పేదింటి పిల్ల దుర్గ. ఆటలు, పాటల్లో మునిగే వయసు. తమ్ముడు అపూను తీసుకుని సంపన్నుల ఇంటి ముందుకు వెళ్లింది. నేతిలో పూరీలు వేయించి అమ్మేవాడు ఊళ్లోకి వచ్చాడు. వాడి దగ్గర ఆ ఇంటివాళ్లు పూరీలు కొంటున్నారు. నోరూరించే పూరీలు.. ఘుమఘుమలాడే పూరీలు.
దుర్గకీ, అపూకీ వాటిని తినాలని ఉంది. కానీ కొనాలంటే డబ్బేదీ? వాళ్లది కలిగిన కుటుంబం కాదాయె! తండ్రి హరిహరరారుకి వచ్చే కాసింత సంపాదనలో తల్లి సర్వజయ గుట్టుగా సంసారాన్ని లాక్కొస్తుంది. నలుగురు మనుషుల్ని పోషించడానికి అది ఏ మూలకి? ఇంక ఇలాంటి చిరుతిళ్లకు డబ్బులిమ్మంటే ఇస్తుందా? అందుకే ఆశగా ఆ ఇంటివారు తమను పిలిచి, తమకూ ఏమైనా పెడతారేమోనని చూస్తూ ఉన్నారు. ఆ పిల్లలు మరింత హెచ్చులు పోతూ లొట్టలేసుకుని తింటూ ఊరిస్తున్నారు.
పేదవారికి ఆరాటం.. కలిగిన వారికి చెలగాటం. ఈ పేద పిల్లల కళ్లు పడి దిష్టి తగులుతుందని అనుకుందో ఏమో, ఆ ఇంటి పెద్దావిడి ఒక్కసారిగా గట్టిగా కసిరింది. పిల్లలు లోపలికి వెళ్లారు. ఆ గసిరింపు తమకేనని అర్థమయ్యే వయసు అపూకు లేదు. కానీ దుర్గకి అర్థమైంది. అక్కడి నుంచి లేచి వచ్చేసింది. చిన్నబుచ్చుకున్న తమ్ముణ్ని సముదాయించాలనుకుంది.
‘ఆ పూరీలు ఒట్టి నాసిరకం సరుకు. ఈసారి పండగకు నాన్ననడిగి రెండ్రూపాయలు తీసుకుంటాను. ఎంచక్కా మిఠాయిలు కొనుక్కొని తినొచ్చు’ అంది. ఆ మాట వింటే తన తమ్ముడి మనసులో బాధ పోయి, ముఖంలో నవ్వు మెరుస్తుందని ఆ పిచ్చిపిల్ల ఆశ. అక్క చెప్పిన మాట వినగానే అపూ ముఖంలో కొంత వెలుగు కనిపించింది. అక్కతో కలిసి అడుగులేస్తూ కాసింత దూరం పోయాక ‘పండగ ఎప్పుడొస్తుందక్కా?’ అని అమాయకంగా అడిగాడు. నాకు చాలా ఇష్టమైన ‘పథేర్ పాంచాలీ’ నవలలో ఒక సన్నివేశం ఇది. 1929లో బెంగాలీ రచయిత బిభూతి భూషణ్ బందోపాధ్యాయ రాసిన నవలను మద్దిపట్ల సూరి తెలుగులోకి అనువదించారు. ఆయన అనువాదం ఎంత బాగుంటుందంటే, ఇది బెంగాలీ అనువాద నవల అని అనడానికి మనకు మనసు రానంత. ‘పథేర్ పాంచాలీ’ అంటే ‘బాట పాడిన పాట’ అని అర్థం.
స్వాతంత్య్ర పూర్వం బెంగాల్ ప్రాంతంలో నిశ్చిందిపురం అనే ఊరిలో ఓ నిరుపేద కుటుంబం కథే ఈ నవల. హరివంశరారు, భార్య సర్వజయ, పిల్లలు దుర్గ, అపూ.. ఇవీ వారి కుటుంబం. ఆ పిల్లల మేనత్త ఇందిర కూడా ఈ నవలలో కనిపిస్తుంది. అపూ పుట్టిన కొంతకాలానికి వద్ధాప్యంతో ఆమె కాలం చేస్తుంది. దారిద్య్రం కారణంగా ఆ ఇంటి మనుషులు పడ్డ ఇబ్బందులు, వారి ప్రేమలు, వారికి పరిచయమయ్యే మనుషులు, వారికి ఎదురైన అనుభవాలు ఇవన్నీ ఈ నవలలో బిభూతి భూషణ్ పొందుపరిచారు. పల్లెజీవనాన్ని, అక్కడి ప్రజల మనస్తత్వాలను గమనించడానికి ఈ నవల కొంత తోడ్పడుతుంది.
దుర్గ, అపూ.. ఇద్దరూ చిన్నపిల్లలు. బీదరికం వారి కుటుంబానికే కానీ, వారి ఆశలకు, ఆకాంక్షలకు కాదు. ఆ చిన్నఊరే వారి ప్రపంచం. అక్కడ నేర్చుకున్న విషయాలే వారికి లోకజ్ఞానం. అపూ, దుర్గలకు జరిగే ప్రతి అనుభవాన్ని రచయిత ఎంత చక్కగా రాశారంటే, ఇప్పటికిప్పుడు వెళ్లి వారిని చూడాలన్న ఆరాటం మనసులో చెలరేగుతుంది. డబ్బు లేని ఒకే ఒక్క కారణంతో మనసులోనే వారు దాచుకున్న ఆశలను తెలుసుకొని బాధగా అనిపిస్తుంది. రైలు చూడాలన్న కోరిక తీరకుండానే, జ్వరంతో దుర్గ మరణించిన సన్నివేశం చదువుతూ ఉంటే దు:ఖం పొంగుకొస్తుంది. అంత ఆపత్కాలంలో దుర్గ తండ్రి ఆ ఇంట్లో లేకపోవడం, దుర్గకు మందుమాకూ ఇప్పించలేక తను మరణించడం తల్చుకున్నప్పుడల్లా మనసు వేదనతో నిండిపోతుంది.
మనసును మెలిపెట్టే అంశాలతోపాటు హదయాన్ని ఉల్లాసపరిచే అంశాలు కూడా ఈ నవలలో ఉన్నాయి. జీవితమంటే కన్నీళ్లు, నవ్వులు ఉన్నట్టే, ఈ నవల కూడా రెండింటినీ మిళితం చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక ఆ ఊరిలో జీవించలేక హరిహరరారు, సర్వజయ, అపూ కాశీకి వెళ్లడం, అక్కడ అనారోగ్యంతో హరిహరరారు మరణించడం, ఆ తర్వాత ఓ ధనవంతుల ఇంటికి సర్వజయ వంటమనిషిగా వెళ్లడం, తల్లి వెంట అపూ వెళ్లడం, అక్కడి అనుభవాలతో నవల ముగుస్తుంది. ఈ నవలకు కొనసాగింపుగా 1932లో బిభూతిభూషణ్ ‘అపరాజితో’ అనే నవల రాశాను. అపూ పెద్దవాడైన తర్వాత జరిగిన అనుభవాలతో కూడిన కథ అందులో ఉంటుంది.
ఈ నవల ఇప్పటికి ఓ 30 సార్లు చదివి ఉంటాను. చదివిన ప్రతిసారీ కొత్తగా అనిపిస్తుంది. కొత్త విషయమేదో కనిపిస్తుంది. వారి జీవితాల్లోని వేదన, ఆనందం, అవమానం, ప్రేమ, ఆప్యాయతలు హదయాన్ని పరిపూర్ణం చేస్తుంటాయి. సర్వమానవులను ప్రేమించి, ఆదరించే గుణాన్ని తట్టి లేపుతాయి. నా ఆలోచనా విధానాన్ని తీర్చిదిద్దిన నవల ఇది. అందుకే ఈ పుస్తకం అంటే నాకు చాలా ఇష్టం. – వి.సాయివంశీ
జీవన గతులను సజీవంగా ఆవిష్కరించిన నవల
10:50 pm