నట్టింటి విశ్వరూపులు!

Nutty Universe!అసలు లేనే లేడనుకున్న వాన్ని ఉన్నాడని తలచి ఊరేగింపులతో
ఊహించుకున్న మూర్తులతో
ఆలయాల ప్రతిష్ఠాపనలు వెల్లువవుతున్న కాలమిది!
కళ్ళముందు కనిపించే చిరునవ్వుల చిట్టి పాపలు
అసలైన దేవుని ప్రతిరూపాలని తరచి కళ్ళు తెరిచి చూస్తే
నట్టింటనే వెలసిన నిజమైన అవతారాలు వీళ్లే!

అమ్మ కడుపున కమ్మగా ఉమ్మ జలాన కళ్ళు తెరవక
ధ్యాన ముద్రలో బొడ్డుతాడు
ఆసరాగా ఈదులాడే మత్స్యావతారం తానే కదా !
తల్లి చనుబాల అమతాన్ని కడుపారా గ్రోలి నవ్వుల కేరింతలతో
కాళ్లూ చేతులూ టపటపలాడించే వటపత్రశాయి రూపం తనదే !

పాలకడలిని చిలికి అమత మథనానికి సాయమందించిన కూర్మావతారం
నవ్వుతూ వడివడిగా నేలమీద ప్రాకే తనను చూసాకే తెలిసింది!
వద్దన్నా కావాలన్నది చేతికందక ఉక్రోషంతో ఊగిపోతూ
దిక్కుల్ని ఝడిపిస్తూ ఏడ్చే ఉగ్ర బాలనారసింహుడు తానే!

ముద్దొచ్చే చిరు బొజ్జతో మడతేసుకున్న కాళ్ళతో నట్టింట కొలువై సేదదీరే
తొండంలేని పాలదంతాల చిట్టి బాలగణపయ్య తానే కదా!
ఆడి పాడి అల్లరి చేష్టలతో ఇల్లంతా సందడి చేసి
అలసి ఆదమరిచి నిద్రించే ప్రశాంత ధ్యాన యోగి
తథాగతుడు తనలోనే నిండి దర్శనమవుతాడు!

కోపంతో గద్దించినా చెదరని చిరునవ్వులతో చిద్విలాసుడై
కనిపించగానే పరుగున దరిచేరి అడగకనే ముద్దులు కురిపిస్తూ
అందరినీ ప్రేమతో అలరించే బాల ఏసు తానేనేమో ?

ఎదిగే పసిపాప దశలన్నీ ఎరిగిన జీవ పరిణామమేనని
బాల్యం మానవ జన్మకు మరపురాని వరమని
నట్టెదుట నడయాడే మాయామర్మ మెరుగని
పసిడి చిన్నారులు మానవజాతి మణిదీపాలని
మమతలతో బాటు మనిషితనపు ఉగ్గుపాలను
రంగరించి వారిని రేపటి ఉదాత్త హదయులుగా
ఎదిగేలా కాపాడుకుందాం!
– డా|| కె. దివాకరా చారి, 9391018972

Spread the love