సుట్టాలొచ్చిర్రు

Suttalochirruచాన్నాళ్ల తర్వాత మా ఇంటికి
సుట్టాలొచ్చిర్రు.. ఓట్ల పండక్కి
మాయమ్మకి శీరిచ్చి..
మయ్య చేతిలో రంగునీళ్ళ బాటిలెట్టి
మా చింటూగానికి కిరికేటు కిట్టిచ్చి
యింటికి నాలుగు బిర్యానీ పొట్లాలిచ్చి
ఆళ్ళ పార్టీకోటేయమన్నరు

శీరందుకుని
ఆకసాన్నంటిన గ్యాసుబండ రేటు
మర్సింది మాయమ్మ
బాటిల్‌ శేతిలడంగనే
వంద దాటిన పెట్రోల్‌ రేటు మర్సిండు మయ్య

గప్పుడు యాది కొచ్చింది
మర్సింది మా అయ్యవ్వలు గాదు .. నేనని!
లేకపోతేంది..
మా కట్టెల పొయ్యికి
గ్యాస్‌ కనెక్షన్‌ యాడిది పొగగొట్టందప్ప
మయ్య సైకిల్కి పెట్రోల్‌ ట్యాంకెక్కడిది
సగమూడిన పెడల్దప్ప.

సూడబోతే
గబుక్కున బిర్యాని పొట్లమందుకుని
బుక్కుతున్న చింటుగాడి ముంగట
రోజుతినే పచ్చడి మెతుకుల పళ్ళెం
శిన్న బొయింది
రంగునీళ్ళ మత్తు ముంగట
సూర్లనుంచి కుర్తన్నాన తేలిపోయింది
కొత్త శీర జూసి కాళ్ళీగున్న బట్లగూడు మాత్రం ముర్సిపోయింది.

ఓటుకింతని నా శేతిలెట్టిన పైకంజూసి
రాయకుండ రద్దైన ఉజోగ్గ పరిచ్చ
పస్టుజీతంమొచ్చినంత సంబరమైంది.

గిన్ని ఇంతలు జూశాక అన్పితాంది
గీ సుట్టాలెంత మంచోళ్ళు
ఐదేండ్లకోపాళి గాక
నెలనెలా ఒత్తే ఎంత బాగుండని.
– గుడిసె.రాజశేఖర్‌, 9885717740

Spread the love