ఆకుపచ్చతనం

మనమో చెట్టుగా నిలిచినందుకు
చిక్కటి చెట్టు ఛాయలో కొమ్మల బాహువుల నడుమ
అపురూపంగా అల్లుకున్న అందమైన గూడు కౌగిట
మనపిల్లలు పిచ్చుకలై కేరింతలతో పసరు రెక్కల్ని
పరచుకుంటూ ఆకాశాన్ని అందుకోవాలని ఆనందంగా
ఎగరాలని తపించింది మనమే!

దట్టపు ఆకుల చేతుల చాటున కష్టాల జడి వానలనుండి
సమస్యల ఈదురు గాలుల్నుండి కబళించ వచ్చే విషనాగులతో
జీవన సమరం చేస్తూ మిమ్ము కాపాడుకున్న పేగు తడి మాది!

రెక్కలొచ్చి ఎగిరి ఆకాశాన్ని ముద్దాడుతూ సాగే మీరు
రంగు రంగుల హరివిల్లులను జీవన కాన్వాసుపై చిత్రిస్తుంటే
లోలోన మురిసి పోతుంటాము!

కలిసి పండించిన ప్రేమబీజాలను మీనోట కరుచుకుని నలుదిశలా
స్నేహవనాలను నాటుతున్నందుకు చెదరని చెట్టుగా ఇద్దరం మరింత
గర్వంతో నిటారవుతుంటాం !

ఒక్కోసారి పిల్లల్లేక ఇల్లుబోసిపోయి పిట్టలు కనిపించని చెట్టులా
నిశ్శబ్దం కమ్ముకున్నప్పుడు ఒకరికి ఒకరమై చెట్టూ గూడూ
మేమే నిండి పిల్లల జ్ఞాపకాలతో పిల్లలమై ఊసులాడుకుంటాం!

ఎదిగి ఎగిరి ఆకాశమంతటా చెదరిన నిన్నటి పిల్లలు నేడు
కువకువల చంటి పికాలకూడి మాతచెట్టును మరవకుండా
వచ్చి ఒడిలోకి వాలతాయని…
వాడిపోకుండా ప్రతి వసంతాన చిగురిస్తూ పుష్పిస్తూ పచ్చగా
పరిమళాలను పంచేందుకు ఎదురు చూస్తోంది అమ్మ చెట్టు!

కనిపించే పచ్చాకుతనం తానైతే ఎద లోతుల్లో బలంగా నిలిచిన
కనిపించని చెట్టుమూలవేరు నేనేనా ?
(ఆకుపచ్చ ‘నందు’కు ప్రేమతో)
– డా|| కె. దివాకరాచారి, 9391018972

Spread the love