుబొమ్మలెగరేసి అంది రాజేశ్వరమ్మ.
‘నా కెవలుజేత్తరే ముసల్దానా? మా బాపు జేసిండు అనుకుంటా’ సెల్ తీసి మాట్లాడి జేబులో పెట్టుకుని రవి భుజంపై చేయివేసిండు.
‘మా సూరయ్య మామోళ్ళ పరిస్థితి గిట్నే అయే. పక్కింటోడు పగబట్టి ఇంటి ముందట్నే దేవునిగ్రహాలు బెట్టిత్తే బలిగోరుడు పెట్టిందట్నే, ఇంట్లోల్లందరు సత్తాండ్లని ఊరిడిసిపోయిండ్లటా గిప్పుడు వాళ్ళ జాగంతా వాడే ఆక్రమించుకున్నడు’.
‘దేవుడు పగబట్టినా బతుకచ్చేమో గాని మనిషి పగబడితే బతకలేము బిడ్డా’ రాజేశ్వరమ్మ బాదగా అంది.
‘రేపు మా పరిస్థితి ఏందో అర్థమైతలేదు?’ భారతికి మనసులో ఆందోళన మొదలైంది. కాల్ల కింద భూమి కంపించి, గుండెల రాయిపడ్డట్టై మొఖం వివర్ణమైంది.
‘మనుషులు పిరికితనంగా ఉంటే ఎదుటోడు ఆడినంత ఆట – పాడినంత పాటైతది. నేను ఊర్కుంటానా. కుట్రలు జేసి మనకు ఇల్లైతే లేకుండా జేసిండు, నేను చచ్చినా వాన్ని ఇడిసిపెట్టా జూడు’ రాజేశ్వరమ్మ కోడలు మొఖం గమనించి ఆవేశంగా అంది.
‘నువ్ ఆవేశపడకే నాయనమ్మ నీకు అసలే బిపి వుంది, మనం ఇప్పుడు దవఖాండ్ల చుట్టూ తిరిగే పరిస్థితి లేదు’ చిన్నోడు సముదాయిస్తున్నాడు.
‘ఆవేశపడకుండా ఎట్లుంటన్రా. అది మా తాతలకానుండచ్చే ఆస్థి, ఆ బికారోడిని చేరదీస్తే వాడు తిన్నింటి వాసాలు లెక్కబెట్టిండు. మన ఉసురు తల్గి వాని వంశం నాశనమైపోతది’ రాజేశ్వరమ్మ నశెం డబ్బి బొడ్లె సంచిలకెళ్ళి తీసుకుంటా సాపిత్తాంది.
‘ఊకుంటే ఉసురే తలుగతది తీయే ముసల్ధానా’ అన్నాడు సోమేష్.
‘మీకేందిరా మీ అయ్య తెలివికల్లోడై అన్ని ముద్దుగ జేసుకచ్చిండి, మా పోరగాండ్లు ఎడ్డోల్లైటాల్లకు జూడు మా బతుకులేట్లైనయో. అటో ఇటో ఒక్కపోరడు గట్టిగా అడిగేటోడుండే, వాన్ని మింగేదాక ఇడిసిపెట్టలేదు ఆ.. నా.. కొడుకులు’ తిట్ల దండకం చదువతనే వున్నది రాజేశ్వరమ్మ.
‘నిన్న రాజైనోడు నేడు బంటైతడు, నేడు బంటైనోడు రేపు రాజైతడు. అన్నింటికి కాలమే సమాధానం చెబుతది’ పెద్దోడు మెల్లగా అన్నాడు.
‘రేపు గ్రామపంచాయతి బిల్డింగ్ శంకుస్థాపనకు మన ఎమ్.ఏల్.ఏ వస్తాండట, ఓసారి చెప్పి చూడరా’ సోమేష్ పెద్దోడితో అన్నాడు.
‘అవ్! బిడ్డా ఆ ఒక్కపనిజేరు, ఈ తాపకు కాకుంటే చూద్దాం’ భారతి మెల్లగా అంది.
‘రేపు అప్లికేషన్ ఇస్తాను, ఆ తరువాత ఏమైతదో చూద్దాం’ అసంపూర్ణమైన ఆలోచనతో అన్నాడు పెద్దోడు.
‘గా లీడర్లకు ఐదేండ్లకు ఒక్కసారి మాత్రమే మనం గుర్తుకొస్తం, ఆ తరువాత ఎప్పటి చిప్ప ఎనుగుల్నేనాయే’ రవి సాధారణ విషయంగా చెప్పిండు.
‘నూటికి ఒకలో ఇద్దరో నియతుగల్లోలు మాగుంటర్రా పిలగా’ రాజేశ్వరమ్మ మనవడికి చెప్పింది.
‘ఎవలే ముసలి ఇప్పుడు వాళ్ళకు మనం గాదు ముఖ్యం, గా బట్టబాజ్ గానసంటోడే గావాలే. వాడు ఊళ్ళోవాళ్ళకు పెట్టుబడికి అప్పులిస్తడు కాబట్టి ఆ నలుగురు వాని మాటింటరని నమ్మకం. రేపు ఏ లీడరచ్చినా వానింటికే వస్తాడు, విన్నా వానిమాటే ఇంటడు’ చిన్నోడు జరిగేది కండ్లకు కట్టినట్టు చెప్పిండు.
‘అమ్మ ఇగోవే డబ్బులు’ ఎండకు తలపై కప్పుకున్న చున్నీ తీసుకుంటూ భారతి చేతికి డబ్బులిచ్చి తల్లి పక్కన కూర్చుంది మాధవి.
సోమేష్, రవి మళ్ళస్తమనుకుంటా బోయిండ్లు.
భారతి ఒళ్ళో తలపెట్టి ఒరిగింది మాధవి. ముగ్గురు పిల్లలను తల్లి కోడి రెక్కల కింద పొదువుకున్నట్టు గుండెలకు హత్తుకుని ‘రేపు వీళ్ళను ప్రయోజకులను చేసి పెండ్లిల్లు చేసి కుటుంబాలేర్పర్చాలనే సుధీర్ఘ ఆలోచనలపడింది’.
‘మ్యావ్….మ్యావ్…’ అంటూ కిటికిలకెళ్ళి పిల్లి వంటింట్లకు దుమ్కింది. దాని పిల్లలు తల్లి చుట్టూ తిరుగుతున్నాయి. ‘ఈ పిల్లి లెక్కనే నేను పిల్లల తీసుకుని ఏడిండ్లు తిరగాలనే రాత రాసిండెమో దేవుడు’ మనసులో అనుకుంది భారతి.
‘శేఖరయ్య ఇల్లు కాలిజేయమంటాండు, వాళ్ళ కొడుకు, కోడలు పట్నంల కెళ్ళి వచ్చి ఇక్కన్నే ఎవుసం చేత్తరటా, పొల్లకు పట్నంల బొత్తిగ పాణం మంచిగుంటలేదటా ఇయ్యల్నో, రేపో వాళ్ళస్తే ఎట్లా? ఏ అసరాలేని బతుకులని ఒత్తుకొని వుంటిమి ఇప్పుడేం జేద్దాం?’ రాజేశ్వరమ్మ కోడలుతో అంది.
‘ఇంకా ఎన్నిరోజులు ఈ ముసుగుల గుద్దులాట. భయపడినకొద్ది వాడు తరుముతనే వుంటడు, తొందర్లోనే ఈ కథకు ముగింపు పాడాలి అత్తా’ కోపంతో భారతి పట పట పండ్లు కొరుకుతూ అంటుంటే మాధవిలేచి తల్లిమొఖంలోకి చూసింది.
‘ఎన్ని తరాలు మన వంశం ఆ జాగల్నే పుట్టి అక్కడ్నే పోయిండ్లో, వాని కారణంగా మీ మావ పుట్టినకానుండి ఎన్నడు ఇల్లిడిసిపెట్టి వుండనోడు ఊరవతలనే చచ్చిపోయే, కొడుకులు గట్లనే పోయిరి, గిట్లైతదని నేనెన్నడు కలగనలేదు బిడ్డా’ రాజేశ్వరమ్మ దీనంగా అంది.
‘వాడు వాని బుద్ది ఇంకెన్నటికి మారదు’ పెద్దోడు చిన్నోడు ముక్త కంఠంతో అన్నారు.
‘మనం మన జాగకాడికే పోదాము. వాడు, వాడి పెండ్లాం, వాని బలగం ఏం చేస్తరో జూద్దాం. ఆక్రమించుకున్న ఇల్లు జాగైన, పట్టా భూమైన మనది మనకు వచ్చేవరకు తిరుగుబాటు చేద్దాం’ గంభీరవదనంతో భారతి చెబుతుంటే రాజేశ్వరమ్మ చేతిలో కర్రను గట్టిగా పట్టుకుని రుద్రరూపిణిలా లేచింది.
సూర్యుడు పడమర అస్తమించి తూర్పున ఉదయించే సరికి పాత ఇంటడుగుకు చేరిండ్లు, ఆక్రమించగా మిగిలినదాంట్లో తాటి ఆకులతో గుడిసె వేసి చుట్టూ తడకలుకట్టి ఏడో ఇంట్లోకి అడుగుపెట్టిండ్లు. ఇంటి ముందు అలుకు చల్లుతుంటే ఇంటి పక్కోడు, వాడి భార్య కండ్లల్ల నిప్పులు పోసుకుని చూస్తున్నారు. వానికి వంతపాడే వాళ్ళు చేరి చెవులు కొరుక్కుంటున్నారు.
మంచం కింది పిల్లి ‘మ్యావ్….మ్యావ్..’ అంటూ ఒళ్ళు ఇరుసుకుంటొచ్చి కాళ్ళల్ల తిరుగుతుంటే ‘నువ్వు నీ పిల్లలను తీసుకుని ఏడో ఇంట్లకచ్చినవా’ అంటూ తల్లి, పిల్లలను మురిపెంగా నిమిరింది భారతి.
చిన్నోడు, పెద్దోడు సరుకులు సమాన్లు సర్ధి భారతి పక్కనే వచ్చి కూర్చున్నారు.
రాజేశ్వరమ్మ, భారతి పక్కన కూర్చుండి పొయిలో నిప్పురాజేయనికి అగ్గిపుల్ల గీసి ఆ మంటను చూపిస్తూ ‘మహా అయితే ఇంకెన్ని రోజులు, చీకటికి భయపడితే రేపటి పొద్దును చూడగలమా? పెద్దోడు చెప్పినట్టు రేపటి రోజు మన బతుకులు మారకపోతాయా చూద్దాం’ అంది.
‘నిస్సహాయులు చెంపదెబ్బ కొట్టకపోవచ్చు, ఎదురు తిరిగి మాట్లాడకపోవచ్చు, ఎదుటి వాడు దహించడానికి ఒక్క కంటి చూపు చాలదా? ఈ విషయం జ్ఞానమున్న ప్రతీవాడు గ్రహిస్తే అదే వాడికి చెంపపెట్టు కాదా?’ అన్నాడు పెద్దోడు.
భారతి పక్కింటి గుంపు వైపు చింత పిక్కళ్ళ ఎరుపెక్కిన కండ్లతో కసిగా చూసింది. ఆ చూపులకు వాడు తల దించుకున్నాడు. ఇది తన మొదటి విజయంగా భావించింది.
‘సత్యమార్గంలో ఇది మన కోసం చేసే ధర్మయుద్ధం ఇగ భయమెందుకు జయం మనదే’ అన్న పెద్దోడి మాటలకు అందరు ఒక్కసారి పిడికిలి బిగించారు.
పంచభూతాలు విజయోస్తూ అని దీవనార్థిపెట్టాయి.
– వజ్జీరు ప్రదీప్, 9989562991



