అసమానతలకు, అవమా నాలకు, అన్యాయలకు గురవుతూ సమాజంతో పాటు కుటుంబ సభ్యుల నుండి చీదరింపులకు గురవుతున్న వికలాంగుల్లో చైతన్యం నింపి, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒంటరిగా ఉన్న వారిని ఐక్యం చేసి ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం పోరుబాట పట్టించేందుకు ఏర్పడిందే వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ). పదిహేనేండ్లుగా వికలాంగుల కోసం అనేక పోరా టాలు నిర్వహించి, విజయాలు సాధించి దేశంలోని వికలాంగులకు ఒక పోరాట దిక్సూచిగా నిలబడింది. 2010 కంటే ముందు దేశవ్యాప్తంగా వికలాంగుల హక్కుల కోసం పనిచేసే సంఘాలు లేవు. వికలాంగుల సమస్యలు జిల్లా, రాష్ట్రమే కాదు, కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయనే ఆలోచనతో, వికలాంగులను ఐక్యం చేసి, పోరాటలు నిర్మించేందుకు 2010 ఫిబ్రవరి 21-22 తేదీల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తాలో ఆత్మగౌరవం, హక్కుల సాధన లక్ష్యాలతో క్రాంతి గంగూలీ కన్వీనర్‌గా ఎన్‌పీఆర్‌డీ ఆవిర్భవించింది. ఏడు రాష్ట్రాలతో ప్రారంభమై పదిహేడు రాష్ట్రాల్లో విస్తరించి వికలాంగుల హక్కుల సాధన కోసం పోరాడుతున్న ఏకైక వేదిక.
2010కంటే ముందు దేశంలో వికలాంగుల కోసం పోరాడే సంస్థలు లేవు. ఎన్‌పీఆర్‌డీ ఏర్పడే నాటికి దేశంలో వికలాంగులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. 1995 పిడబ్యూడి చట్టం అమల్లో ఉన్నా వికలాంగుల సంక్షేమంతో పాటు ఇతర అనేక అంశాలపై స్పష్టత లేదు.నూతన వికలాంగుల చట్టం చేయాలనే డిమాండ్స్ 2011 నుండి 2016 వరకు దేశవ్యాప్తంగా దశల వారీగా ఉద్యమాలు నిర్వహించి, సీపీఐ(ఎం) పార్లమెంట్ సభ్యురాలు బృందా కరత్ నేతృత్వంలో ఎన్‌పీఆర్‌డీ ప్రతినిధి బృందం ముసాయిదా చట్టాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి అందచేసింది. చట్టం సాధన కోసం పార్లమెంట్ లోపల, బయట ఎన్‌పీఆర్‌డీ ఆధ్వర్యంలో చేసిన పోరాట ఫలితమే 2016 ఆర్‌పీడీ చట్టానికి నాంది పలికింది.2016వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టానికి రూల్స్ రూపొందించాలని పోరాటాలు చేసి అనేక రాష్ట్రాల్లో నిబంధనలు సాధించింది.కేంద్ర ప్రభుత్వం అమోదించిన 2007 ఐక్య రాజ్య సమితి హక్కుల ఒప్పంద పత్రం అమలు కోసం పోరా టాలు నిర్వహిస్తున్నది.
2016వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్ 89, 92, 93లకు సవరణలు చేయాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణ యానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాలు చేసి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తిప్పికొట్టింది.అలాగే పెన్షన్‌లో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.300 నుండి 5వేలకు పెంచాలనే డిమాండ్స్‌పై దేశవ్యాప్తంగా పోరాడుతూనే 2025 ఫిబ్రవరి 10న వేలాది మంది వికలాంగులతో ఢిల్లీ నడిబొడ్డున కదంతొక్కింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ కోసం అనేక పోరాటాలు చేస్తున్నది.21రకాల వైకల్యాలకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని, సంక్షేమ పథకాల్లో ఐదుశాతం రిజర్వేషన్స్ అమలు కోసం, యూనిక్ డిసెబుల్డ్ ఐడి కార్డ్స్ విక లాంగులకు జారీ చేయాలని ఉద్యమాలు చేస్తున్నది. మహిళా వికలాంగులు, వికలాంగులపై జరుగుతున్న హింస, లైంగిక వేధింపులపై వికలాంగులను చైతన్యం చేస్తూ ముందుకు సాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న వికలాంగుల వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహించడంలో దేశంలో ఎన్‌పీఆర్‌డీ అగ్రస్థానం లో ఉంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో వికలాంగుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తున్నది. పెన్షన్ హక్కుగా సాధించేందుకు దేశ వ్యాప్త పోరాటాలకు రూపకల్పన చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నల్లగొండ, రంగారెడ్డి, మెదక్, వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో 2014 తర్వాత విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో విస్తరించింది. 25 జిల్లాల్లో వికలాంగుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నది. వికలాంగుల హక్కుల పరిరక్షణకు, ప్రభుత్వ పథకాల్లో వాటాకు, పెన్షన్ పెంపునకు దశాద్దకాలం(2014-2024) పాటు చేసిన పోరాటాల ఫలితంగా పెన్షన్ రూ.500 నుండి 4016కు పెరిగింది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ రూ.6వేల పెన్షన్ కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో రద్దయిన వికలాంగులకు పోరాడి వేలాది మందికి పదకొండు నెలల పెన్షన్ తీసుకొచ్చింది.అలాగే అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డ్స్ వికలాంగులకు కేటాయించాలని పోరాడి సాధించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005లో ప్రారంభమైన వికలాంగులకు 2011 వరకు జాబ్ కార్డ్స్ మంజూరు చేయలేదు.దీనిపై రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేసి లక్షలాది మంది వికలాంగులకు జాబ్ కార్డ్స్, పని సాధించింది.ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్స్ అమలు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీలో దీర్ఘకాలిక పోరాటం చేయడం వలన వికలాంగులైన విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పించింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 21 నుంచి 27వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాలకు శ్రీకారం చుట్టింది. జిల్లా, మండల, గ్రామాల్లో జెండా ఆవిష్కరణాలు చేయాలని పిలుపునిచ్చింది.వారం రోజుల పాటు రక్తదాన శిబిరాలు, పండ్ల పంపిణీ, మొక్కలు నాటడం వంటి బహుముఖ కార్యక్రమాలు నిర్వహించి విక లాంగులను భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎన్‌పీఆర్‌డీ డిమాండ్ చేస్తున్నది. 2016 ఆర్‌పీడీ చట్టంతో పాటు 2017 మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్, ఐక్య రాజ్యసమితి హక్కుల ఒప్పంద పత్రం, నేషనల్ పాలసీ, నేషనల్ ట్రస్ట్ చట్టాల అమలు కోసం పోరాడాలని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్, నామినేటెడ్ పదవుల సాధనకు ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చింది. వికలాంగుల సంక్షేమం సాధికారత, సమగ్రాభివృద్ధి సాధించుకోవడానికి చేపట్టే ఉద్యమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎన్‌పీఆర్‌డీ కోరుతున్నది.
యం.అడివయ్య
9490098713